వన్‌సైడే అంటున్న ఉద్యోగులు..
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ 9తో ముగిసింది. ఉద్యోగులు తమ ఓటు వన్‌సైడే అంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు ఎక్కువగా ఏ పార్టీకి నమోదయ్యాయనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారింది. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు నియోజవర్గ, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫిసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 75 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఉద్యోగులు ఓట్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా చెప్పిన వివరాల ప్రకారం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. దాదాపు ప్రతి ఓటును ఉద్యోగులు సద్వినియోగం చేసుకున్నట్లు అర్థమవుతోంది. మొత్తం పోలయిన ఓట్లలో అసెంబ్లీకి మాత్రం రెండు ఓట్లు ఎక్కువగా పోల్ కాగా పార్లమెంట్స్‌కు రెండు ఓట్లు తగ్గాయి.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజైన 9న పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374 ఓట్లు, అసెంబ్లీ నియోజక వర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అత్యధిక మొత్తంలో 22,650 పోస్టల్ బ్యాలెట్ నెల్లూరు నియోజక వర్గంలో పోల్ అవ్వగా, అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం (ఎస్సీ) నియోజక వర్గంలో పోల్ అయ్యాయి.
ఉద్యోగుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక గళం ఎక్కువగా వినిపించింది. చాలా చోట్ల ఉద్యోగులు తమ ఉద్యోగం పోయినా పరవాలేదని, సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రచారం కూడా చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులను కాళ్ల కింద చెప్పుల మాదిరిగానే చూసిందని, ఇప్పటి వరకు తమ డిమాండ్‌ల పరిష్కారంలో ముందుకు సాగలేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లిన ఉద్యోగులను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ సంఘటనలు జరిగాయి. డబ్బులు ఆశచూపించిన వారిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. వారిలో ఒక పోలీసు ఉద్యోగి కూడా ఉన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్స్ వద్దకు వచ్చి ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కొందరు తీసుకోగా మరికొందరు డబ్బులు ఇవ్వటానికి వచ్చిన వారిని తిట్టి పంపించిన సందర్బాలు ఉన్నాయి.
వన్‌సైడే అంటున్న ఉద్యోగులు..
ది ఫెడరల్ ప్రతినిధి పలువురు ఉద్యోగులను ఓటు వేసిన అంశంపై ప్రశ్నించగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లు చెప్పారు. ఉద్యోగులను నీచంగా చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. పీఆర్‌సీ అమలు దగ్గర నుంచి మేము దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు కూడా బిక్షగాళ్ల మాదిరి పడిగాపులు కాచినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అందుకే ఈ ప్రభుత్వం మారాల్సిన అవసరాన్ని మా ఓటు ద్వారా చెప్పామన్నారు. ఐదేళ్లలో 2024మే ఒకటవ తేదీన తప్ప మిగిలిన నెలల్లో 1న జీతాలు తీసుకున్న సందర్భం లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,218 ఓట్లు పోల్ కాగా ఇంతకు మూడింతలు ఉద్యోగుల కుటుంబాల నుంచి ఇదే విధమైన తీర్పు వస్తుందన్నారు.
Next Story