ప్రతిపక్షంలోనే ఎల్లప్పుడూ ఉండం..మీరెప్పుడూ ఉద్యోగాల్లోనే ఉండరు
మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇది వరకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికారులు, ఉద్యోగులను హెచ్చరిస్తూ చేశారు. మరి ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులంతా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలు చేశారు. పసుపు చొక్కాలు వేసుకొని ఉద్యోగాలు చేయొద్దని అధికారులను హెచ్చరించారు. తాము ఎల్లపుడూ ప్రతిపక్షంలోనే ఉండమని, అధికారులు కూడా ఎప్పుడూ ఉద్యోగాల్లోనే ఉండరని, పదవీ విరమణ పొందే పరస్థితులు వస్తాయని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తునిలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులపై తీవ్ర స్వరంతోనే వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని టార్గెట్‌గా చేసుకొని అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ యాక్టివిస్టులు ఒక శాతం అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు 99 శాతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపైన కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తమ శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులైన పెట్టుకోండని, ఆ కేసులకు తాము భయపడేది లేదని, ఎలాంటి అక్రమ కేసులనైనా ఎదుర్కొంటామని, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.