ఆంధ్ర ఎన్నికల ప్రచారం ఈరోజు ఇలా..
ఆంధ్రలో ఎన్నికల జోరు రోజురోజుకు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లు రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నాయి. వారి ఈరోజు షెడ్యూల్ ఎలా ఉందంటే..
ఆంధ్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ప్రధాన పార్టీ అధినాయకులు, అధ్యక్షులు తమ ప్రచారాల జోరు పెంచారు. ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ప్లాన్ చేసుకున్న ప్రచారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వారి ప్రచారాలు ఎలా సాగనున్నాయంటే..
సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సాగనుంది. తేతలి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకోనున్నారు. విరామం ముగిసిన అనంతరం సాయంత్రం రాజమండ్రి సిటీలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్ రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇప్పటివరకు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్రతో 16 జిల్లాలు, 49 నియోజకవర్గాలను చుట్టేశారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు ‘న్యాయ యాత్ర’ను ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చేపట్టనున్నారు. 10 గంటలకు మడకశిర నియోజకవర్గంలో ఆమె భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు శింగనమల నియోజకవర్గం చేరుకోనున్నారు. అక్కడ రెండో సభ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఉరవకొండ నియోజకవర్గంలో మూడో సభను షర్మిల నిర్వహించనున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈరోజు కూడా తమ ప్రచారాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు వారి ప్రచారాలకు బ్రేక్ పడనుందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈరోజే ఆంధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదల కావడంతోనే తమ నామినేషన్‌లు దాఖలు చేయడానికి నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ఈనెల 25న, షర్మిల 20న, చంద్రబాబు 19న తమ నామినేషన్‌లు దాఖలు చేయనున్నట్లు విశ్వనీయ వర్గాలు తెలుపుతున్నాయి. కానీ ఇప్పటివరకు పవన్ కల్యాణ్ తన నామినేషన్ దాఖలు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.