ఆంధ్ర పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన.. వెల్లడించిన ఎన్నికల సంఘం
ఆంధ్రలో మే 13 పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఒక్క నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని
ఆంధ్రలో మే 13 పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఒక్క నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా అప్పటి నుంచి ఆంధ్రలో మొత్తంగా నమోదైనా పోలింగ్ శాతం మాత్రం సస్పెన్స్‌గా కొనసాగింది. అన్నీ అంచనాలుగానే బహిర్గతం అయ్యాయి. అయితే తాజాగా ఆంధ్రలో నమోదైనా పోలింగ్ శాతంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అధికారిక ప్రకటన చేశారు. ఆంధ్రలో మొత్తంగా 80.66 శాతం నమోదైందని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్‌లో నమోదైన 1.2 శాతాన్ని కూడా కలుపుకుంటే మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతమని ఆయన ప్రకటించారు.
350 స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు
పోలింగ్ పూర్తయిన వెంటనే ఈవీఎంలను రాష్ట్రవ్యాప్తంగా 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు మీనా వివరించారు. అర్థరాత్రి 2 గంటలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిందని ఆయన తెలిపారు. ‘‘వర్షం కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. సాయంత్రం 6 గంటల సమయం దాటిన తర్వాత కూడా దాదాపు 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియను అబ్జర్వర్లు అందరూ పరిశీలించారు. రీపోలింగ్ గురించి వాళ్లు ఏమీ చెప్పలేదు’’అని ఆయన వివరించారు.
పెరిగిన పోలింగ్
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని మీనా వివరించారు. ‘‘2014లో 78.41శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదయింది. ఈ ఎన్నికల్లో మాత్రం అత్యధికంగా 81.86శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91శాతం పోలింగ్ నమోదయింది. అదే విధంగా అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదయింది. లోక్‌సభ స్థానాల్లో ఒంగోలు 87.06 శాతం పోలింగ్‌తో అత్యధికంగా నిలువగా విశాఖ 71.11 శాతంతో అత్యల్పంగా నమోదయింది’’అని ఆయన వెల్లడించారు.