ఏపీలో భూకంపం..ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి
ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్‌లో తరచుగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు, ఏలూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. తాజాగా ప్రకాశం జిల్లాలో శనివారం స్వల్ప భూపకంపనలు చోటు చేసుకున్నాయి. ముండ్లమూరు మండలంలో భూమి కంపించింది. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు వంటి ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి నష్టం జరక్క పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు పరుగులు పెట్టారు. తాళ్లూరు మండలంలోనూ భూమి కంపించింది. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురంతో పాటు మరి కొన్ని గ్రామాల్లోను భూమి కంపించింది. దాదాపు రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం వస్తుందేమోనని ఈ ప్రాంతపు ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. గతంలో కూడా అనేక మార్లు అద్దంకితో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోను స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.