చెల్లి చీర రంగుపై జగన్ కామెంట్లు.. మండిపడుతున్న నెటిజన్లు
x

చెల్లి చీర రంగుపై జగన్ కామెంట్లు.. మండిపడుతున్న నెటిజన్లు

సీఎం జగన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సొంత చెల్లి డ్రెస్‌పై కామెంట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


(శివరామ్)

సోదరి షర్మిలా పసుపు రంగు చీర ధరించడంపై చేసిన వ్యాఖ్యలతో సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలకు గురౌతున్నారు. జగన్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారని, అందుకో తోడబుట్టిన చెల్లి అన్న విషయాన్ని కూడా మరిచి దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదో చంద్రబాబుతో షర్మిలా కుమ్మక్కయ్యారనే అర్థం వచ్చేలా మాట్లాడదామనుకుంటే అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో వైసీపీ నేతలెవ్వరూ ఆ అంశాన్ని మరోమారు ఎక్కడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇంతకీ జగన్ ఏమన్నారు?

నామినేషన్ వేయనున్న సందర్భంగా పులివెందులలో నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ.. ‘‘పసుపు చీర కట్టుకొని.. వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లే మీరు వైఎస్సార్ వారసులా లేక మరి ఆ చంద్రబాబు వారసులా?’’ అని జగన్ ప్రశ్నించారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో అయితే చెల్లి చీర రంగు గురించి బహిరంగ సభలో అన్న మాట్లాడడాన్ని మించిన దిగజారుడుతనం ఏముంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గట్టిగా కౌంటర్ ఇచ్చిన షర్మల

తన సోదరుడు జగన్.. తన చీరపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. వేల మంది ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా.. ఎవరైనా? అని నిలదీశారు. సొంత చెల్లెలు అని చూడకుండా జగన్ తన ఇంగితాన్ని మరచి మాట్లాడుతున్నారని, జగన్‌కు అసలు సంస్కారమే లేదని దుయ్యబట్టారు. ‘‘అవును చేను పసుపు చీర కట్టుకున్నా... అయితే ఏంటీ? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ హక్కు ఉందా? జగన్ రెడ్డి మరచిపోయాడనుకుంటా.. సాక్షి ఛానల్ మొన్నటి వరకూ పసుపు రంగులోనే వుండేది. పసుపు అనేది మంగళకరమైన రంగు అని స్వయంగా నాడు వైఎస్సార్ చెప్పారు’’ అని గుర్తుచేశారు షర్మిల.

భారతి పసుపు డ్రెస్ ఫొటోలు వైరల్

ఈ సందర్భంగా జగన్ సతీమణి వైఎస్ భారతి.. పసుపు రంగు డ్రెస్ వేసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోదరి షర్మిలను పసుపు రంగు చీర కట్టుకున్నందుకు తప్పు పట్టిన జగన్ భార్యను ఏమంటారు? అంటూ ఆ ఫోటోలను పోస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. కొందరు మహిళలైతే చీరలో నిండుగా తెలుగింటి ఆడపడుచులా కనిపించే సోదరిని అలా ఎలా అనగలిగారంటూ తప్పుబట్టారు. ఈ రోజు షర్మిల చీర గురించి మాట్లాడిన జగన్ పొరపాటును తల్లి విజయమ్మ పసుపు చీర కట్టుకుంటే కూడా ఇలాగే అంటారా? అంటూ నిలదీశారు. ఇంతకంటే దిగజారడానికి ఇంకే మిగిలింది జగన్? అని మరికొందరు అవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story