
యల్లంపల్లిపై విరుచుకుపడిన ఏనుగుల మంద
పంట పొలాలు ధ్వంసం.. హుటాహుటిన వచ్చిన ఫారెస్ట్ అధికారులు
తిరుపతి జిల్లాలో మరోసారి ఏనుగుల మంద విరుచుకుపడింది. ఈసారి చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగులు (Tirupati Elephant Attack) బీభత్సం సృష్టించాయి. 7 పెద్ద ఏనుగులు, 2 గున్న ఏనుగుల గుంపు ఒకటి గ్రామ పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టించాయి.
అర్ధరాత్రి ఏనుగుల భీకర శబ్దాలతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అర్ధరాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. పంట పొలాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. వరి పంట, గడ్డివాము,ఫెన్సింగ్ కూసాలు, నీటి పైపులను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం నుంచి యల్లంపల్లికి గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలిపారు.
ఈ విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో కలిసి ఏనుగుల మందను అడవివైపు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పంటలను మొత్తం ఏనుగులు నాశనం చేయడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పడెప్పుడు ఏనుగులు గ్రామాన్ని వీడి అడవిలోకి వెళ్లిపోతాయా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
గతంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటనలు
2025లో, చిత్తూరు జిల్లాలో ఒక రైతును ఏనుగులు రాత్రి మధ్యలో దాడి చేసి దెబ్బతీయగా, అతడు అక్కడికే మృతి చెందారు. ఇరాల మండలం నాగవండలపల్లి గ్రామానికి చెందిన గణపతి యాదవ్ రైతు తన పొలాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఏనుగుల మంద దాడిలో మరణించారు.
2024లో, కుప్పం పరిధిలోని PMK తండా ప్రాంతంలో ఒంటరి ఏనుగు దాడిలో నాయక్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. మరో ఘటనలో బ్యాండర్లపల్లి గ్రామంలో (పిలేరు మండలం, చిత్తూరు జిల్లా) ఏనుగుల దాడిలో రైతు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లాలో గత దశాబ్దంలో ఏనుగుల వల్ల చాలా పంట నష్టాలు దెబ్బతిన్నాయి.
Next Story