
చదువుల శిఖరం నేలకొరిగింది
డిగ్రీలు చేయడంలో సుధాకర్ గిన్నీస్‌బుక్ రికార్డు సృష్టించారు.
ప్రముఖ విద్యావేత్త, అత్యధిక డిగ్రీలు సొంతం చేసుకుని గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించిన పట్నాల జాన్ సుధాకర్ బుధవారం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 68 ఏళ్లు. చదువుల్లో అత్యధికంగా 120 డిగ్రీలను ఆయన సంపాదించుకున్నారు. ఢిల్లీలో సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌గా పని చేసిన పట్నాల జాన్ సుధాకర్ డిగ్రీలు సొంతం చేసుకోవడంలో అరుదైన చరిత్ర సృష్టించారు. అనంతరం పట్నాల సుధాకర్ డాక్టర్ పీజే సుధాకర్‌గా ప్రఖ్యాతి గాంచారు.
పట్నాల సుధాకర్‌ది పెందుర్తి మండలం పెదగాడి గ్రామం. తొలుత ఆయన సీబీఐలో ఓ చిరు ఉద్యోగంలో చేరారు. అక్కడ నుంచి ఆయన దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. అయితే తాను అంతపెద్ద స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా.. తన చదువులకు, డిగ్రీలను సొంతం చేసుకోవడం మాత్రం ఆయన పక్కన పెట్టలేదు. చదువులపై దండయాత్రను కొనసాగిస్తూనే వచ్చారు. ఉద్యోగ విధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరి మన్ననలు పొందుతూనే తన డిగ్రీల సంపాదన దండయాత్రను కొనసాగించారు. అంత పెద్ద అరుదైన రికార్డు క్రియేట్ చేసిన జాన్ సుధాకర్ పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్యాచ్‌లర్‌గానే ఉండిపోయారు. తన సోదరుడు ప్రసాద్‌తో కలిసి విశాఖపట్నంలో ఉంటున్నారు. పెందుర్తి మండలంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన పట్నాల జాన్ సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగి ఒక విద్యావేత్తగా, పరిశోధకుడిగా, మేథావిగా వినుతికెక్కారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. డాక్టర్ పీజేఆర్ సుధాకర్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story