
గాంధీ పేరు చెరిపి 'జీ రామ్ జీ' అని పెట్టారా!
విపక్షాల నిరసనల మధ్య జీ రామ్ జీ బిల్లుకు లోక్ సభ ఆమోదం
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. మహాత్మాగాంధీ పేరు తీసేయడం ఒకటైతే బీజేపీ అభివాదమైన రామ్, రామ్ జీని (జీ రామ జీ) గుర్తు చేసేలా పేరు పెట్టడం మరో ఎత్తయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన "వికసిత్ భారత్ — గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్ - 2025 (G-RAM G)"ను గురువారం (డిసెంబర్ 18) లోక్ సభలో పాసైంది. ఈ సందర్భంగా పార్లమెంటులో పెద్దఎత్తున గొడవ జరిగింది. గ్రామీణ కార్మికులకు హామీనా… లేక హక్కుల కోతనా?' అనే దానిపై చర్చ సాగింది. ఈ బిల్లు- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఓ పథకంగా మిగులుతుందని విపక్షాలు ఆరోపించాయి.
మరోపక్క, G-RAM G సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. విజయవాడకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నేత దీనిపై వ్యాఖ్యానిస్తూ మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సెను గుర్తుచేసుకునేలా 'G 'ని చేర్చారా అని సెటైర్ వేశారు. ఇంకో నాయకుడైతే మహాత్మాగాంధీని గాడ్సే కాల్చిచంపునపుడు 'హే రామ్' అంటే ఇప్పుడు 'G-RAM G' అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది గాంధీని మరోసారి మర్డర్ చేయడమేనని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు జమలయ్య ధ్వజమెత్తారు.
గాడ్సే వారసులైన మోదీ, మహాత్ముని సందేశాన్ని, ఆదర్శాలని అవమానించిన దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గాంధీ ఆదర్శాలను, విలువలను పూర్తిగా కాలరాసిందే బీజేపీ అని విమర్శించారు. గాడ్సే వారసులైన, RSS ప్రతినిధులైన వీరు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా అవహేళన చేసి దేశద్రోహులనిపించుకున్నారని షర్మిల ఆరోపించారు. నేడు మోదీ చెంచా పార్టీల్లా మారిన టీడీపీ, జనసేన, వైసీపీ, ఇంత దారుణం జరుగుతున్నా నోరు మెదపలేకపోవటం వారి రాజకీయ విలువల పతనానికి అద్దం పడుతోందని షర్మిల అన్నారు.
బిల్లుకు లోక్‌సభ ఆమోదం...
‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. బిల్లు (VB G RAM G Bill)కు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్ష ఎంపీలు సభ మధ్యలోకి వచ్చి నిరసన చేపట్టాయి. కొందరు ప్రతిపక్ష నేతలు ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.
అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బదులిచ్చారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ‘‘బాపూ సిద్ధాంతాలను కాంగ్రెస్ సర్కారు చంపేసింది. కానీ, ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోంది. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో గాంధీజీ కలలను మేం సాకారం చేస్తున్నాం’’ అని తెలిపారు.
ఎన్నికల కోసమే గాంధీ పేరు చేర్చి..
ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ‘‘తొలుత ఉపాధి హామీ పథకానికి NREGA అనే పేరు ఉండేది. ఆ తర్వాత 2009లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు చేర్చింది. అంతేకాదు.. వారి హయాంలో ఈ పథకం అమలులో అనేక లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. కూలీలపై ఎక్కువ ఖర్చు చేసి.. మెటీరియల్ కొనుగోలుకు తక్కువ వెచ్చించారు’’ అని చౌహన్ మండిపడ్డారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలను ప్రస్తావిస్తూ.. గతంలోనే అనేక పథకాలకు కాంగ్రెస్ గాంధీ-నెహ్రూ పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
అసలేమిటీ పథకం..
MGNREGA అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా, ఉపాధి హామీ పథకం. పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా దాదాపు రెండు దశాబ్దాల కిందట ‘ఎన్‌ఆర్‌ఈజీఏ’ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభమైంది. తర్వాత 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మారింది.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఇది అమలులో ఉంది. ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల మంది మంది కార్మికులు ఈ పథకంలో నమోదు కాగా, వారిలో 14. 33 కోట్ల మంది నిరంతరం పనిచేస్తున్న క్రియాశీల లబ్ధిదారులు.
దేశవ్యాప్తంగా 2.69 లక్షల గ్రామ పంచాయతీలు, 7,000కు పైగా బ్లాక్‌లు, 700కు పైగా జిల్లాలకు ఈ పథకం విస్తరించి ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న మార్పు కూడా కోట్ల రూపాయల ఖర్చుకు దారి తీస్తుంది.
బిల్లులో ముఖ్య మార్పులు:
పని దినాలు: 100 నుంచి 125 రోజులకు పెంచడం (ప్రతి గ్రామీణ కుటుంబానికి చట్టబద్ధ హామీ).
నిధుల విభజన: గతంలో కేంద్రం 90-100% భరించేది; ఇప్పుడు 60:40 (కేంద్రం 60%, రాష్ట్రాలు 40%) – రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరగడం.
వ్యవసాయ సీజన్‌లో విరామం: పంటల నాటు, కోత సమయాల్లో సంవత్సరానికి 60 రోజుల వరకు పనులు నిలిపివేయవచ్చు (వ్యవసాయ కూలీల కొరత నివారణకు).
ప్రణాళిక, అమలు: డిమాండ్-డ్రివెన్ (కూలీలు కోరినప్పుడు పని ఇవ్వడం) నుంచి సప్లై-డ్రివెన్ (కేంద్రం నిర్ణయించిన ప్రాంతాలు, బడ్జెట్ పరిమితులతో)కి మార్పు.
పేరు మార్పు: మహాత్మా గాంధీ పేరు తొలగించి, వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా కొత్త పేరు.
తలెత్తిన కీలక ప్రశ్నలు, వివాదాలు:
గత చట్టం డిమాండ్ ఆధారిత హక్కు (కోరిన 15 రోజుల్లో పని ఇవ్వకపోతే నిరుద్యోగ భత్యం).
కొత్త బిల్లు బడ్జెట్ పరిమితులు, కేంద్ర నియంత్రణతో హక్కును బలహీనపరుస్తుందని ప్రతిపక్షాలు (కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఇతరులు), కార్మిక సంఘాలు (NREGA సంఘర్ష్ మోర్చా) విమర్శిస్తున్నాయి. ఇది "హక్కు" నుంచి "పథకం"గా మార్చే కుట్ర అని ఆరోపించాయి.
రాష్ట్రాలపై ఆర్థిక భారం:
40% నిధులు రాష్ట్రాలు భరించాల్సి రావడంతో ఆర్థికంగా బలహీన రాష్ట్రాల్లో పథకం నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే నిధుల కొరత ఉన్న రాష్ట్రాలు (ఉదా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ప్రభావితమవుతాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన "వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్ - 2025 (G-RAM G)" తో MGNREGA పథకం రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతోంది. ఈ బిల్లులో ప్రతిపాదించిన 125 రోజుల ఉపాధి హామీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఆందోళన కలిగించే అనేక అంశాలు కనిపిస్తున్నాయి.
ఉపాధి హామీ అనేది కేవలం పథకం కాదు- ఇది గ్రామీణ భారతానికి జీవనాడి. దాన్ని బలహీనపరచకుండా, మరింత బలోపేతం చేసే దిశగానే మార్పులు రావాలి అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య కోరారు.
Next Story

