తెరపైకి డోర్‌ డెలివరీ కేసు..న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం
x

తెరపైకి డోర్‌ డెలివరీ కేసు..న్యాయవాదిని నియమించిన ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య జరిగింది. డోర్‌ డెలివరీ కేసుగా ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డోర్‌ డెలివరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహించిన విధంగానే డోర్‌ డెలివరీ కేసు తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ సహాయం చేసేందుకు ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. ముప్పాళ్ల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ కేసు మీద ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ కేసులో తొలి నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో ముప్పాళ్ల సుబ్బారావును ఈ కేసులో ప్రత్యేక న్యాయవాదిగా కూటమి ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

మే 2022లో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఇతను వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌(అనంతబాబు) వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. హత్యకు ముందు రోజు రాత్రి పని ఉందంటూ ఇంట్లో ఉన్న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి తీసుకెళ్లాడు. తర్వాత డ్రైవర్‌ సుబ్రహ్మణం్య శవమై తేలాడు.
తన కారు బ్యాక్‌ సీటులో పడి ఉన్న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా తీసుకొచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. డోర్‌ డెలివరీ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. 2022 మే 18న ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి తమ కుమారుడు సుబ్రహ్మణ్యంను బయటకు తీసుకెళ్లాడని, తర్వాత అనంతబాబే తమ కుమారుడ్ని చంపేసి ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని తీసుకునేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు అంగీకరించకపోవడంతో వారిపైన అనంతబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసి అక్కడ నుంచి కారులో వెళ్లిపోయారు.
ఈ సంఘటనతో నాటి వైసీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పని పరిస్థితుల్లో స్పిందించిన వైసీపీ ప్రభుత్వం అనంతబాబు మీద హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. తర్వాత అనంతబాబు రిమాండ్‌ పడటం, బెయిల్‌ మీద బయటకు రావడం జరిగి పోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. దీనికి తోడు ఈ కేసులో తొలి నుంచి న్యాయం కోసం పోరాటం సాగిస్తున్న ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు సీఎం చంద్రబాబును కలిశారు. డోర్‌ డెలివరీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో డోర్‌ డెలివరీ కేసును కొలిక్కి తెచ్చేందుకు ముప్పాళ్ల సుబ్బారావును కూటమి ప్రభుత్వం ఈ కేసులో ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది.
Read More
Next Story