
వామ్మో.. కోడిగుడ్డు.. తినేటట్టుగా లేదుగా ఆమ్లేటు!
పెద్ద పండగ సంక్రాంతికి కోడి పుంజులు కూతపెడుతుంటే రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు చుక్కులు చూపిస్తున్నాయి
పెద్ద పండగ సంక్రాంతికి కోడి పుంజులు కూతపెడుతుంటే రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. బర్డ్ ఫ్లూతో కోళ్లు చచ్చిపోయి ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే కేకుల సీజన్ కావడం మరో కారణమైంది. దీంతో నిన్న మొన్నటి వరకు 4,5 రూపాయల మధ్య కోడిగుడ్డు ధర ఒక్కసారిగా 8,9 రూపాయల మధ్య పలుకుతోంది. ఫారం కోడిగుడ్డు ధర ఒక్కోటి రూ.9కి చేరుకోగా, నాటు కోడిగుడ్ల ధరలు ఒక్కోటీ రూ.15 పలుకుతోంది. మార్కెట్ వర్గాల ప్రకారం జనవరి నాటికి కోడిగుడ్డు ధర 10 రూపాయలు చేరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్ సహా) హోల్‌సేల్‌లో ఒక ట్రే (30 గుడ్లు) ధర సుమారు ₹210-₹220 వరకు ఉంది.
వింటర్ సీజన్ లో కోడిగుడ్ల వినియోగం పెరుగుతుందని, పండగల సీజన్ కావడంతో ధరలు పెరిగాయని పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బర్డ్ ఫ్లూ రాష్ట్రంలో కోళ్ల ఫారాలను దెబ్బతీసింది. అధికారిక లెక్క ప్రకారమే 6 లక్షల కోళ్లు చనిపోయాయి. అనధికార లెక్క ప్రకారం ఈ లెక్క 30 లక్షలు. గత ఐదు నెలలుగా చాలా మంది దివాళా తీసి ఫారాలను మూసివేశారు కూడా. ఏపీ రాష్ట్రంలో రోజూ 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఏపీ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి అవుతాయి. స్థానిక వినియోగానికే గుడ్లు సరిపోకపోవడంతో ఎగుమతులు బాగా కట్ అయ్యాయి.
భారతదేశ మొత్తం కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 20 శాతం వాటాను కలిగి ఉంది. రాష్ట్రంలో రోజుకు 5 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రూ. 690 ఉన్నప్పటికీ, రిటైల్ వ్యాపారులు రకరకాల కారణాలు చెబుతూ ఒక్కో గుడ్డుకు రూ. 8,9 వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కోడిగుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ అంచనా వేస్తోంది.
"పౌల్ట్రీ చరిత్రలోనే గుడ్డు ధర రూ. 9కి చేరడం ఇదే మొదటిసారి. ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చే వరకు కనీసం మరో రెండు నెలల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది" అని ఏపీ పౌల్ట్రీ మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి డేవిడ్ రాజు తెలిపారు. సామాన్యుడి పోషకాహార బుట్టలోంచి గుడ్డు కూడా దూరమవుతుండటం గమనార్హం.
మరోవైపు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ నుంచి డిమాండ్ పెరగడంతో ఎగుమతులు కూడా అధికమయ్యాయని ఎగ్స్ ఎక్స్పోర్టర్ కె.శ్రీనివాసు అన్నారు.
విశాఖపట్నంలోని కోడిగుడ్ల వ్యాపారి కె. నాయుడు మాట్లాడుతూ.. యువత, పిల్లలు, బేకరీల నుండి గిరాకీ పెరగడం వల్ల ఈ ఏడాది చలికాలం ముందుగానే ధరలు పెరిగాయని తెలిపారు. కేక్ ఆర్డర్లు పెరగడం వల్ల డిసెంబర్, జనవరి నెలల్లో గిరాకీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, దీని కోసం నవంబర్ చివరి నుంచే సన్నాహాలు మొదలవుతాయని బేకరీ యజమానులు పేర్కొన్నారు.
గడిచిన 15,20 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో డిమాండ్ పెరిగింది, కానీ ఉత్పత్తి మాత్రం స్థిరంగా ఉంది. కోళ్ల మేత, మందుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైందని, ఇది మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతోందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పౌల్ట్రీ రైతు కె. ఆనంద్ వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాటు కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. కూరగాయలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా పెరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోడిగుడ్ల విశేషాలు ఇలా...
రోజువారీ ఉత్పత్తి: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా రోజుకు 5 కోట్లకు పైగా కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయి.
ధరల వ్యత్యాసం: రిటైల్ మార్కెట్‌లో సాధారణ గుడ్డు రూ. 8,9 కాగా, నాటు కోడిగుడ్డు రూ. 15, 16గా ఉంది.
ఎగుమతులు: రాష్ట్ర ఉత్పత్తిలో 40 శాతానికి పైగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
పోషక విలువలు: కోడిగుడ్లలో జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
గతంతో పోలిక: 2017-18 కాలంలో కోడిగుడ్డు హోల్‌సేల్ ధర కేవలం రూ. 4 మాత్రమే ఉండేది.
కోడిగుడ్డు - సామాన్యుడికి అత్యంత చౌకగా లభించే ప్రోటీన్ వనరు. కానీ ఇప్పుడదీ అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది.
ఇండియాలో కోడిగుడ్ల ఉత్పత్తి ఇలా...
మొత్తం ఉత్పత్తి (బిలియన్లలో): 2015-16లో 82.93 ఉండగా.. 2024-25 నాటికి 149.11 కి పెరిగింది.
తలసరి లభ్యత (ఒక వ్యక్తికి): 2015-16లో ఏడాదికి 65 గుడ్లు ఉండగా.. 2024-25 నాటికి 106 కి పెరిగింది.
అగ్రగామి రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక - ఈ ఐదు రాష్ట్రాలే దేశంలోని 64% ఉత్పత్తిని అందిస్తున్నాయి.
హోల్‌సేల్ ధర: ఒక్కో గుడ్డు రూ. 7.30 దాటింది.
ట్రే ధర: ఇటీవలి వరకు రూ. 160-170 పలికిన 30 గుడ్ల ట్రే ధర ఇప్పుడు రూ. 210-220 కి చేరింది.
నాటు కోడిగుడ్లు: వీటి ధర రిటైల్‌లో రూ. 15,16 వరకు ఉండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:
పెరిగిన ఉత్పత్తి వ్యయం: కోళ్ల మేతగా వాడే మొక్కజొన్న, సోయా, ఫిష్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో చిన్న, మధ్యతరహా పౌల్ట్రీ రైతులు ఫారాలను మూసివేశారు.
ఉత్పత్తిలో తగ్గుదల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గతంలో రోజుకు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ ఖర్చులు భరించలేక అనేక ఫారాలు మూతపడటంతో ఉత్పత్తి పడిపోయింది.
బర్డ్ ఫ్లూ ప్రభావం: గతంలో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు భయంతో వినియోగం తగ్గి రైతులు భారీగా నష్టపోయారు. ఆ నష్టాల నుండి కోలుకోలేక చాలామంది ఈ వ్యాపారం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు డిమాండ్ పెరిగినా, దానికి తగ్గ సరఫరా లేదు.
'రోజ్ ఖావో అండే'.. కానీ లభ్యతలో వ్యత్యాసాలు!
ఐసీఎంఆర్ (ICMR) నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి ఏడాదికి 180 గుడ్లు తీసుకోవాలి.
తెలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఏడాదికి తలసరి 500 కి పైగా గుడ్లు అందుబాటులో ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ లభ్యత 30 కంటే తక్కువగా ఉంది. అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
Next Story

