
దువ్వాడ శీను..దుమ్మురేగింది ఆఖరి సీను
ఎట్టకేలకు దువ్వాడపై చర్యలకు వైసీపీ ఉపక్రమించింది. దువ్వాడపై ఇప్పుడే ఎందుకు వేటు వేశారనేది చర్చగా మారింది.
దువ్వాడ శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలోనూ పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాలకంటే ఇంటిపోరుతోనే ఆయన ఎక్కువ పేరు తెచ్చకున్నారు. ఇటీవల కాలంలో ఏ రాజకీయ నాయకుడూ ఆయనలా రచ్చకెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ పేరు, తీరు మారుమోగి పోతోంది. ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ భార్యా పిల్లలతో విభేదించి మరో సన్నిహితురాలితో చెట్టపట్టాలేసుకుని తిరగడమే కాదు.. ఆమెతో రీల్స్ చేయడం, మీడియాలోనూ హల్చల్ చేయడం నిత్యకృత్యమైంది. వైసీపీ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆ పార్టీ ఏనాడూ దువ్వాడ యవ్వారాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. దాదాపు ఏడాది తర్వాత ఇప్పడు తీరిగ్గా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ అధిష్టానం తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని ఇప్పడు ఉత్తరాంధ్ర వైసీపీలో చర్చించుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ 1966 జులై 10న జన్మించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని చేపట్టారు. కాంగ్రెస్‌లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరి కొందరితో పొసగక పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున టెక్కలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పీఆర్పీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి చేతిలో ఓటమి చవిచూశారు. అంతకుముందే దువ్వాడ శ్రీనివాస్‌కు సతీమణి వాణితో విభేదాలున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో శ్రీనివాస్‌కు టిక్కెట్టు ఇవ్వవద్దని, ఒకవేళ ఇస్తే ఆయనపై తానే ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారడంతో అప్పట్లో సీఎంవో స్థాయిలో పంచాయతీ పెట్టి వాణిని భర్తపై పోటీకి దిగకుండా ఒప్పించగలిగారు తప్ప కుటుంబ తగాదాలను చల్లార్చలేకపోయారు. ఇక ఎన్నికల తర్వాత నుంచి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని, ఆయన తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భార్యాపిల్లలు బహిరంగంగా ఆరోపించారు. ఇలా ఇంట్లో విభేదాలు వీధికెక్కడం, భార్యా పిల్లలు ఒకటి, శ్రీనివాస్ ఒకటిగానూ వేరయ్యారు. దువ్వాడ దంపతులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
‘శీను’లోకి మాధురి ప్రవేశం..
ఇలా దువ్వాడ కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరడం, భార్యా బిడ్డలకు దూరంగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో శ్రీను సన్నిహితురాలిగా పేరుపడ్డ దివ్వెల మాధురి నేరుగా సీనులోకి వచ్చారు. ఆపై ఆయనకు మరింత చేరువయ్యారు. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుంటూ ఊరూవాడలు తిరిగారు. తానో బాధ్యత గల ప్రజాప్రతినిధిని అన్న ధ్యాస లేకుండా వ్యవహరించారు. ఇద్దరూ బహిరంగంగా రీల్స్ చేస్తూ, వలపు గీతాలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ హల్‌చల్ చేశారు. దీంతో మీడియాకూ, సోషల్ మీడియాకు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యారు. గత అక్టోబరు 11న శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్, సన్నిహితురాలు/ప్రియురాలు దివ్వెల మాధురి రీల్స్ చేయడం, శ్రీవారి పుష్కరిణిలో ఫోటో షూట్ చేయడం వంటివిపెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో వీరిద్దరిపై టీటీడీ ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు 292, 296, 300 బీఎన్‌ఎస్, సెక్షన్ 66 ఈఏటీ యాక్ట్ 2000–2008 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వీరిద్దరూ తగ్గేదే లే! అంటూ దూకుడును కొనసాగిస్తూనే ఉన్నారు.
వైసీపీ నేతలు మొత్తుకున్నా..
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ కార్యకలాపాలకు గాని, సమావేశాలకు గాని హాజరు కావడం లేదు. పార్టీ బలోపేతానికి కూడా పాటుపడడం లేదన్న భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది. దీంతో పార్టీ నాయకులు ఆయన్ను ప్రత్యేకించి ఆహ్వానించడం లేదు. ఆయన వెళ్లడం లేదు. ఆయన వ్యవహార శైలితో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చాన్నాళ్లుగా రగిలిపోతున్నారు. దువ్వాడ తీరు వల్ల వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతోందని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని, కనీసం సస్పెండ్ అయినా చేయాలని ఎప్పట్నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం మానేసింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఆరు నెలల క్రితం వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను తప్పించింది. ఆయన స్థానంలో శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన పేరాడ తిలక్ ను నియమించింది. అయినప్పటికీ దువ్వాడ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.
ఇప్పుడే ఎందుకు వేటు వేశారు?
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దాదాపు ఏడాదికి పైగా వైసీపీకి తలనొప్పిగా మారినా అధిష్టానం సీరియస్‌గా తీసుకోలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దువ్వాడ తీరుతో పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ఫిర్యాదులు చేసినా డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరించింది. అధిష్టానం వైఖరితో వైసీపీ శ్రేణులు కూడా విసిగి వేశారి పోయారు. ఇంతలా పార్టీకి చెడ్డపేరు వస్తోందని గగ్గోలు పెట్టినా పట్టించుకోని అధిష్టానం ఉన్నట్టుండి ఇప్పుడు (మంగళవారం) దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఎందుకంటే? ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురితో కలిసి ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నా దృష్టిలో లోకేష్ ద బెస్ట్ డిప్యూటీ సీఎం అవ్వడమే కాదు.. సీఎం కూడా అవ్వాలి’ అంటూ లోకేష్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. దీనిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆ వీడియో క్లిప్పింగులను పంపించారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్పుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే దువ్వాడ వైఖరితో పార్టీకి చాలా నష్టం వాటిల్లిందని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పార్టీకి డ్యామేజి జరిగాక ఇప్పడు ఆయనను సస్పెండ్ చేశారంటూ కొందరు వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దువ్వాడను సస్పెండ్ చేయడం ఒకింత మంచి నిర్ణయమని టెక్కలి నియోజకవర్గానికి చెందిన అప్పలనాయుడు అనే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ప్రతినిధితో చెప్పారు.
దువ్వాడ ఏ పార్టీలో చేరతారు?
వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏ పార్టీలో చేరతారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కుటుంబ తగాదాలతో కుటుంబానికి దూరమవడం, సన్నిహితురాలితో బహిరంగంగా రీల్స్ చేస్తూ వివాదాస్పదునిగా మారడం వంటివి ఆయనకు ప్రతికూలంగా మారాయి. టీడీపీలో చేరడానికి ఆయనకు బద్ధశత్రువైన మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించే పరిస్థితి లేదు. అలాగే జనసేనలో చేర్చుకునేందుకు కూడా ఆ పార్టీ నాయకులు సుముఖంగా లేరని టెక్కలి నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి తాను మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్‌ను పొగడుతూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే యోచనలో ఉన్నట్టు దువ్వాడ అనుయాయులు చెబుతున్నారు.
Next Story