వైఎస్‌ఆర్‌సీపీతో తెగదెంపులు చేసుకున్నా:మాజీ ఎమ్మెల్యే రాపాక
జనసేన నుంచి గెలిచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు. తాజాగా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీతో తెగదెంపులు చేసుకున్నానని, త్వరలో మరో పార్టీలో చేరుతానని ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తడిమండలోని తన నివాసంలో ఆదివారం రాపాక మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీని, ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పని చేశానన్నారు. అంత కష్టపడి పని చేసినా తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో కష్టపడి పని చేసినా తనకు రాజోలు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వ లేదని మండిపడ్డారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టిక్కెట్ ఇచ్చారన్నారు. తనకు ఇష్టం లేక పోయినా పెద్దల సలహా మేరకు అమలాపురం ఎంపీగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేశానని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎస్‌ఆర్‌సీపీతో తెగదెంపులు చేసుకుంటున్నానని, త్వరలో మరో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాపాక ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. జనసేనలోకి వెళ్తారా లేక టీడీపీలో చేరుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.