ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్‌ ఫీజులు!
x

ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్‌ ఫీజులు!

బీటెక్‌ చదువుకు ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులను ఖారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్ష పైన ఫీజులు ఉండటాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజుల ఖరారుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫీజులు అన్ని కాలేజీలకు ఒకే విధంగా ఉండాలని, ఒక కాలేజీకి ఒక ఫీజు, మరో కాలేజీకి వేరే విధంగా ఫీజులు ఉండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర పేర్కొన్నారు. కాలేజీల్లో సిలబస్‌లు వేరువేరుగా ఉండొచ్చేమో కాని సమాచారం మాత్రం ఒకటిగానే ఉంటుందన్నారు. సకల సౌకర్యాల పేరుతో ప్రభుత్వం తమకు కావాల్సిన కాలేజీల వారికి ఎక్కువ ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. గతంలో హైకోర్టు తీర్పు ప్రకారం రూ. 43 వేల నుంచి 45 వేలు మించకూడదని, ప్రభుత్వం చెబుతున్న ఏ గ్రేడ్‌ కాలేజీలైతే మరో 10 శాతం అదనంగా తీసుకోవచ్చన్నారు.

రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలకు 2024–25 సంవత్సరానికి ఫీజులు ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ. 40 వేల ఫీజులు తీసుకునే కళాశాలలు 114 కాగా రూ. లక్ష పైన ఫీజు ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ. 35 వేల చొప్పున ఫీజు ఖరారు చేశారు.
ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కతిక కార్యక్రమాలు, విద్యార్థి ఇతర కార్యకలాపాల ఖర్చులన్నీ ఈ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల పరిధిలోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన ఫీజులకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు.
గుంటూరులోని ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా ప్రభుత్వం నిర్ణయించింది.
Read More
Next Story