ఈనెల 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
x

ఈనెల 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

డిమాండ్ల సాధనకు గత్యంతరం లేకనే సమ్మెకు దిగామంటున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ


ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఈమేరకు విద్యుత్‌ సంస్థల యాజమాన్యానికి అక్టోబర్ 9న నోటీసు ఇచ్చింది.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జేఏసీ నేతలను మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు), ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో యాజమాన్యాలు ఇటీవల జరిపిన చర్చలకు ఆహ్వానించాయి. విద్యుత్‌ ఉద్యోగుల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ (జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఏండీ) ఎస్‌.నాగలక్ష్మి, సభ్యులు ఐ.పృధ్వీతేజ్‌ (ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ), కె.సంతోష్ రావు (ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ), విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు ఈ చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. 29 ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగినా ఏకాభిప్రాయం కుదర్లేదు. దీంతో జేఏసీ- ఏపీ జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలకు ఈ మెయిల్‌ ద్వారా నిరవధిక సమ్మెనోటీసులను పంపించింది. సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్‌ 6న విశాఖలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నారు.
అక్టోబర్‌ 13న చలో విజయవాడ, అక్టోబర్‌ 14న వర్క్‌ టు రూల్‌ అమలు చేస్తారు. అక్టోబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తారు. అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు 33,582 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
నిజానికి విద్యుత్‌ వంటి అత్యవసర సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ భయపడకుండా తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
Read More
Next Story