
పోలవరం ప్రాజక్టు
పోలవరం నష్టపరిహారం లెక్కల్లో రు.19వేల కోట్లు తేడా
గత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలనంది. ఇప్పటి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదంటున్నది. మరి డబ్బులు ఏమయ్యాయి?
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వవలసిన నష్టపరిహారం గురించి, అటవీ హక్కుల చట్టం క్రింద వ్యక్తిగత, కమ్యూనిటీ పట్టాల పంపణీ గురించి లోతైన దర్యాప్తు అవసరమని మాజీ ఐఎఎస్ అధికారి, గిరిజన హక్కుల, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు డా. ఇఎస్ శర్మ అభిప్రాయపడుతున్నారు.
పోలవరం ప్రాజక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం మీద గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, సుమారు రు.19,080 కోట్లు తేడావస్తున్నది ఆయన అన్నారు. అందుకే దీనిమీద దర్యాప్తు జరగాలని, ప్రభుత్వం స్పష్టమయిన ప్రకటన చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఒక లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా, లక్షకు పైగా ఆదివాసీలు నిర్వాసితులు అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజక్టు వల్ల నిర్వాసితులు, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ క్రింద వారికి ఉన్న హక్కులను కోల్పోవడమే కాకుండా, 2006 అటవీ హక్కుల చట్టం క్రింద పోడు వ్యవసాయం చేస్తున్న వారికి రావాల్సిన వ్యక్తిగత, కమ్మూనిటీ పట్టాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.
నిర్వాసితులకు నష్టపరిహారం:
ఒక వార్తా కథనం ప్రకారంమొదటి ఫేజ్ (41. 5 మీటర్ల లెవెల్) లో 20,946 కుటుంబాలు, రెండవ ఫేజ్ (45. మీటర్ల లెవెల్) లో 85,000 కుటుంబాలు నిర్వాసితులు అవుతారు. వారికి ఇవ్వవలసిన నష్టపరిహారం, మొదటి ఫేజ్ లో 6-7,000 కోట్ల రూపాయలు, రెండవ ఫేజ్ లో 30,000 కోట్ల రూపాయలని అంచనా వేయడం జరిగింది.
2025 మార్చ్ 27న, రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ప్రకారం, 2019-24 లో ముందున్న ప్రభుత్వం నాటి నిర్వాసితులకు ఎటువంటి నష్ట పరిహారం జమ చేయలేదు.
2022 సెప్టెంబర్ 19 న నాటి ప్రభుత్వం తెలియజేసిన వివరాల ప్రకారం 14,110 నిర్వాసితులకు 19,080 కోట్ల రూపాయల నష్టపరిహారం అప్పటికే ఇవ్వడం జరిగింది.
ఈ రెండు ప్రకటనలలో తెలియజేసిన వివరాల ఆధారంగా, ముందున్న ప్రభుత్వం ప్రస్తావించిన రు 19,080 కోట్ల రూపాయల నష్టపరిహారం దుర్వినియోగం అయినట్లు కనిపిస్తోంది. ఆ మొత్తం ఎవరి అకౌంట్లలలో జమ అయిందో దర్యాప్తు చేయించవలసిన అవసరం ఉంది.
డాక్టర్ ఇఎెఎస్ శర్మ
5వ షెడ్యూల్ క్రింద, 2006 అటవీ హక్కుల చట్టం క్రింద హక్కుల పరిరక్షణ:
ప్రాజెక్టు క్రింద నిర్వాసితులయ్యే ఆదివాసీలు, 5వ షెడ్యూల్ క్రింద వారికి ఉన్న హక్కులను కోల్పోవడం జరుగుతుంది. ఆ విషయంలో, ప్రభుత్వం వారి హక్కులకు ఏవిధంగా రక్షణ కలిగిస్తారో, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ ను సంప్రదించి, ఒక సమగ్రమైన ప్రణాళిక అమలు చేయాలని డాక్టర్ శర్మ కోరారు.
అదే కాకుండా, ప్రాజెక్టు క్రింద అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలకు, 2006 అటవీ హక్కుల చట్టం క్రింద, వ్యక్తిగత, కమ్మూనిటీ పట్టా హక్కులు రావాల్సి ఉంది. 2019 లో రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసిన వివరాల ఆధారంగా, పోడు వ్యవసాయదారులకు రావలసిన వ్యక్తిగత పట్టాలే కాకుండా, అదనంగా 70,724 ఎకరాల భూముల విషయంలో 167 కమ్మూనిటీ పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో అక్కడి ఆదివాసీ గ్రామసభలను సంప్రదించాలి. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం తత్క్షణం చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా విస్తృతంగా నష్టపోయేది ఆదివాసీలు మాత్రమే అని ప్రభుత్వం గుర్తించాలి. ఏమైనా సరే వారికి అన్యాయం జరగకుండా చూడడం ప్రభుత్వం బాధ్యత అని చెబుతూ మీద సూచించిన నిధుల వ్యత్యాసం మీద ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఒక ప్రకటన చేయాలని ఆయన లేఖలో కోరారు.
Next Story