
ఈ నెలలోనే డీఎస్సీ ఉద్యోగాలు
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
నెలలోపు డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడారు. ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వటం వల్ల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పెన్షన్లు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ‘సాధారణ కుటుంబంలో పుట్టి, దేవుని కృప వల్ల అంచెలంచెలుగా అభివృద్ధి చెందాం. డాక్టర్ అంబేద్కర్ సాధారణ కుటుంబం నుంచి జన్మించి తరతరాలు గుర్తుండే రాజ్యాంగాన్ని రచించారు. లక్ష బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాలి’ అని అన్నారు.
పోలవరాన్ని వైసీపీ భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని 2027కి పూర్తి చేసే అదృష్టం దేవుడు తనకే ఇచ్చారన్నారు. డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. గోదావరి పుష్కరాలు మూడో సారి తానే చేయబోతున్నానని, కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పేదలను ఆదుకునేలా 'పేదల సేవలో' కార్యక్రమం చేపట్టామని.. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

వైఎస్సార్సీపీలో జరిగిన విధ్వంసాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. నూటికి 13 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని సీఎం అన్నారు. తన తల్లి పడిన కష్టం ఏ మహిళకు ఉండకూడదని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తున్నామని సీఎం అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
పింఛన్లు ఇచ్చేటప్పుడు ఉద్యోగులు సేవా భావంతో ఉండాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో పేదవారిని చులకనగా చూస్తే సహించనని హెచ్చరించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కష్టపడుతున్నానని తెలిపారు. మానవత్వంతో దివ్యాంగుల కోసం 12 రెట్లు పింఛన్లు పెంచామన్నారు. రాజకీయ ముసుగు వేసుకొని ప్రజాధనాన్ని దోచుకుంటే సహించనని వార్నింగ్ ఇచ్చారు. ఎన్డీయే కార్యకర్తలు దగ్గర ఉండి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ పరిశీలించాలని ఆదేశించారు.