
ఆంధ్ర లికర్ స్కామ్‌పై ఈడీ దూకుడు – 5 రాష్ట్రాల్లో దాడులు
ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న లికర్ స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ED) దూకుడు పెంచింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సమాంతర సోదాలు జరిపి, అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
2019 నుంచి 2024 మధ్య కాలంలో లికర్ వ్యాపారంలో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానంపై ఇప్పటికే పలువురు ప్రముఖుల్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని డిస్టిలరీలు, పంపిణీ కంపెనీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, ఇతర బ్రాండ్లను నిషేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు జరిగాయని, ₹3,200 కోట్ల నుండి ₹3,500 కోట్ల వరకు నల్లధనం వివిధ రూట్లలో తరలివెళ్లిందని అధికారులు భావిస్తున్నారు.
ఐదు రాష్ట్రాల్లో దర్యాప్తు..
ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు చేపట్టారు. ఇటీవల హైదరాబాదు షాంషాబాద్ సమీపంలోని ఫార్మ్‌హౌస్‌లో నిర్వహించిన సోదాలో ₹11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనేక అకౌంట్లలో అసాధారణ డిపాజిట్లు, షెల్ కంపెనీల లావాదేవీలు, హవాలా మార్గాల ఆధారాలు కూడా దొరికాయి.
కిక్‌బ్యాక్‌లు – బినామీ లావాదేవీలు...
స్కామ్‌లో ప్రధానంగా పలువురికి ముడుపులు చేరాయ్నది ఆరోపణ. కొంతమంది డిస్టిలరీల యజమానులు ప్రభుత్వ విధానాలతో లబ్ధి పొందారని, వారికి కమీషన్ రూపంలో లిక్కర్ నిధులు చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులను బినామీ పేర్లతో భూములు, విల్లాలు, వాణిజ్య ఆస్తులు కొనుగోలు చేయడానికి వినియోగించారని SIT ఇప్పటికే నిర్ధారించింది.
ప్రధాన నిందితుల ఆస్తుల సీజ్
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు వ్యాపారవేత్తలు, రాజకీయ అనుబంధం కలిగిన వ్యక్తులపై కూడా దర్యాప్తు సాగుతోంది. గచ్చిబౌలి, రంగా రెడ్డి జిల్లాలోని విలువైన స్థలాలను ప్రభుత్వం ఇప్పటికే అటాచ్ చేసింది. మొత్తం విలువ సుమారు ₹13 కోట్లుగా అంచనా.
ఈడీ రంగ ప్రవేశం...
ED ఇప్పటికే ECIR (Enforcement Case Information Report) నమోదు చేసి, ఆర్థిక లావాదేవీలను సవివరంగా పరిశీలిస్తోంది. బ్యాంకు స్టేట్మెంట్లు, డిజిటల్ డేటా, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. ఈ ప్రక్రియలో సేకరించిన ఆధారాలు మనీలాండరింగ్ నిర్ధారణకు కీలకమవుతాయని అధికారులు అంటున్నారు. ఈ కేసులో పాత్ర ఉండవచ్చునని అనుమానిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఫోన్ ను ఫోరెన్సిక్ పరీక్షకు కూడా పంపారు.
ఈడీ దాడులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ, ఈ కేసును వైసీపీ ప్రభుత్వ అవినీతికి పెద్ద ఉదాహరణగా ప్రస్తావిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు కొంతమందికి మాత్రమే లాభం చేకూర్చాయని, ఆ మొత్తాన్ని రాజకీయ నిధులుగా మలిచారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాత్రం ఇది చంద్రబాబు ప్రభుత్వం ప్రేరేపించిన రాజకీయ ప్రతీకార చర్య మాత్రమేనని ఆరోపిస్తున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30) ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్‌నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లో ఉన్నారు.
Next Story