వరదలో కలిసి పోయిన కలలు
x

వరదలో కలిసి పోయిన కలలు

నెల్లూరులో 18 ఏళ్ల మెహ్రాజ్ మస్తాన్ మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసింది.


చదువులో తెలివైనవాడు. స్నేహితుల పట్ల ప్రేమగలవాడు. నలుగురితో ఈజీగా కలిసిపోయేవాడు. ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతోనే మాట మొదలుపెట్టేవాడు. కలుపుగోలు మనిషి. నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట చిన్న వీధులలో తన చలాకీతనంతో అందరికీ తెలిసిన పిల్లవాడు. అలాంటి 18 ఏళ్ల మెహ్రాజ్ మస్తాన్ నీటి ప్రవాహంలో కలిసి పోయాడు. గురువారం మధ్యాహ్నం… ఆ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. కుటుంబానికి, స్నేహితులకు, స్థానికులకు తీరని శోకం మిగిల్చాడు.

అమ్మా… వరద నీళ్లు చాలా బాగున్నాయి. దానిని చూడటానికి ఎంతో మంది వెళ్లి వస్తున్నారు. నేను కూడా చూసి వస్తాను అని చెప్పాడు. కొడుకు మాట కాదనలేక, వద్దంటే ఎక్కడ బాధపడుతాడేమో అని జాగ్రత్తగా రా నాయనా… అని చెప్పింది తల్లి. దానికి మెహ్రాజ్ నవ్వుతూ అమ్మా… అలా ఏం జరగదు అని చెప్పి వెళ్లిపోయాడు. అదే..తల్లి కొడుకుతో మాట్లాడిన చివరి మాట అయ్యింది. నెల్లూరును ఆనుకుని ఉన్న పొట్టేపాళెం వైపు వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిసి, స్నేహితులతో కలిసి ఒకసారి చూసి వస్తానని అలా ఇంటిని వదిలి బయలుదేరిన మెహ్రాజ్. ఇక తిరిగి రాలేదు.

అలా స్నేహితులతో కలిసి వరద నీటి ప్రవాహాన్ని చూస్తూ నీటిలోకి దిగి సరదాగా గడుపుతూ ఉండగా ఒక్క క్షణంలో విషాదం చోటుచేసుకుంది. ఆ నీటి ప్రవాహం తనతో పాటుగా అతనిని కూడా లాక్కెళ్లి పోయింది. అతని స్నేహితులు చెబుతున్న మాటల్లో ఇంకా భయం కనిపిస్తూనే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయ్.. అంత వరకు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం..ఒక్కసారిగా కాలుజారి పడిపోయాడు… మా కళ్ల ముందు నీరు తీసుకుపోయింది…అని కన్నీరుమున్నీరవుతున్నారు. కాలుజారి పడిపోయిన మెహ్రాజ్ తనను కాపాడాలని కేకలు వేశాడు. చేతులు చాచి సహాయం కోరుతున్న మెహ్రాజ్ ను చూసి అతనిని కాపాడుకునేందుకు ఆరాటంతో పరుగెత్తిన స్నేహితులు పరుగెత్తారు. పక్కన వాళ్ల సహాయం తీసుకున్నారు. పోలీసులు కూడా ప్రయత్నించారు. అయితే ఉధృతంగా ఉన్న ఆ నీటి ప్రవాహం ఒక్క క్షణంలోనే అతన్ని దూరంగా తీసుకెళ్లి పోయింది. దానిని తలచుకుని మెహ్రాజ్ స్నేహితులు తల్లడిల్లిపోతున్నారు. మరో వైపు మెహ్రాజ్ తండ్రి చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. మా బిడ్డకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. నీటి దగ్గరికి వెళ్లొద్దని ఎన్నోసార్లు చెప్పాం. కానీ స్నేహితులతో వెళ్లిపోయాడు. ఆ నీళ్లు మా కొడుకును మాకు దూరం చేశాయి.. చివరికి మాకు దక్కుండా పోయాడు అని అతని కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు స్థానికులనుసైతం కంటతడి తెప్పించింది. మెహ్రాజ్ మరణంతో ఆ ఇంట్లో ఇప్పుడు శోకంతో నిండిపోయింది. మెహ్రాజ్ నవ్వులతో కళకళలాడిన ఆ గదులు… ఇప్పుడు బాధతో నిండిపోయాయి.

నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయిన మెహ్రాజ్ కోసం తీవ్ర గాలింపులు చేపట్టారు. అయితే కొంత దూరంలో ఉన్న తూము వద్ద పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు. అతని మరణాన్ని స్నేహితులు, తల్లిదండ్రులు, స్థానికులు అందరూ నమ్మలేకపోయారు. నీటి ప్రవాహాన్ని చూసి వస్తానని చెప్పిన మెహ్రాజ్ ఇలా నీటితో కలిసి పోతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ వరద నీటి ప్రవాహం కేవలం మెహ్రాజ్ ని మాత్రమే లాక్కెళ్లి పోలేదు, ఒక కుటుంబం కొట్టుకుని పోయేలా చేసింది. మెహ్రాజ్ ఎన్నో కలలు కన్నాడు. ఇంజినీరింగ్ చదవాలనుకున్నాడు. కుటుంబానికి తోడుగా, అండగా నిలవాలను కున్నాడు. కానీ అతని జీవితం వరద నీటి ప్రవాహంలా ఒక్కసారిగా మారిపోయింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలిగొంది. అది ఆ కుటుంబానికి భవిష్యత్ ఆదరణను కోల్పోయేలా చేసింది. ఇది కేవలం ఒక ప్రమాదమే కాదు. అకస్మాత్తు జరిగిన ప్రమాదం ఎంత పెద్ద నష్టాన్ని మిగుల్చుతుందో చెప్పే సజీవ ఉదాహరణ. "ప్రవాహం అందంగా కనిపించొచ్చు… కానీ అది ఎంత ప్రమాదకరమో మరచిపోకండి."

Read More
Next Story