సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించండి
x

సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించండి

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


సినిమాలు, సీరియళ్లతో పాటు ఓటీటీలో వచ్చే వివిధ రకాల కంటెంట్ లను ఏజెన్సీ ప్రాంతాల్లో షూట్ చేసుకునేలా ప్రొత్సహించాలని, దీని వల్ల గిరిజనులకు ఆదాయం పెరగడంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలి. వారి ఆదాయ మార్గాలు పెంచాలి. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ లతో ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో గతంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్ గా సేవలందిస్తున్న సుమిత్ కుమార్, గతంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సతీష్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా అటవీ ప్రాంతంలో గంజాయి నిర్మూలన అంశంపైనా చర్చించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం పెంపు వంటి కీలకమైన అంశాలను ప్రతిపాదికగా తీసుకొని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు. ప్రపంచం వేగంగా ముందుకు వెళుతోంది. దేశంలోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని వారి శక్తిని, శ్రమను ఉపయోగించుకొని వారి జీవన ప్రమాణాలను పెంచాలి. అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఎంతో డిమాండ్ ఉంది. కాఫీ తోటలతోపాటు అడవిలో విరివిగా దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా ప్రోత్సహించాలి. మార్కెట్ డిమాండు అనుసారం అటవీ ఉత్పత్తులను విరివిగా పెంచేలా చూడాలి. నిత్యం గిరిజనులతో మమేకం కావడం, వారి ఆలోచనలను వినడం, వారికి సహాయం చేయడం మర్చిపోవద్దు. వారిలో నూతన ఉత్తేజం నింపేలా కొత్త కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి. గిరిజనుల ఆదాయం పెరగాలి. వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందాలి. విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతలో స్ఫూర్తి నింపి, వారిని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేయాలి. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకురావాలి అని సూచించారు.
ఉద్యాన పంటలకు ఉపాధి పనులకు అనుసంధానం
ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యాన పంటలకు అనువుగా ఉంటుంది. దీన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. దీనిపై మరింత గా దృష్టి సారించి, వివిధ రకాల పనులకు ఉపాధి హామీ అనుసంధానం అయ్యేలా అధికారులు పరిశీలన చేయాలి. ఏజెన్సీలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుదలతో పాటు దానికి తగిన అనుసంధాన పనులు ఉపాధి పనుల్లో భాగంగా చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది గిరిజనులకు ఉపాధి కల్పనతో పాటు గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల పెంపుదలకు ఎంతో తోడ్పాటునిస్తుంది. కాఫీ పంటలతో పాటు ఏజెన్సీలో అనువుగా ఉండే పంటలను పండించేలా కృషి చేయాలి అని పేర్కొన్నారు.
ప్రకృతిని రక్షిస్తూ పర్యాటకం పెంపుదల చేయాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకం పెంపుదల ప్రధానం. ప్రతి ఒక్కరిరీ నేడు పర్యాటకం మీద ఆసక్తి పెరుగుతోంది. ఎకో టూరిజం అనేది ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న రంగం. దీన్ని అందింపుచ్చుకోవాలి. సహజమైన ప్రకృతి సంపదకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ఎకో టూరిజం పెంపుదలపైన గిరిజనులకు తగిన అవగాహన కల్పించాలి. యువతకు టూరిజం వల్ల వచ్చే లాభాలు, పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా అందే ఆదాయం మీద చైతన్యం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం సంపాదించే మార్గాలను వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది, వారి జీవన ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు చర్చిద్దాం. నిరంతర అనుశీలన చేసి, నెలవారీ రిపోర్టులతో ముందుకు సాగుదాం. సమన్వయంతో యంత్రాంగం ముందుకు సాగితే కచ్చితంగా గిరిజనుల బతుకు చిత్రాలు మారుతాయి. దీనికి అనుగుణంగా పకడ్భందీ ప్రణాళికను సిద్ధం కావాలి. దీనికి ఎల్లపుడూ ప్రభుత్వ సహకారం ఉంటుంది అని హామీ ఇచ్చారు.
Read More
Next Story