
ఎనిమిదేళ్ల రాజకీయ చర్చ, సుగాలి ప్రీతి కేసు
పదోతరగతి చదువుతున్న బాలిక సుగాలి ప్రీతి హాస్టల్ లో రేప్ అండ్ మర్డర్ కు గురై ఎనిమిదేళ్లు. నిందితులు ఎవరో తెలియదు. రాజకీయ హామీలు, న్యాయం కోసం పోరాటం.
కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 18న జరిగిన సుగాలి ప్రీతి (15) హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, న్యాయ వ్యవస్థలలోని లోపాలను బట్టబయలు చేస్తోంది. గిరిజన బాలిక అయిన ప్రీతి, తన పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించిది. పోస్టుమార్టం రిపోర్టు ఆమె అత్యాచారానికి గురై, హత్య చేయబడినట్లు తేల్చింది. ఈ ఘటన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరగగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పోలీసులు పట్టుకోలేక పోవడం, రాజకీయ నాయకుల హామీలు నెరవేరకపోవడం ఈ కేసును మరింత వివాదాస్పదం చేశాయి. ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు నేటికీ న్యాయం కోసం ఎక్కని మెట్టంటూ లేదు. కేసును సీబీఐకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆలస్యాలు, వైఫల్యాలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనే బాలిక మరణం 2017 ఆగస్ట్ 18న రాష్ట్ర వ్యప్తంగా సంచలనమైంది. పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, పోస్టుమార్టం రిపోర్టు అత్యాచారం, హత్యను ధృవీకరించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించి గాలికి వదిలేసింది. కేసును పోలీసులు మూసి వేశారు.
ఆ తరువాత 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పొలం, ఇతర పరిహారాలు అందజేసింది కానీ నిందితులను పట్టుకోలేక పోయింది. ఫిబ్రవరి 2020లో జీవో నెం.37, మే 2020లో జీవో నెం.56 జారీ చేసి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
అయితే కేసు దేశ భద్రతకు సంబంధించినది కాదు, ఆర్థిక నేరం కాదు, ఇప్పటికే డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తు చేసి చార్జిషీట్ కూడా కోర్టుకు దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసులో ఇప్పుడు మేరు వచ్చి దర్యాప్తు చేయడం ద్వారా సాధించేది ఏమీ లేదంటూ మీరే దర్యాప్తు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
ప్రీతి తల్లి పార్వతి 2024 జూలైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి న్యాయం కోరారు. ఆగస్టులో వీల్‌చెయిర్ యాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ) 2025 సెప్టెంబరు 2న కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. కానీ ముందుగా సీబీఐ తిరస్కరించిన నేపథ్యంలో ఇది ఎంతవరకు ఫలిస్తుందో అనే అనుమానాలు ఉన్నాయి.
ఆందోళనలు, ప్రజా ఉద్యమాలు
ఈ కేసు ఆరంభం నుంచి దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. 2017లో రాష్ట్రవ్యాప్త బంద్, ధర్నాలు జరిగాయి. 2024లో ప్రీతి తల్లి యాత్ర అడ్డుకోవడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఎస్టీ ప్యానెల్ నాయకులు పవన్ కళ్యాణ్ "మోసం" చేశారని ఆరోపించారు. ట్విట్టర్ (ఎక్స్)లో #JusticeForSugaliPreethi హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమాలు జరిగాయి. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ హామీలు
ఈ కేసు రాజకీయంగా ఎంతో వివాదాస్పదం. 2019 ఎన్నికల్లో జనసేన నేత పవన్ కళ్యాణ్, విపక్షంలో ఉండగా "అధికారంలోకి వచ్చాక మొదటి కేసుగా ప్రీతి కేసును తీసుకుంటాం, నిందితులను పట్టుకుంటాం" అని హామీ ఇచ్చారు. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ విషయం మరచిపోయారనే విమర్శలు వచ్చాయి. ప్రీతి తల్లి "పవన్ ముఖం చాటేశారు" అని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని పవన్‌పై సెటైర్లు వేశారు. "ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు" అని విమర్శించారు.
టీడీపీ హయాంలో జరిగిన ఘటనపై ఆ పార్టీపై కూడా విమర్శలు ఉన్నాయి. మొత్తంగా మూడు ప్రభుత్వాలు మారినా న్యాయం జరగకపోవడం రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేసింది. ప్రీతి తల్లి "రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదు" అని అంటూ సీబీఐ విచారణను కోరడంతో సీబీఐకి అప్పగించక ప్రభుత్వానికి తప్పలేదు.
ఎందుకు ఆలస్యం? ఎవరిది బాధ్యత?
ఈ కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నాయనేది స్పష్టం. మొదటి దశలోనే సాక్ష్యాలు సరిగా సేకరించకపోవడం, తర్వాత తారుమారు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ "సాక్ష్యాలు సరిపోవు" అనడం దర్యాప్తు వైఫల్యాన్ని సూచిస్తుంది. రాజకీయంగా ఇది ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగపడుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దళిత బాలికపై అత్యాచారం, హత్య వంటి ఘోరాలు జరిగినా న్యాయం ఆలస్యం కావడం సమాజంలో అసమానతలను, వ్యవస్థాగత వైఫల్యాలను బయటపెడుతోంది.
ప్రస్తుతం సీబీఐకి అప్పగించడం ఒక అడుగు ముందుకు, కానీ గత అనుభవాలు... ఆశలు కలిగించడం లేదు. న్యాయం కోసం పోరాడుతున్న ప్రీతి కుటుంబానికి సమాజం మద్దతు ఇవ్వాలి, రాజకీయాలు ఇక్కడ అడ్డురాకూడదు. ఎన్నికల హామీలు నెరవేరాలంటే, వ్యవస్థ మారాలి. ఇది సుగాలి ప్రీతి కేసు ఇచ్చే సందేశమని చెప్పాల్సి వస్తోంది.
ఎన్నికల కోసం ప్రీతి హత్యను వాడుకున్నారు: రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్
ప్రీతిని రేప్ చేసి హత్య చేసిన ఖచ్చితంగా స్కూలుకు సంబంధించిన వారే అయి ఉంటారనే అనుమానం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ‘‘స్కూలుకు సంబంధించిన మగవారి డిఎన్ఏ లు సేకరించి ప్రీతి డిఎన్ఏతో మ్యాచ్ చేయాలని డిమాండ్స్ ఉన్నా ఆ దిశగా పోలీసులు అడుగులు వేయలేదు. పైగా డీఎన్ఏ టెస్ట్ కు అనుమతి కావాలని కోర్టులో పిటీషన్ వేసి అనుమతి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా చేయాల్సిన పనిని కోర్టు వరకు ఎందుకు తీసుకెళ్లారు.’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి ఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ ప్రశ్నించారు. 2017లో ఉన్నది ఇప్పటి కూటమి ప్రభుత్వం అప్పట్లో ఎందుకు నిందితులను గుర్తించలేదు. ప్రీతి కుటుంబానికి సాయం అందించ లేదు. అని వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికల్లో ప్రీతి హత్యను రాజకీయంగా వాడుకుని ఓట్లు సంపాదించారు. 2017లో పవన్ కల్యాణ్ ఎందుకు నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదు? ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ పై విమర్శలు గుప్పించారు. ప్రీతి కుటుంబానికి సాయం అందించింది వైఎస్సార్సీపీనే, అయితే ఆ పార్టీ ప్రభుత్వం కూడా నిందితులను పట్టుకోలేదు. నేడు ఉన్నది ఎన్డీఏ సర్కార్, ఇప్పుడు ఎందుకు ప్రీతి కేసును పవన్ కల్యాణ్ ప్రస్తావించడం లేదు. ఎన్నికలకు ముందు అధికారం చేపట్టగానే ప్రీతి కేసునే ముందుగా తీసుకుని నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నాడు, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రీతి కేసుపై స్పందించ లేదని, పాలకు ప్రీతి కేసును వాడుకుంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు.
కేంద్రం ఏమంటుందో చూడాలి: జేడీ లక్ష్మీనారాయణ
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రీతి కేసును సీబీఐ తీసుకోవాల్సిందిగా జీవో ఇచ్చింది. అప్పట్లో కేంద్రం అనుమతి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. కేంద్రం సెక్షన్-5 నోటిఫికేషన్ ఇస్తే సీబీఐ వారు కేసు దర్యాప్తుకు తీసుకుంటారు. ఏమి జరుగుతుందో చూడాలి. కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుందా? లేదా? చూడాలి.