కవి కంఠంలో.. ఎన్నికల భారతం
x

కవి కంఠంలో.. "ఎన్నికల భారతం"

ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. వారిలో కవులు కూడా ఉన్నారు. వారిని రాసిన కవిత సమాహారమే.. ‘ఎన్నికల భారతం’


కవి గానం చేస్తాడు

గతకాలపు గాయాలకు లేపనాలు పూస్తూ...

కవి కావ్యం రాస్తాడు

వర్తమానపు వైపరీత్యాలను వ్యక్తీకరిస్తూ...

కవి కాల జ్ఞానం ఆలపిస్తాడు

భవిష్యత్తు బాగోగులను హెచ్చరిస్తూ...

అదుగో ఆపనే చేసింది

అభ్యుదయ రచయితల సంఘం (అరసం). ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేటి ఎన్నికల కోలాహలం, అందులో రాజకీయ నాయకుల ప్రసంగాలు, ప్రణాళికలు వాటి తీరుతెన్నులు, ప్రలోభాలు వాటివల్ల వచ్చే ప్రమాదాలు, ఓటర్ల అమాయకత్వం పర్యవసానాలు, ఓటర్ల చైతన్యం ఇలా ఎన్నికల వ్యవస్థపై స్పందించిన కవుల కవిత్వానికి పుస్తక రూపమిచ్చారు. అదే "ఎన్నికల భారతం" కవితా సంకలనం.

ఏమిటి దాని ప్రత్యేకత?

"తల్సుకుంతే గుండి జారిపోతంది! బుర్ర గీరెత్తి పోతంది!

అప్పుడా ఎలచ్చన్ల రోజున మనం జేసిన పాపం

ఇలాగ యీ అయిదేళ్ళూ కతికుడుపుతాదని

కల్లోకూడా అనుకోలేదు

ఆ రోజున కక్కూర్తిపడి తీసుకున్న ఆ పెద్ద నోటూ,

తాగిన్ ఆ మందు బుడ్డీ, తిన్న బిర్యానీ పొట్లాం

ఇన్నేళ్ళపాటు మన బతుకుల్ని కన్నీళ్ళపాల్జేస్తాదని

కొంచెమైనా కానుకోలేదు

ఇదిగో... ఇప్పుడు మళ్ళీ ఎలచ్చన్లోచ్చీసినాయి!

ఈసారి మాత్రం ఏదోవొకటి సెయ్యాలి...!"

అంటున్నారు విశాఖ కవి పతివాడ నాస్తిక్. తమ భావాలను వ్యక్తీకరించలేని అతి సామాన్య జనుల గుండె చప్పుళ్ళని వినిపిస్తూ.

"పదవుల ఎండమావిలో

పరిగెట్టే నాగజెముడికి

కాస్త తడి కావాలి

ముళ్ళవాడి మరింత పెంచుకోడానికి

కొంచెం కొంచెం

ఆవిరయ్యే ఆశల్లో నుంచే

ఒయాసిస్సు లాంటి మేనిపెస్టో పుడుతుంది

... ... ...

"వేదిక మబ్బుల నుండి

ఉచిత వడగండ్లు రాలుతాయి

ఆకలి నెర్రెలు బారిన

చెరువు గొంతులు జై కొడతాయి

అభివృద్ధి ఆకాశాన్ని

అధికారంలో నంజుకుంటూ

విమర్శల ఇసుక తుపానులతో

ఎడారు లెక్కడికో విస్తరిస్తాయి

... ... ...

మీటల యుద్ధం మొదలవుతుంది

ప్రలోభాల డ్యాముల్లో

ప్రవహించని దేశం మిగిలిపోతుంది

... ... ...

ఎగిరిపోయే చెరువులారా

నిన్ను తడిపే నింగికోసం

చూపుడు వేళ్ళ సిరాగా ప్రవహించండి చాలు!"

అని ఓటర్లకు హితవు చెపుతున్నారు `చెరువు ఎగిరిపోయింది`లో పోలిరెడ్డిపాలెం నుంచి నల్లు రమేష్.

"అందుకే...

ఓటంటే గుడ్డిగా గుర్తుమీద ముద్రేయడం కాకుండా

నీ విచక్షణకు గీటురాయిగా నిల్చి

కొత్తపుంతలు తొక్కించాలి

ఎప్పటికప్పుడు

కుళ్ళును కడిగి, తుడిచి ఎత్తిపెట్టి పారబోసే

పాన్చేట మొద్దు చీపురులై నిలవాలి

పరిశుభ్ర ప్రజాస్వామ్య వెలుగుల్ని పదిమందికీ పంచాలి" అని ప్రబోధిస్తున్నారు మానేపల్లికి చెందిన మోకా రత్నరాజు.

"ఎక్కడో అబద్ధం కత్తి అంచుమీద

ప్రజాస్వామ్యం నిలబడింది

గాయాలకు లేపనాలేవీ అన్నార్తులకు ఓదార్పులేవీ" గాయపడ్డ ప్రజాస్వామ్యం పక్షాన, ఆకలితో అలమటిస్తూ కేకలేసే ప్రజల పక్షాన ప్రశ్నించారు కోనసీమ కవి దాట్ల దేవదానం రాజు.

ఇదుగో ఇటు చూడండి - వ్యంగ్యవైభవంతో చీల్చిచెండారు పాలకుల నైజాన్ని, వారి వైభోగాన్ని - రాజధాని ప్రాంతపు రైతుబిడ్డ అయిన కవి డా. పాపినేని శివశంకర్. ఎలాగంటే...

"తనరాజ్యంలో దాహంతో ఎవ్వరూ తపించరాదని

ఊరూరా మద్యపుటేళ్ళు పారించిన ఔదార్యమతనిది

అన్నిటికన్నా భూమాత మహోన్నతం కదా?

అందుకని అందుచేత అందువలన

అంతకన్నా ఎత్తుగా ఏదీ ఉండరాదని

అన్నిటినీ నేలమట్టం చేసే మాతృభక్తి అతనిది

కర్షక అన్నలకు (మళ్ళీ దుష్ట సమాసం) ఎండదెబ్బ తగలరాదని

రేగటి దుక్కుల్లో కారడవులు పెంచే కారుణ్యం అతనిది

... ... ...

'తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు' అన్నాడో కవి

కానీ మన ప్రియతమ నాయకుడు

నదీగర్భాలు పెళ్ళగించి

ఇసుక నుంచి కరెన్సీ పిండగలడు

భూమిమీద సమస్త కుబేరుల వద్దనే కాకుందా

తన రాజ ప్రాసాదం ముందు దీనంగా నిలబడ్డ

బిచ్చగాడి నుంచికూడా బొచ్చెడు అప్పు తేగలడు

క్రమాతిక్రమశిక్షణ అతని ఆరో ప్రాణం

రవితేజంతో రాజమార్గాన పోయేటప్పుడు

చెట్టూ చేమలైనా వినయంగా వంగి నమస్కరించాలి గదా?

రాజభక్తి లేని పచ్చని చెట్లను కొరతవేసే

నిక్కచ్చి రాజశాసనాన్ని ప్రశ్నించగలమా?"

అవసరమనిపిస్తే ఒక్కోప్పుడు కొంత కఠిన స్వరంతోనే ఒక హెచ్చరికను కూడా ధ్వనింపచేసేదే కవి కంఠం. మరీ ముఖ్యంగా అభ్యుదయ కవి కంఠం.

"దేశమంత కులమతాల సంతగా

విభజించబడే

రాజకీయ గాలము

చూడు చూడు చిత్రము

నేటి ఎన్నికల విచిత్రము

ఓటేమో అమ్మకపు సరుకు!

జీవితమంతా బానిస బతుకు!!" అని హెచ్చరీచారు శిఖా ఆకాష్.

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఎన్నికల వ్యవస్థని దేశంలో పాలకవర్గం ఎంతగానో దిగజార్చింది. ఆ దిగజారుడును తెలుగు కవులు తమ కవితాగ్నిజ్వాలల ద్వారా వ్యక్తీకరించారు. వాటిని అభ్యుదయ రచయితలసంఘం అక్షరబద్దం చేసింది. అచ్చొత్తించింది. "ఎన్నికల భారతం" (నేటి ఎన్నికల తీరుతెన్నులపై కవితా సంకలనం) పేరుతో కవితా సంకలనంగా తీసుకొచ్చింది.

ఏమిటి నేపథ్యం?

18వ లోక్ సభకు, ఆంధ్రప్రదేశ్, అరుణాచలప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం నాలుగు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా "నేటి ఎన్నికల తీరుతెన్నులు" అంశంపై కవితల పోటీలను నిర్వహించింది. పోటీలో బహుమతులు పొందిన కవితలతో పాటు ప్రచురణకు అర్హమైవాటిని మరికొన్నింటిని కలిపి 20 కవితలు, అలాగే అరసం విజ్ఞప్తిని గౌరవించి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ స్పందించిన 31మంది ప్రముఖ కవుల కవితలను, గుర్రం జాషువ, శ్రీశ్రీ, కాళోజి, దేవిప్రియ, కె.శివారెడ్డి, జె.బాపురెడ్డి, పేరుచెప్పుకోని "ఒక ఓటరు" కలంపేరుతో స్వతంత్ర పూర్వపు 1926నాటి కవి, మరి కొన్నికవితలను అనుబంధంలో చేర్చి మొత్తం 56 కవితలు గేయాలతో ఒక సంకలనాన్ని ప్రచురించింది.

మే 1వతేదీ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు, ఎన్ టి ఆర్, ఏలూరు, రాజమండ్రి, అమలాపురం, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, తెలంగాణలో హైదరాబాద్ నగరాల్లొ15 ప్రాంతాల్లో అరసం శాఖలు కవితా గోష్ఠులు ఆ వేదికలపైన ఈ పుస్తకావిష్కరణలు నిర్వహించాయి. ఇదొక చారిత్రక ఘట్టం.

-కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

5 మే 2024

Read More
Next Story