తమిళనాడులో నవోదయ విద్యాలయాలు ఎందుకు లేవో తెలుసా?
x

తమిళనాడులో నవోదయ విద్యాలయాలు ఎందుకు లేవో తెలుసా?

దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్క తమిళనాడులో మాత్రమే లేవు. ఈ రాష్ట్రం తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.


తమిళనాడు విద్యా విధానం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. విద్య కోసం వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు ఉంది. చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకుంటారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. అయితే ప్రైవేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వ స్కూళ్లకు పోటా పోటీగా వస్తున్నాయి. విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులకు కూడా ప్రాధాన్యత ఉంది. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా వివిధ వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవచ్చు. మధ్యాహ్న భోజన పథకం చాలా కాలంగా తమిళనాడులో అమలులో ఉంది. ఇది దేశంలోనే అత్యంత విజయవంతమైన పథకాలలో ఒకటిగా చెబుతుంటారు.

తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని అనుసరిస్తుంది. దీని ప్రకారం, తమిళం మొదటి భాషగా, ఆంగ్లం రెండవ భాషగా బోధిస్తారు. హిందీని తప్పనిసరి భాషగా బోధించడం లేదు. ఇది నవోదయ విద్యాలయాల స్థాపనకు ప్రధాన అడ్డంకిగా ఉంది. ఎందుకంటే అవి త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తాయి. తమిళనాడు ప్రభుత్వం నవోదయ విద్యాలయాల స్థాపనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను అనుసరిస్తాయి. అయితే తమిళనాడు రాష్ట్రానికి తన సొంత విద్యా విధానం ఉంది. ఈ విధానపరమైన భేదాల వల్ల నవోదయ విద్యాలయాల స్థాపన తమిళనాడులో సాధ్యం కాలేదు.

నవోదయలో నాణ్యమైన ఆధునిక విద్యను అందిస్తారు, విలువలు, పర్యావరణంపై అవగాహన, సాహస కార్యకలాపాలు, శారీరక విద్య, సంస్కృతిని పెంపొందించడం, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన పిల్లలకు వారి కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అడ్మిషన్లు ఉంటాయి. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా నవోదయలో ప్రవేశించడానికి అర్హులు. నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే, వీరు మీ జిల్లాలోని నవోదయ విద్యాలయంలో ప్రవేశం పొందుతారు. ప్రతి నవోదయ విద్యాలయం విద్యార్థులకు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, ఉచిత స్కూల్ యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, రైలు, బస్సు ఛార్జీలను ఉచితంగా అందిస్తున్నది.

2025- 2026 జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 6వ తరగతికి అడ్మిషన్లను నిర్ణయిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు ఎంపిక పరీక్ష రాయాలి. 6వ తరగతికి ఒక్కో పాఠశాలలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు. కనీసంగా 40 సీట్లు ఉంటాయి. 6వ తరగతిలో చేరడానికి CBSE రూపొందించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ప్రతి JNV కోసం 80 మంది అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి 6వ తరగతి కోసం JNVST ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తుంది. అడ్మిషన్ కోరుకునే అభ్యర్థి ఎంపిక పరీక్ష నిర్వహించే నాటికి అంటే మే 1వ తేదీకి తప్పనిసరిగా 13-15 ఏళ్ల మధ్య ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారితో సహా అన్ని వర్గాల అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో 661 జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV) ఉన్నాయి. ఇవి దేశంలోని తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. నవోదయ విద్యాలయ సమితి (NVS) ఈ పాఠశాలలను నిర్వహిస్తుంది. పాఠశాలలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో స్థాపించారు. ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయం ఉంది.

Read More
Next Story