
పోసానిని అరెస్టు చేయొద్దు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ నటుడు పోసానికి ఊరట లభించింది.
ప్రముఖ సినీ నటుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాస్త ఊరట కలిగించింది. పోసానిని అరెస్టు చేయొద్దంటూ విజయవాడ సూర్యారావుపేట పోలీసులకు ఆదేశాలు జారీసింది. పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. దాదాపు 18కిపైగా పోసాని మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోసానిని అరెస్టు చేసేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. పీటీ వారెంట్‌ల మీద అరెస్టులు చేస్తూ ఆయా ప్రాంతాల పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తూ, స్థానిక కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. ఆ కోర్టులు పోసానికి రిమాండ్ విధిస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు పోసాని మీద రాజంపేట, గుంటూరు జైళ్లకు అలానే తరలించారు.
పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్న తరుణంలో విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపైన పోసాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖపట్నం, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలో నమోదైన కేసుల్లో పోసాని మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పోసానికి కాస్త ఉపశమనం దొరికినటై్టంది. సోమవారం దీనిపై ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Next Story