మైనార్టీలకు పవన్ భరోసా.. కూటమిలో చిచ్చు మొదలాయనా..!
x

మైనార్టీలకు పవన్ భరోసా.. కూటమిలో చిచ్చు మొదలాయనా..!

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ముస్లిం రిజర్వేషన్లు చీలికలు తెస్తుందా? అందుకే మేనిఫెస్టోపై బీజేపీ గుర్తు మిస్సయిందా..


ముస్లిం రిజర్వేషన్లు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో చీలికలు దారితీస్తుందా? అంటే ప్రస్తుతం పరిస్థితులు అవునన్నట్లే ఉన్నాయి. అదనంగా ప్రకటించిన ముస్లిం రిజర్వేషన్లను తొలగించి.. వాటిని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు అందిస్తామని ఒకవైపు బీజేపీ ప్రచారం చేస్తుంది. దీనిని ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు ఇచ్చే రిజర్వేషన్‌ను ఎందుకు ఆపుతారంటూ నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు ప్రకటించారు. దాంతోనే కూటమి పార్టీల మధ్య కాస్త దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ నోటి నుంచి కూడా అటువంటి వ్యాఖ్యల వినిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మైనారిటీలకు అండగా ఉంటా

మైనారిటీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో ఎంతగానో తోడ్పడుతుందని, వారికి తాను అండగా ఉంటానని జనసేనాని పవన్ కల్యాణ్.. విజయవాడలో నిర్వహించిన ప్రచార సభలో వెల్లడించారు. మైనారిటీలకు తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. జగన్‌ను నమ్మొద్దని.. ఇన్నాళ్లు ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారని ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఆయనను నమ్మాలని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

గతంలో చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్ దక్కేలా చూసుకునే బాధ్యత తనదని, తమను గెలిపిస్తే ప్రతి మైనారిటీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం పవన్ కల్యాణ్.. పోరాడతారని, అవసరం అయితే కూటమి నుంచి బయటకు వచ్చేయడానికి కూడా వెనకాడరంలూ జనసేన నేత నాదెండ్ల మనోహన్ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో కూటమి పార్టీ మధ్య విభేదాలు చెలరేగాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకనే మేనిఫెస్టోపై కూడా బీజేపీ గుర్తు లేదా? అన్న సందేహాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కూటమి అంటూనే ఉన్న మూడు పార్టీల్లోనే సఖ్యత లేదని, ఇది ఎలాంటి కూటమో అర్థకావట్లేదని వైసీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. దీనిపై కూటమి పార్టీలు వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని, లేకుండా పోలింగ్ సమయంలో ఇది వారికి మైనస్ పాయింట్ కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా స్పందించిన జగన్

తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ముస్లింలకు ఎట్టిపరిస్థితుల్లో రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేశారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఉండి తీరాలని తన వైఖరిని తేటతెల్లం చేశారు. అంతేకాకుండా తాము మరోసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఏం హామీలు నెరవేర్చారని ఇప్పడు రిజర్వేషన్లపై హామీలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్న వర్షం కురిపిస్తున్నాయి.

Read More
Next Story