
ఈ-పంట డిజిటల్ సర్వే నమోదు అక్టోబర్ చివరి వరకు
రైతులకు అవకాశం, సిబ్బంది సమన్వయానికి కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ 2025 సీజన్‌కు సంబంధించి ‘ఈ-పంట డిజిటల్ సర్వే’లో పథకాన్ని నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేసిన ఈ సర్వే, రైతుల వ్యవసాయ సాగు, భూ వివరాలను డిజిటల్‌గా నమోదు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 36 శాతం పురోగతి మాత్రమే సాధించగలిగినా వర్షాలు, సిబ్బంది మార్పులు, పని భారం వంటి సవాళ్లు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ గడువు పొడిగింపు రైతులకు బూస్ట్‌గా మారనుంది. ఈ-పంట డిజిటల్ పంటల సర్వేలో భూమి, పంట వివరాల నమోదుకు అక్టోబర్ చివరి వరకు గడువు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ సంచాలకులు డిల్లీ రావు కటించారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 శాతం ల్యాండ్ పార్సిల్‌ల నమోదును లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమం, రైతు సంక్షేమ పథకాల అమలులో మూలాధారంగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
290 లక్షలలో 88 లక్షలు మాత్రమే...
రాష్ట్రవ్యాప్తంగా 290 లక్షల ల్యాండ్ పార్సిల్‌లలో 36 శాతం (88 లక్షలు) మాత్రమే నమోదు పూర్తయినట్లు సంచాలకులు డిల్లీ రావు వెల్లడించారు. గ్రామ స్థాయిలోని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) వ్యవసాయ సహాయకుల ద్వారా వ్యవసాయం, ఉద్యానం, పట్టు, సోషల్ ఫారెస్ట్రీ, సాగుచేయని బీడు భూముల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా రైతుల వారీ పంట సాగు, భూ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఇది పీఎం కిసాన్, పంట బీమా, అన్నదాత సుఖీభవ వంటి కేంద్ర, రాష్ట్ర స్థాయి పథకాలకు ఒకే వేదికగా మారుతుంది. అయితే సీజన్ ప్రారంభం నుంచే గ్రామ, వార్డ్ సచివాలయాల సిబ్బంది పునఃవ్యవస్థీకరణ, బదిలీలు కారణంగా కొత్త సిబ్బంది చేరడం వల్ల సర్వే నంబర్ల గుర్తింపులో ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు.
వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు
వర్షాలు, పని భారం, కొనుగోళ్లు..
ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో విత్తనాలు, ఎరువులు (ముఖ్యంగా యూరియా) పంపిణీలో సిబ్బంది పూర్తిగా నిమగ్నమవ్వడం, వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల క్షేత్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి కొనుగోళ్లలో క్షేత్ర సిబ్బంది ముమ్మరంగా పాల్గొనడం వల్ల పంట నమోదు పనులకు అడ్డుకట్ట వచ్చింది. సచివాలయాలు, ఇతర శాఖల పని భారం కూడా ఆర్‌ఎస్‌కే సిబ్బందిని ప్రభావితం చేసింది. ఈ ప్రత్యేక పరిస్థితుల వల్ల అనుకున్న మేర ఈ క్రాపు నమోదులో ప్రభుత్వం వెనుకంజలో ఉందని చెప్పొచ్చు.
కోస్తా ప్రాంతంలో మెరుగు..
కోస్తా ప్రాంత జిల్లాల్లో మెరుగైన పురోగతి ఉంది. కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో 50 శాతం కంటే ఎక్కువ నమోదు పూర్తయింది. ఈ జిల్లాల్లో సిబ్బంది సమన్వయం, క్షేత్ర పరిస్థితులు అనుకూలంగా ఉండటం కారణంగా ఇది సాధ్యమైంది. అయితే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 22 శాతం లోపు మాత్రమే నమోదు జరిగింది. ఈ జిల్లాల్లో వర్షాలు, కొనుగోళ్ల పనులు, భౌగోళిక కష్టాలు ప్రధాన అడ్డంకులుగా నిలిచాయి. ఈ వైవిధ్యాన్ని గమనించి పొడిగించిన కార్యాచరణ ప్రణాళికలో అక్టోబర్ చివరి వరకు పంట సాగు చేసిన కమతాలు, సాగు చేయని బీడు భూముల నమోదును పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ల పర్యవేక్షణ, అదనపు సిబ్బంది..
ఈ-పంట నమోదును గడువు లోపు పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ల పూర్తి స్థాయి సహకారం, సమన్వయం అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతు సేవా కేంద్ర సిబ్బందిని ఇతర సచివాలయ సర్వేలకు, పనులకు అప్పచెప్పకుండా చూడాలని, గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓలు) సంయుక్త అజమాయిషీ ప్రక్రియలో సక్రమంగా పాల్గొనేలా చూడాలని కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా స్థాయిలో రోజువారీ పురోగతిని సమీక్షించాలని, అవసరమైన చోట అదనపు సిబ్బందిని కేటాయించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ చేయాలని ప్రత్యేకంగా కోరారు.
కీలక తేదీలు
పంట సాగు వివరాల నమోదు చివరి తేదీ: అక్టోబర్ 25, 2025.
సామాజిక తనిఖీ, సవరణలు, మార్పుల చివరి తేదీ: అక్టోబర్ 30, 2025.
తుది జాబితా నోటీస్ బోర్డుల్లో ప్రదర్శన: అక్టోబర్ 31, 2025.
ఈ-పంట డేటా రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మూలాధారంగా మారడంతో ఈ నెల చివరి వరకు నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు అధికారులు పిలుపు నిచ్చారు. డిజిటల్ వ్యవసాయ యుగంలో ఈ సర్వే, రాష్ట్ర వ్యవసాయ శాఖ స్మార్ట్ ఫార్మింగ్ లక్ష్యాలకు ముఖ్య దశగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గడువు పొడిగింపు ద్వారా 100 శాతం కవరేజ్ సాధించి, రైతుల శ్రేయస్సును మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం స్పష్టమవుతోంది.