ముగిసిన సిరిమానోత్సవం
విజయనగరంలో సిరిమానోత్సవం అత్యంత వైభవంగా మంగళవారం జరిగింది. విజయనగర ఉత్సవాలు కూడా మంగళవారంతో ముగిసాయి.
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. సోమవారం తొలేళ్ల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం సిరిమానోత్సవం వేడుకగా జరిగింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు ప్రజల్లో ఎంతో ఉత్సహాన్ని నింపాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత ఉత్సాహంతో సిరిమానోత్సవంలో పాల్గొన్నారు. సిరిమానోత్సవం జరిగే సమయంలో గుడి వద్ద నుంచి కోట వరకు మూడు సార్లు సిరిమానును ఊరేగిస్తారు. ఈ సందర్భంగా భక్తులు సిరిమానును తాకడం సాధ్యం కాదు కాబట్టి తమ చేతులతో అరటి పండ్లను విసురుతారు. అరటి పండ్లు నేరుగా సిరిమానును తాకితే అమ్మవారి అనుగ్రహం పొందినట్టుగా భక్తులు భావిస్తారు. అయితే దూరం నుంచి అరటి పండ్లను విసరడం వల్ల పూజారులతో పాటు తోటి భక్తులకు కూడా గట్టిగానే తగులుతాయి. దెబ్బ తగిలినా.. అమ్మవారికి విసిరిన అరటి పండ్లు కాబట్టి అబ్బా అని కూడా అనకుండా ఉండటం విశేషం.