Mandava Venkateswar Rao|ఈ మాజీమంత్రి అలిగినా రేవంత్ పట్టించుకోరా ?
x

Mandava Venkateswar Rao|ఈ మాజీమంత్రి అలిగినా రేవంత్ పట్టించుకోరా ?

నానా బూతులు తిట్టడం, ఎదుటివారిని కవ్వించి నాలుగు తిట్లు తిట్టి తాను పది తిట్లు తినే తట్టుకోలిగిన సామర్ధ్యం ఉన్న నేతలు గొప్ప నేతలుగా రాణిస్తున్న రాజకీయాలివి.


ఇప్పటి రాజకీయాలంతా జెట్ స్పీడుతో పరుగెడుతున్నాయి. సౌమ్యులు, సబ్జెక్టు నాలెడ్జీ మాత్రమే ఉండటం, తన పనేదో తాను చేసుకుపోయేరకాలు అంటే ఇప్పటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోరేమో. అవసరమున్నా లేకపోయినా ప్రత్యర్ధులపైన నోరుపారేసుకోవటం, నానా బూతులు తిట్టడం, ఎదుటివారిని కవ్వించి నాలుగు తిట్లు తిట్టి తాను పది తిట్లు తినే తట్టుకోలిగిన సామర్ధ్యం ఉన్న నేతలు గొప్ప నేతలుగా రాణిస్తున్న రాజకీయాలివి. అందరు ఇలాగే ఉంటారని అనేందుకు లేదు కాని మెజారిటి నేతల వైఖరి మాత్రం ఇలాగే ఉంటోంది. 24 గంటలూ మీడియా, సోషల్ మీడియాలో ప్రత్యర్ధులను ఆడిపోసుకుంటూ తిట్లు తింటు, తిట్టే వాళ్ళనే జనాలు కూడా గుర్తుంచుకుంటారేమో అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్ధితి.

ఇపుడు ఇదంతా ఎందుకంటే మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు(Mandava Venkateswar Rao) గురించే. మండవ ఇపుడు ఏపార్టీలో ఉన్నారని అడిగితే చెప్పటం కష్టమే. కాని ఈ మాజీమంత్రి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోనే ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఒకపుడు ఒక వెలుగు వెలిగిన మండవ ఇపుడు ఎవరికీ పట్టకుండా పోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లోని డిచ్ పల్లి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఒకసారి అంటే ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. విద్యాశాఖ, భారీ నీటిపారుదల, ఎక్సైజ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. సౌమ్యుడిగా, తనపనేదో తాను చేసుకుపోయే వ్యక్తిగా మండవకు మంచిపేరుంది. సబ్జెక్టు నాలెడ్జితో పాటు వివిధ శాఖల మీద మంచి పట్టుకూడా ఉంది. 1985లో ఎన్టీఆర్(NTR TDP) నాయకత్వంలో టీడీపీలో చేరిన మండవ తర్వాత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మంత్రివర్గంలో కూడా మంచి ప్రాధాన్యతనే దక్కించుకున్నారు. బహిరంగసభలు, అసెంబ్లీ, మీడియా సమావేశాల్లో కూడా ప్రత్యర్ధులను పరుషంగా మండవ ఒక్కమాట కూడా అన్నదిలేదు. ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా చాలా మర్యాదగా, హుందాగా మాట్లాడుతారు.

చంద్రబాబుతో ఎంత సన్నిహితం ఉన్నప్పటికీ జిల్లాలో పెత్తనమైతే చేయలేదు. తన నియోజకవర్గం, తాను నిర్వహిస్తున్న శాఖను మాత్రమే చూసుకునే వారు. రాష్ట్రవిభజన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణాలో టీడీపీ నేలమట్టమైపోయిన తర్వాత 2019, ఏప్రిల్ 5వ తేదీన బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్(KCR) స్వయంగా నిజామాబాద్ లోని ఇంటికి వెళ్ళి మండవను పార్టీలో చేర్చుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు టీడీపీలో కేసీఆర్, మండవ ఇద్దరూ బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆ కారణంగానే మండవ ఇంటికి కేసీఆర్ వెళ్ళి పార్టీలో చేర్చుకున్నది. విచిత్రం ఏమిటంటే పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ మండవను పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళి మరీ పార్టీలోకి మండవను ఎందుకు చేర్చుకున్నారు ? చేర్చుకున్న తర్వాత ఎందుకు పట్టించుకోలేదు ? ఎందుకు దూరంగా ఉంచేశారో కేసీఆరే చెప్పాలి.

బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎదురైన అవమానాలను మండవ ఓపికిగా భరించారు. కేసీఆర్ తనను పట్టించుకోవటంలేదన్న విషయాన్ని మండవ ఎక్కడా నోరువిప్పి చెప్పుకోలేదు. 2023 ఎన్నికలకు ముందు రేవంత్(Revanth) స్వయంగా మండవతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించారు. మండవకు రేవంత్ ఏమి హామీ ఇచ్చారో తెలీదు. 2023, నవంబర్ 25వ తేదీన రాహూల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో మండవ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మండవకు రేవంత్ కూడా బాగా సన్నిహితుడు. నిజానికి టీడీపీ హయాంలో మండవ ఒక వెలుగు వెలుగుతున్నపుడు రేవంత్ పార్టీలో ద్వితీయశ్రేణి నేత మాత్రమే. అయినా ఇద్దరి మధ్య బాగా సన్నిహితముంది. మండవ పార్టీలో చేరటం, తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం, రేవంత్ ముఖ్యమంత్రి అవటంతో మండవకు మంచిరోజులు వచ్చాయనే అందరు అనుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి ఇప్పటివరకు మండవను పట్టించుకోలేదు. మండవకు అత్యంత సన్నిహితంగా ఉండే తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar Rao) ఇపుడు రేవంత్ మంత్రవర్గంలో బాగా కీలకంగా ఉన్నారు. తెరవెనుక ఏమి జరుగుతోందో తెలీదు కాని రేవంత్ మాత్రం మండవను పట్టించుకున్నట్లు లేదు. అందుకనే ఇక లాభంలేదని అర్ధమైపోయి మండవ రాజకీయాలకే నమస్కారం పెట్టేసే ఉద్దేశ్యంలో ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story