15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీలు–1,96,619 ఉద్యోగాలు
x

15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీలు–1,96,619 ఉద్యోగాలు

టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.


15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీని నిర్వహించి 1,96,619 ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి సచివాలయం çసమీపంలో గురువారం మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం అయ్యాక మెగా డీఎస్సీ ఫైలు మీదే తొలి సంతకం పెట్టానని, అవినీతి లేకుండా, పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియను నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టామన్నారు. బాబు ష్యూర్టీ... జాబు గ్యారెంటీ అని చెప్పాను... దాన్ని నిజం చేస్తున్నామన్నారు. రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం, 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుందని, నిరుద్యోగులు ప్రిపేర్‌ అవుతూ ఉండాలని సూచించారు. ఏపీలో ఓ చేతకాని పక్షం ఉంది. మంచి చేయరు.. మంచి జరుగుతుంటే ఓర్వలేరు. డీఎస్సీని అడ్డుకునేందుకు 106 కేసులు వేశారు. కానీ ఇబ్బందులను అధిగమించి డీఎస్సీ నిర్వహించిన లోకేష్‌ టీంను అభినందిస్తున్నాను అని సీఎం వెల్లడించారు. మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయింది. ప్రధాని సూపర్‌ జీఎస్టీ తెచ్చారు. ధరలు తగ్గించారని వెల్లడించారు. పోస్టింగుల కోసం పైరవీలు చేసే పరిస్థితి గతంలో ఉండేది కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ ప్రతిభ ఆధారంగానే పోస్టింగులు ఇచ్చామన్నారు.
విద్యా రంగంలో సంస్కరణలు తెస్తున్నాం. సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్నాభోజనం అందిస్తున్నామన్నారు. పేరెంట్‌ టీచర్లు మీటింగులు నిర్వహిస్తున్నాం. మన బడి–మన భవిష్యత్‌ పేరుతో మౌళిక సదుపాయాల కల్పన చేపడుతున్నాం. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... ప్రతి ఒక్కరికి రూ. 15 వేలు చొప్పున ఇచ్చాం. నారా లోకేష్‌ నో బ్యాగ్‌ డే విధానం తెచ్చారు. ఇది వినూత్నంగా ఉందన్నారు. ఈసారి స్కూళ్లు తెరిచేలోగానే స్కూల్‌ కిట్లు, పుస్తకాలు ఇచ్చాం. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.. సంక్షేమం సజావుగా సాగించవచ్చన్నారు.
విలువలతో కూడిన విద్యను అందించేలా టీచర్లంతా పని చేయాలి. పిల్లల్లో నైతిక విలువలను పెంచేలా టీచర్లు పాఠాలు చెప్పాలి. పిల్లల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత టీచర్లు తీసుకోవాలి. భవిష్యత్తులో విద్యా రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయోననేది టీచర్లు ఊహించగలగాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా టీచర్లు అప్డేట్‌ అవుతూ ఉండాలన్నారు. నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటాను. ప్రజలకు ఉపయోగపడతాయనుకుంటే వాటిని అమలు చేస్తానని సీఎం వెల్లడించారు.
2019–24 మధ్య కాలం విద్యా వ్యవస్థకు ఓ శాపం. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లిపోయారు. ఏపీ విద్యా రంగాన్ని 19వ స్థానానికి దిగజార్చారు. ఇంగ్లిష్‌ మీడియం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నో అడ్మిషన్లు బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తెచ్చారు. ఇది మరింతగా పెరగాలన్నారు. విద్యా శాఖ కఠినంగా ఉంటుందని చెప్పాను. అయినా లోకేష్‌ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత చదువులు అద్భుతంగా ఉంటాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read More
Next Story