కట్నం కాటేసింది
x

కట్నం కాటేసింది

పెళ్లై ఏడాది తిరగకముందే వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.


విశాఖపట్నం నగరం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణనగర్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. పెళ్లై సరిగ్గా ఏడాది కూడా తిరగకముందే వరకట్న వేధలు తట్టుకోలేక 25 ఏళ్ల వివాహిత బి. విజయశ్యామల ఆత్మహత్య చేసుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన శ్యామల మరణంతో ఆమె కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పోలీసులు భర్తను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చోడవరం మండలం గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్‌తో గతేడాది డిసెంబర్ 6న అచ్యుతాపురానికి చెందిన బి. విజయశ్యామలకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.5 లక్షలు నగదు, 8 తోలల బంగారం, ఒక ఎకరం భూమి వంటి భారీ కట్నకానుకలు ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉద్యోగ రీత్యా గత కొన్ని నెలలుగా జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో వారు నివసిస్తున్నారు. దిలీప్ గత కొన్ని నెలలుగా అదనపు కట్నం కోరుతూ ఆమెను వేధిస్తున్నాడని, ఈ వేధింపులకు ఆమె తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి దారితీశాయని పోలీసులు తెలిపారు.

భర్త లేని సమయాన్ని చూసి ఆదివారం అర్ధరాత్రి శ్యామల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన తెలిసింది. పశ్చిమ ఏసీపీ పృధ్వీతేజ్, స్థానిక సీఐ లెంక సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పక్కన ఆమె రాసిన ఆత్మహత్య లేఖతో పాటు చిన్నారి చిత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతురాలి ముఖంపై గాయాలు ఉన్నాయని, తన కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి భర్త దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ‘ఎంత పనిచేశావ్ శ్యామలా..’ అంటూ తల్లి రోజారమణి, కుటుంబీకులు రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story