
జగన్ పాలన చూసి ఆర్థికవేత్తలే ఆశ్చర్యపోయారు: సజ్జల
అధికారంలో ఉన్నా లేకున్నా జగన్ వెంటే జనం ఉన్నారనీ, మళ్ళీ వస్తే ఏం చేయాలో ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారని సజ్జల వెల్లడించారు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలన చూసి ఆర్థికవేత్తలే ఆశ్చర్యపోయారని, తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని, మళ్ళీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఆయన వద్ద ఇప్పటికే స్పష్టమైన ప్రణాళిక సిద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సజ్జల పాల్గొని, భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలే జగన్ కుటుంబం
జగన్ ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారని సజ్జల పేర్కొన్నారు. జగన్ నిజాయితీకి మారు పేరని, జగన్ ఏదో ఆశించి సహాయం చేయరు. ఓదార్పు యాత్ర సమయంలో తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన చేసిన ఆర్థిక సాయం గురించి ఎక్కడా చెప్పుకోలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం అని సజ్జల కొనియాడారు. మహమ్మారి సమయంలో క్వారంటైన్ సెంటర్లలో ప్రజలకు నాణ్యమైన భోజనం, వైద్యం అందించాలని జగన్ నిత్యం తపన పడ్డారని గుర్తు చేశారు.
పబ్లిసిటీ లేని అభివృద్ధి
జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను సజ్జల ఏకరువు పెట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త కాలనీలే సృష్టించారని, 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టినా ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదని చెప్పారు. ఆర్థికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా జగన్ తన ఐదేళ్ల పాలన సాగించారని సజ్జల ప్రశంసించారు.
చంద్రబాబు పాలనపై విమర్శలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు సంధించారు. చంద్రబాబు కేవలం 18 నెలల్లోనే రూ. 2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఈ నిధులతో ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే ఉన్నారని, ప్రజలకు మేలు చేసే నాయకుడు జగన్ ఒక్కడేనని కోట్లాది మంది నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు.

