TGPSC|టీజీపీఎస్సీ ఛైర్మన్ గా ‘బుర్రా‘నే ఎందుకు నియమించారో తెలుసా ?
సీనియర్ ఐఏఎస్ అధికారి హోదాలో దారితప్పిన టీజీపీఎస్సీ(TGPSC)ని బుర్రా సరైన దారిలోకి తీసుకురాగలనే నమ్మకం ఉండటం.
అత్యంత వివాదాస్పదమైన ఉద్యోగాల భర్తీ వేదిక టీజీపీఎస్సీకి ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన అధికారిని ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి(Revanth) ఏరికోరి మరీ నియమించారు. బుర్రాను ఛైర్మన్ గా రేవంత్ ఎందుకు నియమించినట్లు ? ఎందుకంటే రెండు కారణాలున్నాయి. మొదటిదేమో సీనియర్ ఐఏఎస్ అధికారి హోదాలో దారితప్పిన టీజీపీఎస్సీ(TGPSC)ని బుర్రా సరైన దారిలోకి తీసుకురాగలనే నమ్మకం ఉండటం. ఇక రెండో కారణం ఏమిటంటే బీసీలకు అత్యంత కీలకమైన పదవిని తమ ప్రభుత్వం అప్పగించిందని చాటిచెప్పుకోవటం. రాజకీయంగా బీసీ వాటా విషయంలో పెద్ద వివాదం రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాల్సిందే అని కొద్దిరోజులుగా పార్టీల రహితంగా బీసీ సామాజికవర్గాల నేతలు, బీసీ సంఘాల నేతల నుండి పదేపదే రేవంత్ మీద ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ గురించి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. మంత్రులు కూడా మొక్కుబడిగా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారే కాని 42 శాతం రిజర్వేషన్ అమలుకు రేవంత్ కట్టుబడి ఉన్నారన్న మాటను మాత్రం ప్రస్తావించటంలేదు.
ఈ నేపధ్యంలోనే బీసీలను అణగదొక్కేస్తున్నారనే ఆరోపణలతో బీసీ సంఘాలు గోల మొదలుపెడుతున్నాయి. కాబట్టి అర్జంటుగా టీజీపీఎస్సీ లాంటి అత్యంత కీలకమైన సంస్ధకు ఛైర్మన్(TGPSC Chairman Burra Venkatesam) గా బీసీనే నియమిస్తే కొంతవరకు ఆరోపణలను, ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవచ్చని రేవంత్ అనుకున్నట్లున్నారు. అందుకనే సమాచార శాఖకు పనిచేసి ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశంను ఏరికోరి మరీ ఛైర్మన్ గా నియమించింది. ఐఏఎస్ అధికారిగా అనేక శాఖల్లో పనిచేసిన అనుభవం బుర్రాకు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో అనుసరించాల్సిన నియమ, నిబందనలన్నీ బుర్రాకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరంలేదు. పైగా ఇప్పటివరకు టీజీపీఎస్సీ వల్ల జరిగిన రచ్చంతా కచ్చితంగా ఫాలో అయ్యే ఉంటారనటంలో సందేహంలేదు.
అత్యంత వివాదాస్పద సంస్ధ
గడచిన 10 ఏళ్ళల్లో తెలంగాణా ప్రభుత్వంలో ఏదైనా అత్యంత వివాదాస్పదమైంది అంటే అది ఉద్యోగాల నియామకాలనే చెప్పాలి. ఉద్యోగాల నియామకాలకు ఉద్దేశించిందే టీజీపీఎస్సీ. ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) ఉన్న పదేళ్ళలో టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాలు బాగా వివాదాస్పదమయ్యాయి. నోటిపికేషన్ల ప్రకటన, కోర్టు కేసులు, నోటిఫికేషన్ల రద్దు, ఎంపికలపై కోర్టు కేసులు, నిరుద్యోగుల ఆందోళనలు, అభ్యర్ధుల ఆత్మహత్యలతో, పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలతో టీజీపీఎస్సీ అంటేనే గందరగోళం, వివాదాస్పద సంస్ధగా పేరుపడిపోయింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ విషయంలో జరిగినన్ని అవకతవకలు, దాఖలైన కోర్టు కేసులు ఎన్నో. పరీక్షలు రాసిన వేలాదిమంది అభ్యర్ధులే కాకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు కూడా రోడ్లపైకి వచ్చి రోజుల తరబడి ఆందోళనలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏఒక్క పరీక్ష కూడా వివాదాస్పదం కాకుండా ప్రశాంతంగా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటైన తర్వాత మొదటి ఛైర్మన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గంటా చక్రపాణి నియమితులయ్యారు. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి అపాయింట్ అయ్యారు. వీళ్ళిద్దరి హయాంలోనే సంస్ధ బాగా వివాదాస్పదమైంది. జనార్ధన్ రెడ్డిని ఛైర్మన్ గా కేసీఆర్ రాజీనామా చేయించి డీజీపీగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డిని నియమించారు. ఈయన హయాంలో పెద్దగా వివాదాస్పదం కాలేదు. ఎందుకంటే చేసిన నియామకాలు ఏమీలేవు కాబట్టే. మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3వ తేదీతో ముగుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఛైర్మన్ ను నియమించాల్సొచ్చింది. అందుకనే దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చిన 45 దరఖాస్తుల్లో నుండి ప్రభుత్వం బుర్రాను ఎంపికచేయటంతో సీనియర్ ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈరోజు బుర్రాను టీజీపీఎస్సీ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 2వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్న బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్ గా నాలుగు సంవత్సరాలు ఉండబోతున్నారు. మరి ఈయన తన మేథస్సును ఉపయోగించి టీజీపీఎస్సీ మీద పడిన చెడ్డపేరును తొలగిస్తారా ?
బుర్రా చేయాల్సింది ఏమిటి ?
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి ముందే బుర్రా చేయాల్సింది ఏమిటంటే నిరుద్యోగుల సంఘాలతో సమావేశం అవ్వాలి. వాళ్ళ డిమాండ్లు ఏమిటి ? తెలుసుకుని వాళ్ళ సమస్యలను బుర్రా సానుభూతితో అర్ధంచేసుకోవాలి. నిరుద్యోగ సంఘాలతో మాట్లాడిన తర్వాత రేవంత్ తో కూడా భేటీ అయి ఉద్యోగాల నియామకాలకు అవసరమైన విధివిధానాలను ఫైనల్ చేయాలి. మధ్యే మార్గంగా నోటిఫికేషన్ల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలంటే గ్రూపుల పరీక్షల్లో ఒకదానితో మరోటి క్లాష్ కాకుండా తేదీలను జాగ్రత్తగా డిసైడ్ చేయాలి. పరీక్షల తేదీలు, సిలబస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం చేయాల్సిన నియామకాలు లక్షల్లో ఉన్నాయి. మరి అత్యంత వివాదాస్పదమైన టీజీపీఎస్సీ వేదికను బుర్రా అయినా దారిలోకి తీసుకొస్తారా ?