ఏపీలో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తి
x

ఏపీలో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తి

జెన్‌కో అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష నిర్వహించారు.


గృహ, పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగాలని,జెన్‌కో ప్లాంట్లలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఏపీ జెన్‌కో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు థర్మల్‌ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తి, రోజువారీ విద్యుత్‌ కొనుగోళ్లు పై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగానికి తగినట్లుగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. అంతేగాకుండా గతంతో పోల్చితే రోజు వారి విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గినట్లు తెలిపారు.

ఏపీ జెన్‌కో –ఏపీపీడీసీఎల్‌ సంయుక్తంగా 2025 ఆగస్టు వరకు 16,000 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి సాధించినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 20.3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై మంత్రి గొట్టిపాటి హర్షం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి శ్రీశైలం హైడల్‌ పవర్‌ స్టేషన్‌ 1,000 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరడంపై అధికారులను అభినందించారు. కేవలం ఏడాది కాలంలోనే జల విద్యుత్‌ ఉత్పత్తి 36% మేర ఉత్పత్తి సాధించడం భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమీక్షలో భాగంగా పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు, దిగువ సీలేరు రెండు యూనిట్లు, ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు పురోగతిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఎన్టీటీపీఎస్‌ స్టేజ్‌–5, ఆర్టీపీఎస్‌ స్టేజ్‌–4 విస్తరణ పనుల పురోగతిపై కూడా ఆరా తీశారు. ఎన్టీటీపీఎస్‌ స్టేజ్‌–5, ఆర్టీపీఎస్‌ స్టేజ్‌–4 విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తి స్థిరత్వం కోసం ముందుగానే తగిన బొగ్గు నిల్వలు సమకూర్చుకోవాలని, సరఫరాదారులతో సమన్వయం చేసుకుని రైల్వే కనెక్టివిటీని పెంచాలని సూచించారు. బొగ్గు హ్యాండ్లింగ్‌ సిస్టమ్స్‌ను మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, డైరెక్టర్లు ఎం. సుజయ్‌ కుమార్, పీ. అశోక్‌ కుమార్‌ రెడ్డి, వి. ఉష, ఏపీపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story