
కో-ఆపరేటివ్ సొసైటీ ఆడిట్లలో 'అసలెంత'? నొక్కుడెంత?
కంప్యూటరీకరణ వెనుక కాదనలేని మతలబులెన్నో?
గ్రామాల్లో రైతుల ఆర్థిక ఆసరా అయిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పిఎసిఎస్) ఇప్పుడు ఆడిట్ అవకతవకలు, కంప్యూటరీకరణ హడావుడి మధ్య చిక్కుకుపోయాయి. 'డ్యూ టు (due to) ' అనే మాయా పద్దు దశాబ్దాలుగా లెక్కలను మభ్యపెట్టి, నష్టాలను మరుగుపరుస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రూ.2516 కోట్లతో కంప్యూటరీకరణ ప్రాజెక్టును ప్రకటించి, పారదర్శకత, సామర్థ్యం పెంపుదలపై హామీలిస్తోంది. కానీ, గ్రామస్థాయిలో సంఘ కార్యదర్శులు, సభ్యులు తప్పుడు ఎంట్రీలు, ఎన్‌పీఏల మాయలతో సతమతమవుతున్నారు. ఆడిటర్లు ఫ్రెండ్స్ గా కాకుండా, భయపెట్టే బూచీలుగా మారారు. ఈ దోపిడీ ఎప్పుడు అంతమవుతుంది? సహకార శాఖ, ప్రభుత్వాలు, సమాజం ఎప్పుడు మేల్కొంటాయి? రైతుల హృదయాలను కదిలించే ఈ వాస్తవాలు.
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) కంప్యూటరీకరణ హడావుడి ఏడాది కాలం నుంచి రాష్ట్రంలో సాగుతోంది. దేశంలో నూరేళ్లకు పైగా సహకార రంగ చరిత్రలో ఇదో నూతనాధ్యాయంగా పేర్కొంటూ, సహకార సంఘాల కంప్యూటరీకరణ ద్వారా అందించే సేవల గురించి గ్రామాల్లో సభ్యులకు అవగాహన కల్పించాలని సహకార శాఖ కసరత్తు చేస్తోంది. కానీ, ఈ హడావుడి వెనుక ఆడిట్ విభాగం లోపాలు, అవకతవకలు మరోవైపు వెక్కిరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రారంభించిన సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ కింద 63,000 పిఎసిఎస్‌లను కంప్యూటరీకరించాలని, రూ.2516 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. 2025 నాటికి 67,930 సంఘాలకు అనుమతులు ఇచ్చి, రూ.741 కోట్లు విడుదల చేశారు. పారదర్శకత పెంపొందించడం, రుణాలు త్వరగా ఇవ్వడం, ఖర్చులు తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కానీ వాస్తవం? హడావుడి ఎంట్రీలతో తప్పులు, సాఫ్ట్‌వేర్ కంపెనీల లాభాలు, ఆడిట్ లోపాలు వెంటాడుతున్నాయి.
సభ్యులే భాగస్వాములుగా..
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఏర్పాటు వెనుక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే, మన దేశంలో సంఘాల స్థాపన జరిగింది. ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో రైతులు అధిక వడ్డీకి రుణాలు తెచ్చి, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి, ఆనక అప్పులు తీర్చలేక సతమతమవుతున్న తరుణంలో.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా సహకార సంఘాలను స్థాపించారు. సభ్యులే భాగస్వాములైన సహకార సంఘంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుని, పాలకవర్గాన్ని ఎన్నుకొని, సంఘ వ్యవహారాలు నడిపించుకోవా ల్సిందిగా సహకార సూత్రాలు, నియమాలు తెలియజెపుతాయి, సంఘ ఉద్యోగిగా కార్యదర్శి సంఘానికి సంబంధించిన లోన్ రిజిష్టర్, అడ్మిషన్ రిజిష్టర్, నగదు పుస్తకం, తదితర రికార్డు పుస్తకాలు స్వయంగా రాసుకొని, తన ఆధీనంలో వుంచుకుంటాడు. సంఘ సందర్శనకు అధికారులు వచ్చి తనిఖీ చేసినపుడు, సంఘ మహాజన సభ జరిగినపుడు రికార్డులు చూపించాల్సిన బాధ్యత కలిగి వుంటాడు. కంప్యూటరీకరణతో అలాంటి పుస్తకాలన్నీ ఇపుడు కంప్యూటర్ లో నిక్షిప్తమయ్యాయి. ఆన్ లైన్ పాస్ వర్డ్ తో ఎవరు తెరిచినా పారదర్శకంగా కనబడేలా, సంఘ కార్యదర్శి తప్పుడు ఎంట్రీలు వేయడానికి అవకాశం లేకుండా బందోబస్తు జరిగింది. సంఘ సభ్యులు తిరిగి చెల్లించే రుణాలకు సంబంధించి వడ్డీలు కట్టడం, రశీదు ప్రకారం నగదు పుస్తకంలోకి తీసుకురావడం కూడా కంప్యూటర్ ద్వారా జరిగిపోతోంది. సంఘ సభ్యునికి వున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు, ఫిక్స్ డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవడం కూడా సులభతరం అవుతోంది. ఇవన్నీ సహకార సంఘాలను కంప్యూటరీకరించడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలని సహకార శాఖ భావిస్తోంది. కానీ, గ్రామాల్లో రైతులకు బ్యాంకింగ్ అవగాహన లేకుండా, కార్యదర్శులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా ఇది సాధ్యమా? అనేది ప్రధాన ప్రశ్న.
‘వామ్నికామ్’ అధ్యయనాల ప్రకారం… పిఎసిఎస్‌లలో ఐసీటీ (Information and Communication Technology) అనుసరణలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. శిక్షణ లోపం, మౌలిక సదుపాయాల లేమి, డేటా సెక్యూరిటీ వంటి సమస్యలు. ఒత్తిడితో ఎంట్రీలు వేస్తున్నారు కానీ, తప్పులు పెరుగుతున్నాయి!
ఆర్థిక స్వావలంబన అసలు లక్ష్యం
నిజానికి సహకార సంఘాల స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. రైతులు తక్కువ వడ్డీరేట్లతో అప్పులు పొందడంతో పాటు, సహకార సంఘంలో భాగస్వాములుగా వుంటూ వ్యవసాయానికి అనుబంధమైన వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చే లాభాలను డివిడెండ్ల రూపంలో పంచుకుంటూ, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం. కానీ ఇప్పుడు లక్ష్యం మారిపోయింది. గ్రామాల్లోని రైతులకు బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక సహకార సంఘం ఆకస్మికంగా అవగాహన కల్పించగలుగుతుందా? కంప్యూటరీకరణ జరగ్గానే సంఘ కార్యదర్శి కంప్యూటర్స్ పరిజ్ఞానాన్ని పొందగలడా? ప్రాథమిక అవగాహన కల్పించకుండానే సహకార శాఖ ఒత్తిళ్లతో ఎన్ని సహకార సంఘాలు కంప్యూటర్ లో సరైన ఎంట్రీలు వేయగలవు.
అదో చిక్కులు వీడని 'పజిల్'!
ఇక, అసలు విషయానికొస్తే.. ఒక సహకార సంఘ ఆర్థిక స్థితిని తెలియజేసేది సంఘ తుది ఆడిట్ నివేదిక. దీనిలో వుండే లొసుగులు అన్నీ ఇన్నీ కావు. ప్రతి ఆర్థిక సంవత్సరం, అంటే, ఏప్రిల్ ఒకటో తేదీ నుండి వచ్చే మార్చి 31వ తేదీ వరకు జరిగిన లావాదేవీలు, ఆదాయ వ్యయాలను బట్టి సంఘ లాభనష్టాల పట్టిక, సంఘ వ్యవహారాల్లో లోపాలు ఎత్తిచూపుతూ సంఘాన్ని లాభాల వైపు నడిపించవలసిన తుది ఆడిట్ నివేదిక సంఘ సభ్యులకు గాని, పాలకవర్గానికి గాని, కనీసం సంఘ కార్యదర్శి కానీ అర్థంకాని 'పజిల్'లా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు! మొదట గుర్తించుకోవాల్సిన విషయమేమిటంటే.. సహకార సంఘమనేది వ్యాపార సంస్థ కాదు. అది లాభాపేక్షతో పనిచేయదు. కేవలం సేవా దృక్పథంతో మాత్రమే ఏర్పాటు చేసినది. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలు చూస్తే.. పిఎసిఎస్‌లలో రుణాల రికవరీ సమస్యలు, ఎన్‌పీఏలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) పెరుగుతున్నాయి. హర్యాణలోని అధ్యయనాలు పిఎసిఎస్ సవాళ్లను ఎత్తిచూపుతున్నాయి. రుణ పరిమితి తగినంత లేకపోవడం (87.40 శాతం మంది రైతులు ఈ సమస్యను పేర్కొన్నారు), తిరిగి చెల్లించే కాలం చాలా స్వల్పంగా వుండడం (66 శాతం పైగా రైతులు ఇది సమస్యగా చెప్పారు). ‘ఈ సంఘాలు లాభాపేక్ష లేని సేవాసంస్థలు. కానీ, ఆడిట్ నివేదికలు అర్థం కాని గందరగోళ పజిల్‌గా మారాయి’ అని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
అంతూపొంతూ లేని పద్దు..'డ్యూటు'!
సహకార శాఖకు చెందిన ఆడిటర్లు కాని, సహకార శాఖ ఉన్నతాధికారులు కానీ ఒక్క తుది ఆడిట్ నివేదిక పేజీలు తిరగేసిన దాఖలాలు కానరావు. ఎక్కడా లేనివిధంగా సహకార సంఘ ఆర్థిక నివేదికల్లో మాత్రమే 'డ్యూటు' అనే పద్దు వుంటుంది. ఆ పద్దు గత 20, 30 సంవత్సరాలుగా ఒకే అంకెలతో నడుస్తూ, ప్రతి ఏడాది కొత్త సంఖ్యలు చేర్చుకుంటూ వుంటుంది. దాన్ని ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్) పేరుతో 100 శాతం ప్రొవిజన్ చేసి, ప్రతి సంవత్సరం లాభనష్టాల పట్టికలో నష్టాల్లో చూపుతారు. 'డ్యూటు' అంటే రావలసిన మొత్తం అని అర్థం. కానీ అత్యంత మేధావులైన సహకార శాఖ ఆడిటర్లు బ్యాలన్స్ షీటు ట్యాలీ కాకపోతే ఎంతమేరకు అవ్వడం లేదో ఆ మొత్తాన్ని 'డ్యూటు'లో వేసేసి, ఆడిట్ ముగించేస్తారు. 'డ్యూటు'లోని మొత్తాలు సంఘాలకు జమ (రికవరీ) అయినప్పటికీ, 'డ్యూటు' తగ్గించే ప్రయత్నం చేయరు. ఇంకా విచిత్రమేమిటంటే అసలు 'డ్యూటు' పద్దులో వున్న మొత్తాలు ఎప్పుడు (ఏ సంవత్సరం) పెట్టారో, ఎవరి దగ్గర నుంచి వసూలుచేయాలో వివరాలు వుండవు.
ఆర్థిక ప్రగతిపై అంతుచిక్కని నివేదికలు!
ఇక, ఎన్పీఏ విషయానికొస్తే సంఘాన్ని లాభాల్లో చూపించాలనుకుంటే.. గత ఏడాది నాటి ఎన్పీఏ మొత్తాన్ని లాభనష్టాల ఖాతాలో లాభం వైపు తగ్గిస్తారు. ఆ సంవత్సరం నాటి ఎన్పీఏ మొత్తాన్ని నష్టం వైపు కలపడం మానేస్తారు. సంఘ ఆర్థిక ప్రగతికి అద్దం లాంటి తుది నివేదిక చూడాలంటేనే భయపడేటన్ని షెడ్యూల్స్ వుంటాయి. ఒక గ్రామంలోని సహకార సంఘం లెక్కలు ఆ గ్రామంలోని సభ్యులు తెలుసుకోవాలంటే ఎలా? సహకార శాఖ ఆడిటర్లు లెక్కలు తిరగేయరు, లోపాలు మరుగుపరుస్తారు. మహాజన సభలో ప్రవేశపెట్టినా, ఎవరికీ అర్థంకాని రీతిలో ఆర్థిక ప్రగతిని తెలియజేసే నివేదిక వుంటుంది. దీన్ని సంస్కరించాలని సహకార శాఖకు ఎందుకనో ఆలోచన రాదు!
సహకార సంఘాలన్నింటికీ కంప్యూటర్లు కొనిపించి, కొత్త సాఫ్ట్ వేర్ వేసేసి, అర్జెంటుగా సంస్కరణలు తెచ్చేయాలన్న సహకార శాఖ ఉన్నతాధికారుల ఉత్సాహం వెనుక వున్న మర్మమేమిటో? ఆ ఉన్నతాధికారులకు అన్నివిధాలా సహకరిస్తున్న కొందరు యూనియన్ నాయకుల ప్రయోజనాలేమిటో? గ్రామస్థాయిలో ఒక సహకార సంఘం ఎలా పనిచేస్తోందీ అవగాహన లేని ఉన్నతాధికారులు, కొరడా ఝుళిపించి, సంఘ కార్యదర్శుల చేత హడావుడిగా ఎంట్రీలు వేయించి, ఇకపై కంప్యూటర్ ఆపరేటర్లకే సంఘాలను అప్పగించడానికి ఎందుకంత ఆత్రుత పడుతున్నారో?
సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రయోజనాలకేనా..
ఒకసారి తప్పుడు ఎంట్రీలు, లేదా డబుల్ ఎంట్రీలు పడిన తర్వాత, వాటిని మార్చమంటూ సాఫ్ట్ వేర్ ప్యాకేజీ వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్లు మళ్లీ ప్రభుత్వం (కేంద్రం) వారి నుంచి ఆ సర్వీసు చార్జీలు వసూలు చేయడం, ఇదంతా హాస్యాస్పదంగా లేదా? ఇంత గొలుసుకట్టుగా, బహిరంగంగా దోపిడీ జరుగుతుంటే.. సహకార సంఘ సభ్యులకు సంఘంపై అవగాహన కలుగజేసేది ఎవరు? కంచే చేను మేసిన చందాన సహకార శాఖ వ్యవహరిస్తుంటే, పాలకులు చూస్తూ కూర్చోవడం వింత కాదా!? ఉన్నతాధికారులు కంప్యూటర్లు కొనిపించి, సాఫ్ట్‌వేర్ వేసేసి సంస్కరణలు తెస్తామంటున్నారు. కానీ, గ్రామస్థాయి అవగాహన లేకుండా ఒత్తిడి చేస్తున్నారు. తప్పుడు ఎంట్రీలు పడితే, సాఫ్ట్‌వేర్ కంపెనీలు చార్జీలు వసూలు చేస్తాయి. గోవా, వెస్టర్న్ జోన్ అధ్యయనాల్లో ఇటువంటి సమస్యలే వెలుగులోకి వచ్చాయి. పిఎసిఎస్‌లలో ఉద్యోగులు అక్కడ కంప్యూటరీకరణను అడ్డుకుంటున్నారు. డేటా ప్రైవసీ సమస్యలు సభ్యుల గుండెల్లో భయం నింపుతున్నాయి. యూనియన్ నాయకులు అధికారులతో చేతులు కలిపారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల దోపిడీ, తప్పుడు ఎంట్రీల హడావుడి బహిరంగంగా కొనసాగుతోంది. రైతు సభ్యులకు ఈ అన్యాయంపై అవగాహన కల్పించి, న్యాయం చేసేదెవరు? అని అధ్యయనాలు ప్రశ్నిస్తున్నాయి.
అడ్డగోలు దోపిడీపై ప్రశ్నించేవారేరీ?
ఒక సహకార సంఘంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ చిన్న పుకారు ఎవరి నోటి నుంచైనా వినగానే, పత్రికాలోకం స్పందించి పెదపెద్ద అక్షరాలతో పత్రికల్లో ప్రచురించి, ఆ సంఘంపై విచారణ జరిగి, సహకార శాఖ వారి భస్మాసుర హస్తం పడేదాకా శాంతించని సంఘటనలెన్నో వున్నాయి. మరి, కంప్యూటరీకరణ పేరిట జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించేవారేరీ? సహకార శాఖలో 'ఆడిట్' గురించి కనీస పరిజ్ఞానం లేనివారిని ఆడిటర్లుగా వేసి, సంఘాలు కుప్పకూలడానికి కారకులవ్వడమే కాక, కొత్తగా సహకార సంఘాల ఆడిట్ పనులను చార్టెడ్ అకౌంటెంట్లకు అప్పగించారు. వీళ్ళ టైపు మరో రకం. అసలు సంఘాల వైపు చూడను కూడా చూడరు. సహకార శాఖ ఆడిటర్ల మాదిరిగానే ఎవరో ఒక రిటైర్డ్ సహకార శాఖ ఆడిటర్ ద్వారా తుది ఆడిట్ నివేదిక
వేయిస్తారు. ప్రతి సహకార సంఘ ఆడిట్ రిపోర్ట్ లోనూ ఒకేలాంటి లోపాలు ఎత్తిచూపుతూ వుంటారు. ఇంకా ముందుకెళ్లి అత్యుత్సాహం ప్రదర్శించే ఆడిటర్లు ప్రత్యేక నివేదికలిస్తూ, విచారణకు రికమండు చేసేస్తూ గొప్పలు పోతుంటారు.
దశాబ్దాలుగా దో'బూచి'లాట!
ఆడిటర్ సంఘానికి స్నేహితుడు, మార్గదర్శకుడు కావాలి. కానీ సంఘ పాలకవర్గాన్ని, ఉద్యోగులను భయపెడుతూ 'డ్యూటు' అనే బూచిని చూపిస్తూ వుంటాడు. గత మూడు దశాబ్దాలకు పైగా ఇలాంటి ఆడిట్ వ్యవహారం నడుస్తున్నా.. సంస్కరించాలన్న ఆలోచన రాని సహకార శాఖ ఉన్నతాధికారులు, ఆకస్మికంగా సహకార సంఘాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే ఘనకార్యం మాత్రం తలపెట్టారు. బాగానే వుంది. సహకార సంఘాల్లోని కంప్యూటర్లలో ఫీడ్ అయిన లోన్ లెడ్జర్లు, అడ్మిషన్ రిజిష్టర్, తీర్మానాల పుస్తకాలతో పాటు ప్రతి సంవత్సరం సంఘ నగదు పుస్తకం నుండి ఏ నెలకు ఆ నెల, ఏ పదుకు ఆ పద్దు చూపే 'జనరల్ లెడ్జర్' అనే ఒక రిజిష్టర్ వుంది. అన్ని రికార్డులతో పాటు పాత ప్రారంభ నిల్వ (ఓపెన్ బ్యాలెన్స్) లతో ఈ జనరల్ లెడ్జర్ లో ఫీడ్ చేశారు. ఇక్కడి వరకు సరే. కంప్యూటరైజేషన్ అయ్యాక తుది ఆడిట్ నివేదిక వేయాల్సి రావడంతో, చిక్కు మొదలైంది.
'అన్నప్రాసనలో ఆవకాయ'లా..
హడావుడిగా వేసిన ఓచర్లు కొన్ని తప్పుడు అంకెలతోనూ, మరికొన్ని డబుల్ ఎంట్రీలతోనూ 'ఓచింగ్' అనే మొదటి అడుగులోనే అడ్డుపడ్డాయి. ప్రతి ఏడాది జాన్ 30 నాటికి అన్ని సహకార సంఘాల ఆడిట్ పూర్తిచేయాల్సి వుంటుంది. అసలే ఆడిటర్లకు ఏమీ తెలీదు. పైగా కంప్యూటర్ లో పూర్తి చేయాలి. 'అన్నప్రాసనలో ఆవకాయ పెట్టినట్టు' వికటించింది పరిస్థితి. మళ్లీ సహకార శాఖ అధికారుల 'కొరడా' వేధింపులు మొదలయ్యాయి. ఈ దుస్థితిని ప్రశ్నించాల్సిన యూనియన్ నాయకుల్లో కొందరు 'స్వాహా'కారంలో భాగస్వాములయ్యాక, చెయ్యగలిగిందేముంది? టిక్కెట్లు రైజ్ చేస్తూ.. సాఫ్ట్ వేర్ వారికి ఉపాధి, ఆదాయం కల్పించడం తప్ప!
తప్పులు కప్పెట్టని కంప్యూటర్లు!
ఇక ఆడిట్ లో రెండో అడుగు జమా-ఖర్చుల ఖాతా. ట్రయల్ బ్యాలెన్స్, ఆపై లాభనష్టాల ఖాతా. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సహకార సంఘ తుది ఆడిట్ నివేదిక సంఘ కార్యదర్శి కోరినట్లు వేస్తారని! అయితే, కంప్యూటర్లు అలా ఒప్పుకోవు కదా. ప్రతి షెడ్యూల్ లోనూ అంకెలు తప్పు చూపిస్తున్నాయి. ఏదోలా కష్టపడి ఫైనల్ కి వెళ్తే.. ప్రతి లోన్ పై ఎన్పీఏ తీసుకుని, సంఘాలు కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా చాలాదన్నట్టు సహకార సంఘాలకు వచ్చిన లాభాల్లో 50 శాతం రిజర్వ్ ఫండ్ లో జమచేయాలని జిల్లా సహకార కేంద్ర (డిసిసిబి) బ్యాంకులు ఒక రూల్ పెట్టాయి. నిజానికి సంఘం నష్టాల్లో వున్నపుడు రిజర్వ్ ఫండ్ ను బ్యాంకు విడుదల చేయాలి. కానీ, ఇది ఎక్కడా జరగట్లేదు. ఆడిట్ చేయడం రాని ఆడిటర్లు, కంప్యూటర్ పరిజ్ఞానం లేని కార్యదర్శులు, నష్టాలను చూపించే ఆడిట్ రిపోర్టులు.. వీటన్నిటి మధ్యా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన పర్సన్ ఇంచార్జీలు!
దత్తతతో కొత్త ఆశలు చిగురించేనా!
కేంద్ర ప్రభుత్వం సహకారోద్యమాన్ని కొత్త మలుపు తిప్పాలనే సంకల్పంతో సంస్కరణలు ప్రవేశపెడుతున్నా, గ్రామస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. సంఘాలను సవ్యంగా నడిపించే బాధ్యత వహించాల్సిన సహకార శాఖ, వాటినే భక్షిస్తూ వుంటే, సహకార వ్యవస్థ కుప్పకూలిపోడానికి మరెంతో కాలం అవసరం వుండదేమో!? నిజానికి సహకార శాఖలోని ఉద్యోగులే ఒక్కో సంఘాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే, కనీసం ఏ ఒక్క సంఘమైనా ప్రస్తుత బ్యాంకులు ఇచ్చే పోటీని తట్టుకొని, గ్రామస్థాయిలో సంఘ సభ్యులకు న్యాయం చేయగలదేమో..! ప్రభుత్వ ఉద్యోగులు పైనుంచి కింది స్థాయి వరకు అధికారాన్ని, పెత్తనాన్ని చలాయిస్తూ, సహకార చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తూ వుంటే, సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థకమే!?
అంతటా అదేలాంటి గుండెకోత!
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) ఆడిట్ వ్యవస్థలోని అవకతవకలు, కంప్యూటరీకరణ హడావుడిలోని లోపాలు రైతు సభ్యుల గుండెలను కదిలిస్తున్నాయి. 'డ్యూటు' అనే బూచి దశాబ్దాలుగా లెక్కలను మరుగుపరుస్తుంటే, సాఫ్ట్‌వేర్ కంపెనీలు సభ్యుల డివిడెండ్లను దోచుకుంటున్నాయి. గుంటూరు నుంచి విశాఖ వరకు, ప్రతి జిల్లాలోని సంఘాల్లో ఈ కథనాలు ఒకే రకం. ఈ ‘కేస్ స్టడీ’లు సహకార వ్యవస్థలోని నిజమైన సమస్యలను సూటిగా, స్పష్టంగా, సరళంగా బయటపెడుతూ, సంస్కరణల అవసరాన్ని చాటి చెబుతున్నాయి.
పీఏసీఎస్ లో ‘డ్యూటు బూచి’!
గుంటూరు జిల్లాలోని ఒక గ్రామ పీఏసీఎస్ లో 1995లో వసూలు కాలేని రూ.4 లక్షలు ‘డ్యూటు’ పద్దులో నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మొత్తంలో కొంత భాగం వసూలైనా, ఆడిట్ నివేదికల్లో మాత్రం మార్పు లేదు. ఇప్పుడు అదే ‘డ్యూటు’ మొత్తం రూ.12 లక్షలకు చేరింది. సభ్యులు ఎప్పటికప్పుడు వసూలు రశీదులు చూపించినా, ఆడిటర్లు మాత్రం ‘డ్యూటు’లో తగ్గించలేదు. ఫలితం.. సంఘం ఎప్పటికీ నష్టాల్లో వున్నట్టే రికార్డుల్లో నమోదవుతోంది.
డివిడెండ్ ను మించిన సాఫ్ట్‌వేర్ చార్జీలు!
కృష్ణా జిల్లాలో ఒక పెద్ద పీఏసీఎస్ కి కంప్యూటరీకరణ కోసం రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పేరుతో ప్రతి సంవత్సరం మరో రూ.60 వేల సర్వీస్ చార్జీలు కట్టాల్సి వస్తోంది. సభ్యులకు ఇచ్చే డివిడెండ్ కంటే ఎక్కువ మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీకి వెళ్తోంది. దీనిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినా, ఉన్నతాధికారులు సాఫ్ట్‌వేర్ తప్పనిసరి అంటూ ఒత్తిడి చేస్తున్నారు.
మనది లాభమా, నష్టమా? చెప్పండి చాలు!
విశాఖ జిల్లాలోని ఒక పీఏసీఎస్ వార్షిక మహాజన సభలో ఆడిట్ నివేదిక చదివారు. 12 పేజీల నివేదికలో 30 షెడ్యూల్స్, 15 రకాల పట్టికలు వున్నాయి. రైతు సభ్యులు ఎవరికీ అవి అర్థం కాలేదు. ఒక వృద్ధ రైతు లేచి ‘మేము ఎంత అప్పు తీర్చాం. మా సంఘం లాభంలో వుందా? నష్టంలో వుందా? - అంతే చెప్పండి’ అని ప్రశ్నించాడు. కానీ, ఆడిటర్ సమాధానం చెప్పలేకపోయాడు. సభ మౌనంగా ముగిసింది.
డబుల్ ఎంట్రీతో రైతుకు తంటా..
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని ఒక పీఏసీఎస్ లో కార్యదర్శి కంప్యూటర్ పరిజ్ఞానం లేక, పొరపాటున ఒక రైతు రుణాన్ని రెండుసార్లు (డబుల్ ఎంట్రీ) ఎంట్రీ వేశాడు. మొత్తం రూ.80 వేల రుణం రూ.లక్షా 60 వేలుగా చూపాడు. రైతు తిరిగి చెల్లించినా, సాఫ్ట్‌వేర్ లో ఎంట్రీ సరిచేయకపోవడంతో ఆ మొత్తం ఇంకా బకాయిగానే చూపిస్తోంది. దీంతో సభ్యుడు రుణం చెల్లించినా కూడా ‘డిఫాల్టర్’ లిస్ట్ లోనే వున్నాడు.
రిజర్వ్ ఫండ్ లాక్ తో అన్యాయం!
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పీఏసీఎస్ ఈ సంవత్సరం రూ.3 లక్షల లాభం చూపించింది. కానీ, ఆ లాభంలో 50 శాతం మొత్తాన్ని రిజర్వ్ ఫండ్ లో బలవంతంగా బ్లాక్ చేయడంతో, సభ్యులకు డివిడెండ్లు ఇవ్వలేకపోయింది. సంఘం నష్టాల్లో వున్నప్పుడు బ్యాంకులు రిజర్వ్ ఫండ్ విడుదల చేయకపోవడం, లాభాల్లో వున్నప్పుడు లాక్ చేయడం - ఈ రెండు చర్యలూ సభ్యులకే అన్యాయం చేస్తున్నాయి.
ఇలాంటి ఉదాహరణలు ప్రతి జిల్లాలో, ప్రతి పీఏసీఎస్ లోనూ వున్నాయి. రైతు సభ్యుడు తన సంఘం లెక్కలు అర్థం చేసుకోలేని పరిస్థితి కొనసాగితే సహకార వ్యవస్థపై నమ్మకం క్రమంగా సడలిపోతుంది. ఆడిట్ లో నిజమైన పారదర్శకత, కంప్యూటరీకరణతో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కాకుండా సభ్యులకే లాభం - అనే మార్పు రాకపోతే, సహకారోద్యమ భవిష్యత్తు మసకబారిపోతుంది.