అక్కను హింసించారని బావను, అత్తను చంపేశాడు
x
హత్యకు గురైన సాంబశివరావు(పైల్ ఫొటో)

అక్కను హింసించారని బావను, అత్తను చంపేశాడు

పల్నాడు ధూళిపాళ్లలో దారుణ డబుల్ మర్డర్ జరిగింది. తల్లి-కొడుకును హత్య చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో పట్టపగలు దారుణంగా డబుల్ హత్య జరిగింది. దొప్పలపూడి సాంబశివరావు (30), ఆయన తల్లి కృష్ణకుమారి (55)లను ముగ్గురు యువకులు కత్తులతో పొడిచి, తలపై నరికి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో సాంబశివరావు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన కృష్ణకుమారి కూడా మృతి చెందారు. తండ్రి దొప్పలపూడి వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు, గ్రామస్తులు కలిసి నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో పట్టుకున్నారు.

నిందితులు:

  1. చెరుకూరి రోహిత్ చౌదరి (19) – సాంబశివరావు మాజీ భార్య సాహితి సోదరుడు (బావమరిది)
  2. సాతులూరి రవికుమార్ (18) – చిలకలూరిపేట ప్రాంతం(రోహిత్ చౌదరి స్నేహితుడు)
  3. షేక్ జావీద్ అస్లాం (18) – చిలకలూరిపేట ప్రాంతం (రోహిత్ చౌదరి స్నేహితుడు)

ముగ్గురూ ఇంటర్/పాలిటెక్నిక్ విద్యార్థులే. వీరిపై IPC సెక్షన్ 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్యకు కారణం:

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల గ్రామానికి చెందిన దొప్పలపూడి వీరయ్య, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు సాంబశివరావు, కుమార్తె మౌనిక. అయితే కుమార్తె మౌనికను ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక కుమారుడు సాంబశివరావు తాడికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడి­గా పనిచేస్తున్నాడు. సాంబశివరావుకు నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూ­రి రఘుబాబు కుమార్తె సాహితితో 2022లో వివాహం జరిపించారు. కొద్ది రోజులు వీరి సంసారం సజావుగా సాగినా తర్వాత సాంబశివరావు, సాహితి దంపతుల మధ్య మన­స్పర్థలు వచ్చాయి. ఇవి పెరిగి పెద్దయ్యాయి. గృహ హింస, మానసిక వేధింపులు జరిగాయని, భర్త-అత్త-మామలు కలిసి ఇబ్బంది పెట్టారని సాహితి ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి, ఆరు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. దీంతో ఇద్ధరు విడిపోయారు.

అయితే తన అక్క సాహితిని హింసించారని విషయం తెలిసి సాహితి తమ్ముడు రోహిత్ చౌదరి (19) రగిలి పోయాడు. బావ సాంబశివరావు, అత్త కృష్ణకుమారి, మామ వీరయ్యలపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. తన అక్కను హింసించిన వాళ్లు బతకకూడదు అని నిర్ణయించుకుని, తన స్నేహితులిద్దరిని రెచ్చగొట్టి హత్యలకు పథకం రచించాడు. ఆదివారం సాంబశివరావు ఇంటికి వచ్చిన సమాచారం తెలుసుకుని ముగ్గురూ బైక్‌పై వచ్చి ఇంట్లోకి దూసుకొచ్చి నిద్రిస్తున్న సాంబశివరావుపై, అడ్డుకున్న తల్లిపై కత్తులతో దాడి చేశారు. ఘటన తర్వాత బైక్‌పై పరారయ్యే ప్రయత్నంలో చాగల్లు గ్రామస్తులు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం. హైమారావు, ఎస్సై షేక్ అమీరుద్దీన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read More
Next Story