జగన్ నర్సీపట్నం టూరులో డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, టెన్షన్ టెన్షన్
x

జగన్ నర్సీపట్నం టూరులో డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, టెన్షన్ టెన్షన్

కరోనా సమయంలో జగన్ ప్రభుత్వ తీరును విమర్శించి సస్పెండ్ అయి ఆ తర్వాత చనిపోయిన డాక్టర్ సుధాకర్


రాజకీయాలకు కాదేదీ అనర్హం అనే దానికి ఇదే నిదర్శనం. మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్ లో నిర్మించవద్దంటూ వైసీపీ తలపెట్టిన పోరును ఎద్దేవా చేస్తూ టీడీపీ వినూత్న ప్రచారానికి పూనుకుంది.


విజయవాడ నుంచి హెలికాఫ్టర్ లో విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం బయలుదేరారు. అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదులుతుండగా టీడీపీ అభిమానులు అక్కడక్కడా- వైసీపీ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ ఫోటోలను ఏర్పాటు చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.

నర్సీపట్నం పట్టణానికి చెందిన డాక్టర్ కె.సుధాకర్ కరోనా సమయంలో ఆనాటి ప్రభుత్వ తీరును విమర్శించి సస్పెండ్ అయ్యారు. కరోనా సంక్షోభ సమయంలో సుధాకర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన బహిరంగంగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యంగా డాక్టర్లకు మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదనే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ను విమర్శించారు. దీంతో ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆయనను సస్పెండ్ చేశారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైన దాడి చేశారు. కేజీహెచ్ వైద్యులు ఆయనకు పిచ్చిపట్టిందని, మానసిక ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆ డాక్టర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని, అదే గుండెపోటుకు కారణమై మరణించారు.

ఇప్పుడు జగన్ పర్యటనలో ఆనాటి ఘటనను గుర్తు చేస్తూ డాక్టర్ సుధాకర్ పేరిట పెద్దపెద్ద బోర్డులు వెలిశాయి. మాజీ సీఎం జగన్‌ పర్యటన దారి పొడవునా ఈ ఫెక్లీలను టీడీపీ అభిమానులుగా భావిస్తున్న వారు ఏర్పాటు చేశారు. ‘‘మాస్క్‌ ఇవ్వలేక హత్యలు చేసినవాళ్లు మెడికల్‌ కాలేజీల గురించి మాట్లాడటమా? ప్రజలూ.. తస్మాత్‌ జాగ్రత్త’’ అని ఫ్లెక్సీలపై ఉంది.

నియోజకవర్గంలోని మాకవరపాలెం వద్ద ఉన్న మెడికల్‌ కళాశాలను పరిశీలించేందుకు జగన్‌ వస్తున్న నేపథ్యంలో దళిత సంఘాల నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నా వారందరూ టీడీపీ అభిమానులేనని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్‌ పీపీఈ కిట్‌ అడిగినందుకు ఆయన్ను మానసికంగా వేధించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. సుధాకర్‌ మృతికి గత ప్రభుత్వమే కారణమంటున్నాయి.

Read More
Next Story