
ఇంగ్లీషు వల్ల తెలివితేటలు రావు
చిలకలూరిపేట ప్రభుత్వ పాఠశాలకు తన వంతుగా మంచి లైబ్రరీని ఏర్పాటు చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఇంగ్లీషు వల్ల భాష రావచ్చేమో కానీ, దాని వల్ల తెలివితేటలు రావని, పుస్తకాలు చదవడం వల్ల వస్తాయని, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ మైండ్ వంటివన్నీ రావాలంటే మల్టీ టాలెంట్స్ రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దీని కోసం స్వయం శక్తితో చదువుకోవడం చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పే దానిని నేర్చుకోవడంతోపాటుగా స్వంతంగా చదువుకుని నేర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని పవన్ కల్యాణ్ సూచించారు. చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ఆలోచనే మూలమని, ఇలాంటి సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పవన్ అభినందించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. పాఠశాల భూముల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పెద్దలు తమ సొంత స్థలాలు పాఠశాలలకు ఇచ్చేవారు. ఇప్పుడు కొందరు ఆ భూములను లాక్కుంటున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల గొడవల రాజకీయీకరణపై మండిపడ్డారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవను కులాలకు అంటగట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా స్పందించారు. కేరళ మోడల్ తల్లిదండ్రుల సంఘాలు కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా, క్రియాశీలంగా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి సంస్కృతి పెంచాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాలం మనల్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులే. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనది అని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. స్కూల్ క్రీడా మైదానం సరిపోవడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు తక్షణం పరిశీలించాలని ఆదేశించారు. లైబ్రరీలో పుస్తకాలు సరిపోవడం లేదు, తాన వ్యక్తిగతంగా పూర్తి గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో కేవలం 10 కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయని, తన వైపు నుంచి మరో 25 కంప్యూటర్లు పంపిస్తానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు జనసేన నేతలు, కార్యకర్తలు చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలపై తీవ్ర హెచ్చరిక “గంజాయి, డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. యువత అటు వైపు అస్సలు చూడొద్దు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు కలిసి దీన్ని అరికట్టాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య అనేది అపర ఆయుధం అని అన్నారు. చదువు లక్ష మెదళ్లను కదిలించగల శక్తి కలిగిందన్నారు. మాధ్యమం ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యమని వెల్లడించారు. అబ్దుల్ కలాం తమిళ మాధ్యమంలో చదివి మిసైల్ మ్యాన్, రాష్ట్రపతి అయ్యారని ఉదాహరించారు. సంపాదన పోవచ్చు… కానీ చదువు, జ్ఞానం ఎవరూ దొంగిలించలేరు అని గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ స్ఫూర్తినిచ్చారు.

