చంద్రబాబు, పవన్‌లు ఉప్పూ కారం తినడం లేదా?
x
మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

చంద్రబాబు, పవన్‌లు ఉప్పూ కారం తినడం లేదా?

కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు పౌరుషం రావడం లేదా? అని బొత్స ఘాటుగా ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తుంటే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపారు. బొత్స ఇంకా ఏమన్నారంటే?

‘విశాఖ ఉక్కు ఒక్క విశాపట్నానికే పరిమితం కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది. 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చింది. ప్రైవేటీకరణలో భాగంగా ఈ స్టీల్‌ ప్లాంటులోని 32 విభాగాలను ఈనెల 9నే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి టెండర్లు పిలిచారు. గత నెల 30న కూటమి సీఎం, ఉప ముఖ్యమంత్రి విశాఖలోనే ఉన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కరూ మాట్లాడలేదు. వీరికి బాధ్యత లేదా? ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారు. పవన్‌ అయితే ఊగిపోయారు. ఈరోజు ఏమైంది పౌరుషం? మీ 21 మంది ఎంపీల పౌరషం? మీ ఎంపీలు, మీరూ ఉప్పూ కారం తినడం లేదా? మానేశారా? మీ విధానం ఏమిటి? సీఎం కూడా సమాధానం చెప్పాలి. మీ కార్యాచరణ ఏమిటో చెప్పాలి. ఢిల్లీకి 18 సార్లు వెళ్లారే? ప్రధానితో ఏ మాట్లాడారు, ఆయనేం చెప్పారో చెప్పాలి. కనుచూపు మేరలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. వైసీపీ పాలనలో ప్రధాని విశాఖ వచ్చినప్పుడు వేదికపై నుంచే ప్రైవేటీకరణ వద్దని జగన్‌ చెప్పారు. అలా చంద్రబాబు ఒక్కరోజైనా మాట్లాడారా?
అసెంబ్లీలో తీర్మానం చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతారు. స్టీల్‌ ప్లాంటుకు రివైవల్‌ ప్యాకేజీ కింద ఇచ్చిన రూ.11.440 కోట్లు దేనికి ఖర్చుపెట్టారు? ఉద్యోగ జీతభత్యాలు, రా మెటీరియల్‌కు ఖర్చుపెట్టలేదు. అప్పులు తీర్చడానికిచ్చారు. ప్రైవేటీకరణపై వెనక్కెల్లే ప్రశ్నేలేదని పార్లమెంట్‌లో చెప్పారు కదా? ఇంకెవరిని మోసం చేస్తారు? ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు ప్రజలను చైతన్యవంతం చేస్తాం. వారి సూచనలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
అగమ్యగోచరంగా రైతాంగం..
రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పంట వేస్తే ఎరువులు దొరకడం లేదు. గిట్టుబాట ధర లేదు. పట్టించుకునే నాథుడే లేడు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. యూరియా కొరతతో రైతులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవలసిన పరిస్థితి ఉంది. అదేమిటో గాని చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తొలుత ఇబ్బంది పడేది నష్టపోయేది రైతే. వ్యవసాయం శుద్ధ దండగ, ఈ వ్యవస్థకు లాభం లేదన్న ఆలోచన ఆయన బుర్రలో ఉంది. మనసులో అనుకుంటాడు. భగవంతుడు తథాస్తు అంటాడు. రాష్ట్రంలో సాగు అవసరాలకు ఏం చేయాలో ముందు చూపుండాలి. చంద్రబాబును మారు వేషంలో వెళ్లమనండి.. ఎరువుల కొరత ఉందో లేదో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వమే కేంద్రంలోనూ ఉంది. మిగతా రాష్ట్రాలకు ఎరువుల కొరత ఎందుకు లేదు? ఇక్కడెందుకు∙ఉంది? గత ఐదేళ్లలో ఏ పంటకైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందా? కూటమి ప్రభుత్వంలో రైతుల ఇబ్బందులపై వైసీపీ చాలా ప్రాంతాల్లో రైతులతో కలిసి ఒత్తిళ్లు చేస్తున్నాం.
ఈనెల 9న అన్నీ ఆర్డీవో కారాయలయాల్లో ఎరువుల కొరతపై నిరసన వ్యక్తం చేయలని నిర్ణయించాÆ . కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఉదయం లేచినప్పట్నుంచి దోపిడీ.. ఏదైనా నిలదీస్తే చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలోకంటే ఈ 15 నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలే ఎక్కువ. సుగాలి ప్రీతి టీడీపీ పాలనలో చనిపోయింది. మా ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబానికి పరిహారం ఇచ్చాం. కానీ పవన్‌ మేమే ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు. ఎన్నికలయ్యాయి కాబట్టి సుగాలి ప్రీతి కుటుంబాన్ని గాలికొదిలేశారు.
రుషికొండలో అక్రమాలుంటే చర్యలు తీసుకోండి..
విశాఖ రుషికొండపై నిర్మించినది ప్రభుత్వ భవనం. అందులో అవకతవకలు జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోమన్నాం. లోపాలుంటే రూ.130 కోట్ల బాకీని ఎవరితో లాలూచీ పడి చెల్లించారు? సొల్లు మాటలు చెప్పడం కాదు.. చర్యలు తీసుకోండి. పోర్టు నుంచి రెండు రూపాయల కిలో బియ్యం ఆగిందా? అడ్డస్టు అయిపోయింది.’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read More
Next Story