బాబూ, మీ కాలంలో, మీముందున్న పాలనలో, ఆ ముందు పాలనలో...జరిగిన పాపాలెన్నో
x

బాబూ, మీ కాలంలో, మీముందున్న పాలనలో, ఆ ముందు పాలనలో...జరిగిన పాపాలెన్నో

అచ్యుతాపురం ఫార్మాసెజ్ ప్రమాదాలమీద, వాటివెనక ప్రభుత్వ పాపాల మీద మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ సిఎం బాబుకు రాసిన లేఖ



-ఇఎఎస్ శర్మ


అచ్యుతాపురం SEZ లో జరిగిన ప్రమాదం మొట్టమొదటి కాదు- ప్రభుత్వ విధానాలలో, వైఖరిలో లోతైన మార్పులు అవసరం

మూడు రోజుల కిందట అచ్యుతాపురం SEZ లో ఈసైన్సు (EScience) యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ముప్ఫై మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడడం చాలా బాధాకరమైన విషయం. ఆలస్యం చేయకుండా మీరు బాధితులైన కార్మిక కుటుంబాలను స్వయంగా పరామర్శించి, వారికి నగదు రూపంలో సహాయాన్ని అందించారు, అది హర్షణీయం.

మీరు అందించిన నగదు, దళారుల చేతిలో పడకుండా, కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు భద్రత కలిగించే దిశలో ప్రభుత్వం, వారికి తగిన ఉపాయం కలిగించడం అవసరం.

మీరు వైజాగ్ వదిలిన మరుసటి రోజే, పక్కనే ఉన్న ఫార్మాసిటీ లో, సినర్జీస్ (Synergies) యూనిట్ లో ఇంకొక ప్రమాదం జరిగి, అక్కడ నలుగురు కార్మికులు గాయపడడం మీ దృష్టికి వచ్చి ఉండవచ్చు.

ముందున్న ప్రభుత్వం కాలంలోనే కాకుండా, అంతకు ముందు అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం కాలంలో, అంతకు ముందున్న ప్రభుత్వాల పాలనలో కూడా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో, పరిశ్రమలు నిర్మించి, ప్రజల వద్ద నుంచి లాభాలు గణిస్తూ, అక్కడ పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో , పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం, కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానులకు ఉన్న అన్యోన్య సంబంధాలే అని అందరికీ తెలిసిన విషయం.

చంద్రబాబు నాయుడు, డా. ఇఎఎస్ శర్మ (కుడి)

అటువంటి పరిశ్రమల్లో, ప్రమాదాల వలన, ప్రజల ప్రాణాలకు హాని కలగడమే కాకుండా, ఆ యూనిట్లు వెదజలుతున్న కాలుష్యం కారణంగా, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతున్నది

శ్రీకాకుళం దగ్గర, పైడి భీమవరం లో పని చేస్తున్న రసాయన పరిశ్రమలలో, వైజాగ్ లో ఉన్న LG పాలిమర్స్ లో, పరవాడ ఫార్మాసిటీ లో, నక్కపల్లి దగ్గర హెటిరో డ్రగ్స్ యూనిట్ లో, పాయకరావుపేట దగ్గర డెక్కన్ కెమికల్, అచ్యుతాపురం SEZ లో ఉన్న యూనిట్లలో, నిరంతరం జరుగుతున్న ప్రమాదాలు చూస్తే, పరిశ్రమల యాజమాన్యాల నేర చరిత్ర గురించి, వారి మీద చర్యలు తీసుకోని అధికారుల నిర్లక్ష్యం గురించి అర్థమవుతుంది.

ఉదాహరణకు, 2020లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ ప్రకారం 17-3-2013 నుంచి 27-12-2019 వరకు, అంటే సుమారు ఆరుసంవత్సరాలలో, ఒక్క పరవాడ ఫార్మాసిటీలోనే, 24 ప్రమాదాలు జరగడం, ఆ ప్రమాదాలలో 21మంది కార్మికుల ప్రాణాలు పోవడం, 69 మంది గాయపడడం, విశాఖ పారిశ్రామిక ప్రాంతం ఎంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారిందో అర్థమవుతుంది. ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలకు ప్రమేయమున్నది.

మూడు రోజుల కిందట అచ్యుతాపురం లో జరిగిన ప్రమాదం, ఆ SEZ లో జరిగిన నాలుగో ప్రమాదం. హెటిరో డ్రగ్స్ లో మూడు సార్లు భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిశ్రమల యాజమాన్యంలో, ఒక్కరైనా జైలుకు పోలేదు. ప్రమాదకరమైన యూనిట్లు మూయబడలేదు.

LG పాలిమర్స్ లో 2020 మే లో జరిగిన భయంకరమైన ప్రమాదం విషయంలో, అప్పటి ప్రభుత్వం ఒక దర్యాప్తు కమిటీని నియమించింది. ఆ కమిటీ, ప్రస్తుతం మీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ నీరభ్ కుమార్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వానికి కొన్ని మంచి సలహాలు ఇచ్చింది. గత నాలుగు ఏళ్లలో ఆ సలహాలను ఎంతవరకు ప్రభుత్వం అమలు చేసింది? LG పాలిమర్స్ తర్వాత, అంతులేకుండా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం అయిన రెండు మూడు రోజుల తర్వాత, ప్రమాదం గురించి ప్రభుత్వంలో మరుపు రావడం, నేతలు పరిశ్రమ యాజమాన్యానికి దాసోహం పలకడం ప్రజలకు తెలియని విషయం కాదు.

పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాలలో, వైఖరి లో, లోతైన మార్పులు రావాలి. ఆ విషయంలో, క్రింద సూచించిన విధంగా కొన్ని సలహాలు ఇస్తున్నాను:

1. అచ్యుతాపురం సెజ్ లో Escience యూనిట్ లో జరిగిన ప్రమాదం నేరపూరితమైనది. ప్రభుత్వం అక్కడి యాజమాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. వారందరికీ భారతీయ న్యాయ సంహిత (IPC బదులుగా వచ్చిన చట్టం) క్రింద ప్రాసిక్యూట్ చేసి, ఆలస్యం చేయకుండా కఠినమైన శిక్ష పొందినట్లు చూడాలి. యూనిట్ ను శాశ్వతంగా మూయించాలి. అదే యూనిట్ లో మళ్ళీ ప్రమాదం జరిగితే ప్రజలు సహించరు.

2. Escience విషయంలో, ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు అందించిన నగదే కాకుండా, బాధితులైన కార్మిక కుటుంబాలకు, జీవితాంతం లభించి ఉండే వేతన ఆదాయానికి, ఇతర చట్టపరమైన ప్రయోజనాలకు సమానంగా, పెనాల్టీలను యాజమాన్యం నుంచి సేకరించి, కార్మిక కుటుంబాలకు అందించాలి. యాజమాన్యం మీద కార్మిక చట్టాల ఉల్లంఘనల మీద కూడా చర్యలు తీసుకోవాలి.

3. రాష్ట్రంలో hazardous యూనిట్ లకు, నెల రోజులు నోటీసు ఇస్తూ, ప్రపంచ స్థాయిలో నిర్ణీతమైన safety standards, pollution norms ను అమలు చేసిన రుజువును, ప్రభుత్వానికి చూపించకపోతే, ఆ యూనిట్ లను మూసి వేస్తామని స్పష్టంగా తెలియ చేయాలి. అటువంటి safety సర్టిఫికెట్ లను జాతీయ స్థాయిలో ఉన్న National Safety Council, CPCB నియమించిన నిపుణుల కమిటీల నుంచి యూనిట్ లు తీసుకునే నిబంధనలను ప్రభుత్వం జారీ చేయాలి.

4. National Safety Council, CPCB ఆధ్వర్యంలో hazardous యూనిట్ ల మీద random ఇన్ఫెక్షన్ లను చేపట్టాలి. అటువంటి ఇన్ఫెక్షన్ లో పట్టుబడ్డ యూనిట్ ను తప్పులను సరిదిద్దే వరకు మూయించాలి.

5. యూనిట్ లలో ప్రమాదాలను ప్రభుత్వం సహించదు అనే విషయాన్ని యాజమాన్యాలకు తెలియచేసేటట్లు, ప్రభుత్వం యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకుని, Item 1 లో సూచించిన విధంగా పెనాల్టీలను విధించడమే కాకుండా, యూనిట్ ను మూసివేయవలసి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేయాలి

6. ప్రతి ప్రమాదం విషయంలో, అందుకు సంబంధించిన ప్రభుత్వాధికారులకు కూడా బాధ్యత ఉంది. నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద కూడా చర్యలు చేపట్టాలి.

7. రాష్ట్ర ప్రభుత్వంలో, పరిశ్రమల safety విషయంలో, అధికారులలో సాంకేతిక అవగాహన తక్కువగా ఉండడం గుర్తించాలి. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం జాతీయస్థాయిలో, గుర్తింపబడిన నిపుణులతో కూడిన సలహాదారుల కమిటీని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నియమించాలి. మన రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు [ఉదాహరణకు, "Scientists for People" convened by Dr K Babu Rao: +919491116543) ఉన్నారు. అటువంటి శాస్త్రవేత్తలను సలహా కమిటీలో నియమించాలి

8. గత ఐదేళ్లుగా, ఇటువంటి ప్రమాదాలు మీద ప్రభుత్వం ఎన్నో దర్యాప్తు కమిటీలను నియమించినా, ఆ కమిటీల రిపోర్టుల గురించి కాని, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కాని, పోలీస్ వారు తీసుకున్న చర్యల గురించి కాని ప్రజలకు తెలియదు. ఆ రిపోర్ట్ ల అమలు విషయంలో, పోలీస్ కేసుల విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకుని, నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి

అచ్యుతాపురం లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, ప్రభుత్వం ఎంత నష్ట పరిహారం ఇచ్చినా, పోయిన ప్రాణాలు తిరిగి రావనే విషయం ప్రభుత్వం గుర్తించి, భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినప్పుడే, ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఆత్మకు శాంతి కలుగుతుంది.

ఇప్పుడైనా ప్రభుత్వం ఆటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.

Read More
Next Story