పోలీసు శాఖ మీద మోజు పడుతున్న పవన్ కల్యాణ్
x

పోలీసు శాఖ మీద మోజు పడుతున్న పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు తూటాలుగా పేల్చారు. హోం మంత్రిపైన, పోలీస్ శాఖపైన నేరుగా విమర్శలు చేశారు. ఇంతకూ ఆయన మనసులో ఏముంది?


పోలీసులు ప్రభుత్వం మాటలు వినటం లేదు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారట. తాను అనుకుంటే ఎప్పుడైనా హోంశాఖ మంత్రిని అవుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అలజడి సృష్టించింది. ఏ ప్రభుత్వమైనా వారి శాఖల్లో ఎలా పనితీరు ఉంది. ఎలా ఉద్యోగుల ద్వారా పనిచేయించుకోవాలనేది మంత్రులు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ మాటలు హోం మంత్రి అనితకు పనిచేయించడం చేతకావడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దుర్మార్గాలు చేసిన వారిని చూస్తూ ఊరుకోమంటారా? అటువంటి ఏమి చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే తాను అనుకుంటే యోగి ఆదిత్యనాథ్ లా మారి వేరివేస్తానని చెప్పడం పలువురిని ఆశ్చర్య పరిచింది. తాను అనుకుంటే ఇప్పటికిప్పుడే హోం మంత్రిని కాగలనని చెప్పడం వెనుక మనసులోని మాటను బయట పెట్టాడా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

పవన్ కళ్యాణ్ మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబును సందిగ్ధంలో పడేలా చేశాయి. చేతకాని అనితను హోంశాఖ మంత్రిగా పెట్టుకున్నారని తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ మాటలు ఏ ధైర్యంతో పవన్ కళ్యాణ్ అన్నారనే చర్చ కూడా మొదలైంది. ఆయన మద్దతు ఉప సంహరించుకున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఎందుకు ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికే ఎసరు పెట్టేలా మాట్లాడిన మాటల వెనుక ఎవరున్నారు. తానే స్వయంగా ఇన్ని మాటలు మాట్లాడగలడా? కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో మంత్రిని చేతకాని మంత్రిగా చిత్రీకరించడం వెనుక ఏదైనా వేరే కోణం ఉందా? అనే చర్చకూడా మొదలైంది.

పైగా యోగి ఆదిత్యనాథ్ లా మారగలనని అనటం కూడా చర్చకు దారి తీసింది. ఆయన ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. రౌడీలపై ఉక్కుపాదం మోపారు. ఆయనలా కావాలంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి. అది సాధ్యమేనా? పవన్ కళ్యాణ్ మాటలు ప్రభుత్వం చేతకాని తనాన్ని, అసమర్థతను చెప్పే విధంగా ఉందే తప్ప జరుగుతున్న తప్పులను నిరోధించే విధానం ఏలా అనేది మాత్రం కనిపించలేదు. పైగా హోం మంత్రి స్థానాన్ని నేను కావాలంటే ఇప్పటికిప్పుడు తీసుకోగలనని చెప్పడం ఏమిటనే చర్చ కూడా మొదలైంది.

ఈ విధమైన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థతను బయట పెడతాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు గత ప్రభుత్వ వాసనలు పోగొట్టుకోలేదని, తప్పులు చేస్తున్న వాళ్లంతా వైఎస్సార్సీపీ వారేనని, ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులుకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఒక ఎస్సీ తనను ఎన్నికలకు ముందు కొట్టేంత పనిచేశారంటే పోలీసుల్లో అహంకారం కూడా ఎక్కువగానే ఉందనే భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు, పనులు రాష్ట్రంలో చర్చకు దారి తీస్తున్నాయి. సోమవారం చేసిన ప్రసంగం తీవ్ర దుమారాన్ని తీసుకొస్తోంది. హోం శాఖ మంత్రికి సవాల్ విసరటం వెనుక నిజంగా హోం శాఖను కూడా తాను తీసుకోవాలని భావిస్తున్నట్లున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

తన ప్రసంగంలో శాంతి భద్రతలు బాగోలేవనే విషయాన్ని స్పష్టం చేశారు. నేను హోం మంత్రిగా ఉంటే ఇటువంటి వన్నీ జరిగేవి కాదన్నారు. అంటే ప్రస్తుతం హోం శాఖ మంత్రిగా ఉన్న అనిత ఆ పోర్టుపోలియోకు పనికి రాదని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రధానంగా హోం శాఖపైనే ఉంది. పవన్ కళ్యాణ్ హోం శాఖను తీసుకునేందుకు వ్యూహాత్మక వ్యవహారంలో భాగంగానే మాట్లాడాడని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఒక వైపు తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయంటూనే, మరో పక్క యోగీ ఆదిత్యనాథ్ లా వ్యవహరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో నేతల మధ్య స్పర్థలు పెంచే అవకాశాలు ఎగువగా ఉంటాయి.

Read More
Next Story