
జగన్ కొంపముంచిన కోటరీ ఇదేనా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వితీయ శ్రేణి కోటరీ ఎవరు? వారి అనుమతి లేనిదే జగన్ ను కలిసే అవకాశం ఎందుకు రావడం లేదు.
వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీని తప్పించుకుని జగన్ ను కలవాలంటే వారికి ముట్టచెప్పాల్సిందేనా? లేదంటే కలిసే అవకాశం ఉండదా? ద్వితీయ శ్రేణి కోటరీగా ఉన్న వీరు ఎవరు? ఎందుకు వీరికి జగన్ అంత ప్రాధాన్యత ఇస్తున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు కేసులో సీఐడీ విచారణకు హాజరైన వి విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ ఉన్న కోటరీని పక్కన బెట్టకుంటే ఆయనకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వారు చెప్పే మాటలు విని పార్టీలోని నాలాంటి నాయకులను దూరం చేసుకోవడం వల్ల పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు.
ప్రథమ శ్రేణి కోటరీ ఎవరు?
జగన్ వద్ద ప్రథమ శ్రేణి కోటరీ ఉందనేది పార్టీ వారు చెబుతున్న మాట. ఆ కోటరీలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి ఉండే వారని, వారు అనుకున్నది జగన్ తో చెప్పి చేసే వారనేది వైఎస్సార్ సీపీలో జరుగుతున్న చర్చ.
నిజానికి వీరికి జగన్ వద్ద ప్రయారిటీ ఎక్కువగానే ఉండేది. వారు అనుకున్న ప్రకారం ఏదైనా చేయగలిగే వారు. జగన్ కూడా వీరు చెప్పే అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకునే వారనేది పార్టీవర్గాల మాట. వీరు పార్టీలో నియామకాలు, ఇతర అంశాలను కూడా పరిశీలించే వారు. ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని జగన్ వద్ద ఉంచే వారు. సాక్షి దినపత్రిక నుంచి ఇచ్చే రిపోర్టులే కాకుండా, పార్టీతో సంబంధం లేని వ్యక్తులతో రిపోర్టులు తెప్పించుకునే వారు. రిపోర్టుల్లో వాస్తవం ఉందని భావిస్తే జగన్ వద్ద ఉంచే వారు.
ద్వితీయ శ్రేణి కోటరీ ఎవరు?
వైఎస్ జగన్ వద్ద ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకుల హవా ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తరువాత రెండేళ్లకు ద్వితీయ శ్రేణి కోటరీ పలుకుబడి ఎక్కువైందనేది పార్టీలోని ముఖ్య నాయకులు చెబుతున్న మాట. వీరు చెప్పే విషయాలు జగన్ పరిగణలోకి తీసుకునే వారని, అందువల్ల జగన్ కు, నాయకులకు మధ్య దూరం పెరుగుతూ వచ్చిందనే చర్చ ఉంది.
ద్వితీయ శ్రేణి నాయకుల్లో ప్రధానంగా కమ్యునికేషన్ సలహా దారుగా పనిచేసిన జీవీడి కృష్ణ మోహన్ (ఈనాడు దినపత్రికలో సంపాదకీయ పేజీ చూసేవారు), జగన్ క్యాంపు కార్యాలయ పీఏగా నియమితులైన కె నాగేశ్వరరెడ్డి (కెఎన్ఆర్), ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో మీడియా ఇన్ చార్జిగా పనిచేస్తున్న పూడి శ్రీహరి, ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ప్రత్యేకాధికారి, సీఎం స్పెషల్ పీఏగా పనిచేసిన డాక్టర్ హరికృష్ణ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ గా నియమితులైన తలశిల రఘురామ్ (ప్రస్తుతం ఎమ్మెల్సీ), గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఇన్ చార్జ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
వీరు చెప్పే మాటలు విని చాలా మంది పార్టీలోని ముఖ్య నాయకులను వైఎస్ జగన్ దూరం చేసుకున్నారనేది పలువురు నాయకులు చెబుతున్న మాట. విజయసాయిరెడ్డి కూడా ఈ విషయమే చెప్పారు. అయితే కోటరీ ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు.
అసలింతకీ కోటరీ అంటే ఏమిటీ...
కోటరీ (Coterie) అనేది ఒక చిన్న, ప్రత్యేకమైన ముఠా లేదా వర్గం. ఈ గుంపులోని వ్యక్తులు ఒకరికొకరు బాగా కలిసిపోవడం వల్ల, వారు బయటివారిని తమ వర్గంలోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కోటరీ సభ్యులు సాధారణంగా ఒకే అభిరుచిని కలిగి ఉంటారు. నాయకుణ్ణి సేవించి తరిస్తుంటారు.
బయటి ప్రపంచానికి కనపడకుండా లోలోపల పనులు చక్కబెడతారు. సామాన్యులను దరిచేరనివ్వరు. వీరిదో ప్రత్యేకమైన శైలి.
సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాల్లోనూ ఈకోటరీలు ఉంటుంటాయి.
వీళ్లంతా ప్రజల కోసం పనిచేసినట్టు కనిపిస్తూ తమ సొంత లాభం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మానుకోరు.
కోటరీలు పాజిటివ్, నెగటివ్ కోణంలోనూ ఉంటాయి. కులం, మతం, వర్గం, డబ్బు, కక్షసాధింపు, తాము మాత్రమే ఎదగాలనే ఆకాంక్షతో పైవాళ్ల సేవలో తరించడం ఉంటుంది. నటన ఎక్కువగా ఉంటుంది.
నెగటివ్ కోటరీ లక్షణాలు
పక్షపాతంతో వ్యవహారిస్తారు. ఇతరులను తొక్కిపెట్టే ధోరణితో వ్యవహరిస్తారు. తమ ప్రయోజనాల కోసం ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తారు.
కొత్త ఆలోచనలకు తావివ్వకుండా తాము నమ్మిన వ్యక్తి చుట్టూ ఓ కంచెలా వ్యవహరిస్తుంటారు. రాజకీయ మేధావితనంతో సామూహిక కుట్రలు చేస్తుంటారు.
ఉదాహరణకు ఆఫీసులో ఒక గ్రూప్ ఉన్నతాధికారులకే అవకాశాలు లభించేలా చూడడం, ఇతరుల ప్రతిభా పాటవాలను అణగదొక్కడం చేస్తున్నారనుకుంటే అందులో "కోటరీ పాలన" నడుస్తోందనవచ్చు. "రాజకీయ కోటరీ" అంటే ఒక చిన్న వర్గం తమ అధికారం కోసం మాత్రమే పని చేసి, ఇతరులను దూరం పెట్టినా, పట్టించుకోకపోయినా కూడా ఈ పేరుతో పిలవ వచ్చు. మొత్తం మీద "కోటరీ" అనేది స్వార్థపూరిత సమూహం. "పరస్పర ప్రయోజనాల నెట్వర్క్"
ఎందుకు వీరికి ఇంత ప్రాధాన్యత..
సహజంగా జగన్ ఎవరి మాటా వినరని, ఎవరేమి చెప్పినా తాను చేయాలనుకున్నదే తాను చేస్తారని అంటుంటారు. అలాంటిది ఈ కోటరీల మాట వింటారా అని ఎవరికైనా సందేహం కలుగవచ్చు. అయితే రాజకీయ ప్రముఖులకు ఇతరులు ప్రత్యేకించి తన సమకాలీకులు లేదా సీనియర్లు తన గురించి ఏమనుకుంటున్నారో, ఎలా అంచనా వేస్తున్నారో తెలుసుకునేందుకు సొంత మనుషుల్ని అక్కడక్కడా పెడుతుంటారు. ఉదాహరణకు దేశ విభజన సమయంలో సర్దార్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూ కి తెలియకుండా చివరి వైస్రాయి మౌంట్ బాటన్ దగ్గర మీనన్ అని ఓ వేగును పెట్టారట. అతను చాలా విషయాలను ఎప్పటికప్పుడు పటేల్ కి చేరవేసేవాడట. అవి విన్న నెహ్రూ అవన్నీ నీకెలా తెలుసు అని విస్తుపోయేవాడట. అలా చాలా మంది రాజకీయ నాయకులు పైవాళ్లకు బదులు కింది వాళ్లపై ఆధారపడుతుంటారు. చిన్నవాళ్లయితే పార్టీ నాయకుడు తిట్టినా కొట్టినా చేతులు నలుపుకుంటూ పడిఉంటారనేది మనస్తత్వ శాస్త్రంలో ఓ భాగం.
ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అంతేనన్నది విజయసాయిరెడ్డి చెప్పినదాన్ని బట్టి అర్థమవుతుందని ఓ అసమ్మతి నేత చెప్పారు.. పైవాళ్లను మందలించలేనప్పుడు కింది వాళ్లపై ఆ ప్రతాపం చూపుతుంటారు. దాన్నిబట్టి అక్కడున్న పైవారు అంటే పార్టీ సీనియర్లు పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
అందువల్లే జగన్ ద్వితీయ శ్రేణి కోటరీలో ఉన్న వారిని ఎంచుకున్నట్టు ప్రచారం. ద్వితీయ శ్రేణిలోని వారందరూ పెయిడ్ ఉద్యోగులే. తన మనుషులే. వాళ్లకి కాస్తంత లౌక్యం, బతకనేర్చిన తనంతో పాటు నాయకుడి పట్ల విధేయత, నాయకుడు ఏమి చెప్పినా కాదూ, కూడదు అనడంతో పాటు కుడికంటితో చూసింది ఎడమ కంటికి తెలియకుండా ఉండే గోప్యత చూసుకుంటుంటారు. జగన్ ఎంచిన ద్వితీయ శ్రేణిలో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం...
కేఎన్ఆర్...
కేఎన్ఆర్... పూర్తి పేరు కె నాగేశ్వర్ రెడ్డి. చూడడానికి చాలా సాదా సీదాగా కనిపిస్తారు. 'వార్త' దినపత్రికకు కడప ఎడిషన్ లో ఆపరేటర్ గా చేరి సబ్ ఎడిటర్ గా ఎదిగి ఆ తర్వాత ఎడిషన్ ఇన్ చార్జీగా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి ఆ తర్వాత తన తెలివి తేటలతో వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. జగన్ కి నమ్మినబంటుగా మారారు. వైఎస్సార్ మరణం తరువాత ఓదార్పు యాత్ర చేయనున్నట్లు జగన్ ప్రకటించడంతో జగన్ సరసన చేరాడు. ఆయనతో కలిసి అడుగులో అడుగేసేవాడు. సాక్షి సహా జగన్ కి ఉన్న సంస్థలలో మిగిలిపోయే చెత్తాచెదారాన్ని అంటే స్క్రాప్ బిజినెస్ ను చేపట్టాడు. జగన్ మనసెరిగి ప్రవర్తించేవాడు. మనసులో మంచి బట్టలు వేసుకోవాలని ఉన్నా తన బాస్ ను మెప్పించేందుకు మహా తాపత్రయపడే వారు. దానికి తగ్గ ఫలితమే సీఎం పక్కన తాను నిలుచునే అవకాశం కొట్టేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ కి సూరీడు ఎలాగే జగన్ కి ఈ కెఎన్ఆర్ అలాగే. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటే వెళుతూ ప్రత్యేకించి పీఏ చేయాల్సిన పనులు అన్నీ చేసే వారు. సాక్షి జిల్లా బ్యూరో ఇన్ చార్జ్ ల నుంచి కావాల్సిన సమాచారం తెప్పించుకుని జగన్ వద్ద ఉంచే వారు. దీంతో కెఎన్ఆర్ పై జగన్ కు నమ్మకం కుదిరింది. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి హేమాహేమీలు సైతం ఈ కెఎన్ఆర్ పర్మిషన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.
అపర మేధావి జీవీడీ...
జీవీడీ.. పూర్తి పేరు జీవీడీ కృష్ణమోహన్. కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం వెళ్లి సెటిల్ అయిన అయ్యవారు. ఈనాడు దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరి ఆ తర్వాత ఎడిట్ పేజీలో వ్యాసాలు రాసే దాకా ఎదిగి సాక్షి దినపత్రిక వచ్చిన కొత్తలో ఎడిట్ పేజీలో వ్యాసాలు రాయడం కోసం ఆయన్ను రప్పించారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు జగన్ కి రాసిచ్చిన ఉపన్యాసాలు నచ్చడంతో ఆయనపై వైఎస్ జగన్ కి ఆయనపై గురి కుదిరింది. జగన్ సభలు, సమావేశాల్లో ఏమి మాట్లాడాలో ఆయనే నోట్ తయారు చేసి పంపించే వారు. దాన్లో మార్పులు చేర్పులు చేసి పంపిస్తే మళ్లీ దాన్ని తిరగరాసి సమగ్ర స్పీచ్ ను తయారు చేసేవారు. ఇక దాంతో ఆయన సాక్షి దినపత్రికకు వద్దని చెప్పి తనకు వ్యక్తిగత మీడియా సలహాదారుగా పెట్టుకున్నారు జగన్. అది జీవీడీ కృష్ణమోహన్ జీవితాన్ని మలుపు తిప్పింది.
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, రామాయణ, మహాభారతాలు చదివి ఉండడం, వ్యాసాలు రాసే తీరు బాగా తెలిసి ఉండడంతో జగన్ ని బాగా ఆకట్టుకున్నారు.
ప్రభుత్వం చేపట్టే పథకాలకు ప్రచారం ఇచ్చేందుకు కావాల్సిన పది మంది జర్నలిస్టులను ఒక టీముగా తయారు చేసి వారితో కార్యకలాపాలు నిర్వహించే వారు. నిత్యం సలహాలు, సూచనలు ఇచ్చే వారిలో జీవీడీ కూడా ఒగరుగా ఉండే వారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోస్టల్ కారిడార్ నిజాంపట్నం, కృష్ణపట్నం మధ్య ఏర్పాటు చేసినప్పుడు జరిపిన భూ సేకరణలో అనధికారికంగా ప్రముఖ పాత్ర పోషించారు. జగన్ కు కృష్ణమోహన్ పై నమ్మకం కూడా ఎక్కువగానే ఉండేది.
జగన్ సూచనల మేరకు కొన్నిసార్లు, తానే తన ప్రతిభను నిరూపించుకునేందుకు మరికొన్ని సార్లు స్పందించి రాజును మించి రాజభక్తిని ప్రదర్శించేవారు. ప్రభుత్వం వచ్చాక ఆయన రాసి ఇచ్చిందే చదవాల్సి వచ్చేదని సాక్షాత్తు వాసిరెడ్డి పద్మే వాపోయింది. పార్టీలోని సీనియర్లకు జగన్ ఆదేశాల పేరిట ఈయన చెప్పిన టాకింగ్ పాయింట్లే మాట్లాడాలి. పవన్ కల్యాణ్ పై విమర్శలను ఎక్కుపెట్టించి కాపుల్ని వైసీపీకి దూరం చేసిందే జీవీడీ అనే టాక్ పార్టీలో ఉండనే ఉంది. పార్టీ ఓడిన తర్వాత గప్ చుప్ గా తిరుగుతున్నారు. బాగా డబ్బు వెనకేశాడనే టాక్ కూడా ఉంది.
ఉత్తరాంధ్ర నుంచి పూడి శ్రీహరి..
వైఎస్ జగన్ సీఎం కాగానే పూడి శ్రీహరిని సీఎం చీఫ్ పీఆర్వోగా నియమించారు. సాక్షి టీవీలో రిపోర్టర్ కమ్ సబ్ ఎడిటర్ గా చేరి కుటుంబ కలహాలతో చికాకు పడి ఇంటా బయట ఇబ్బందులు పడుతూ ఉన్న ఉద్యోగం పోతుందేమో అనుకునే దశలో జగన్ పాదయాత్ర ఆయనకు కలిసి వచ్చింది. జీవీడీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు శ్రీహరి ఉపన్యాసాల రాత ప్రతులు సిద్ధం చేసేవారు. జగన్ సూచనల మేరకు ప్రతిరోజూ సాయంత్రం పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన్ను కలిసి ఆయన చెప్పినట్టు రాసుకుని బయటకు వచ్చి వాటిని రికార్డు చేసి ఆయనకు చూపించే వారు. అలా ఆయన జగన్ కి పాదయాత్రలో ఓ అనధికార పీఆర్వోగా మారారు. ప్రతి రోజూ కావాల్సిన సమాచారాన్ని శ్రీహరి అందించే వారు. పత్రికల్లో వచ్చిన స్టోరీలను చదివి వినిపించి ఏమి జరుగుతుందో చెప్పేవారు. అలా జగన్ కు దగ్గరయ్యారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు ఏ విదులైతే జగన్ వద్ద నిర్వహిస్తున్నారో అవే విధుల్లో సీఎం వద్ద నియమించుకున్నారు. సాక్షి జర్నలిస్టుల్లో తనకంటూ ఒక ప్రత్యేక టీమును శ్రీహరి తయారు చేసుకున్నారు.
జగన్ నాడి తెలిసిన డాక్టర్ హరికృష్ణ..
ఇతనిది పుట్టపర్తి. బతకనేర్చిన తనం చాలా ఎక్కువ. పైకి ఎంత అమాయకంగా కనిపిస్తారో లోలోపల అంతకుమించిన తెలివితేటలు ఉన్నవారు. వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం కన్వీనర్ హోదాలో దేశ దేశాలు తిరిగివచ్చారు. పాదయాత్ర సమయంలో జగన్ రోజువారీ డెయిరీ రాసేవారు. దాన్నే సాక్షి దినపత్రికలో జగన్ పేరిట ప్రచురించేవారు.
పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ కు ఫిజియో థెరపిస్ట్ గా డెయిరీ రైటర్ గా పని చేసేవారు. ఏదైనా సబ్జెక్ట్ పై జగన్ కోరిన వెంటనే క్షణాల్లో సమాచారం సాక్షి నుంచి తెప్పించేలా ఆ దినపత్రిక బాధ్యులతో, సంబంధిత శాఖలు చూసే స్టేట్, జిల్లా బ్యూరో రిపోర్టర్లతో కాలానుగుణమైన సంబంధాలు నెరిపేవారు.
పుట్టపర్తి సీటు ఆశించినప్పటికీ జగన్ ఇవ్వలేదు. అయితే అంతకుమించిన పోస్టు కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే సీఎం స్పెషల్ పీఏగా పోస్టింగ్ ఇచ్చి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఇన్ చార్జ్ గా నియమించారు. ఆరోగ్య శ్రీ పథకంలో ఏ పేషంట్ కు ఎంత డబ్బు ఇవ్వాలో నిర్ణయించే ప్రధాన విధుల్లో హరికృష్ణ పనిచేశారు. వైఎస్ షర్మిల పాదయాత్రలో ముందస్తు ఏర్పాట్లు చేసిన అనుభవం ఉండడంతో జగన్ ఓదార్పు యాత్రలోనూ, ఆ తరువాత జరిగిన పాదయాత్రలోనూ హరికృష్ణ జగన్ వెంటే ఉన్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే వారు. పుట్టపర్తికి చెందిన హరికృష్ణకు జగన్ వద్ద మంచి ప్రయారిటీ ఉండేది.
జగన్ ను మురిపించ గల తలశిల..
తలశిల రఘురామ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి మిత్రుడు. ఆ పరిచయాలతో వైఎస్ జగన్ కు దగ్గరయ్యారు. పాదయాత్ర సందర్భంగా ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. జగన్ బస చేసే చోట టెంట్ వేయించడం, మధ్యాహ్నం లంచ్ సమయంలో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడటం వంటి కార్యక్రమాలు అన్నీ రఘురామ్ చూసేవారు. జగన్ సీఎం కాగానే గతంలో ఏ పనులైతే రఘురామ్ చేసారో అవే పనుల్లో అధికారికంగా నియమించారు. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్గా నియమితులు కావడంతో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా రఘురామ్ ముదుగా అక్కడికి వెళ్లి అధికారులతో పాటు పరిసరాలు, పరిస్థితులు తెలుసుకుని జగన్ వద్ద ఉంచే వారు.
ఓదార్పు యాత్రలో కానీ, పాదయాత్రలో కానీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ వెంటే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర సందర్భంగా రూట్ మ్యాప్ లో కీలకంగా వ్యవహరించి జగన్ దృష్టిలో ఉన్నారు. అందుకే చెవిరెడ్డి చెప్పే అంశాలను కూడా జగన్ పరిగణలోకి తీసుకునే వారు. గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్లు, జిల్లాలో జరిగే విషయాలు జగన్ వద్దకు ఎప్పటి కప్పుడు చేరవేస్తూ కోటరీలో ఒగరుగా మారిపోయారు. నిజానికి వీళ్ల గురించి గ్రంథాలకు గ్రంథాలే రాయవచ్చు.
జగన్ ను కలవాలంటే ముందు వీరిని దాటాలి..
ద్వితీయ శ్రేణి కోటరీలో ఉన్న వీరిని దాటిన తరువాతనే ఎవరైనా జగన్ మోహన్ రెడ్డికి కలిసేందుకు అవకాశం ఏర్పడుతుందనేది పార్టీలో జరుగుతున్న చర్చ. అలాగే వీరు చెప్పే అంశాలకు జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని, వీరు కొందరు నాయకులపై చాడీలు చెప్పే వారని, వారు చెప్పినవి విని ఆ నాయకులను జగన్ దూరం పెడుతూ వచ్చారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు విజయసాయి రెడ్డి వీళ్లనే టార్గెట్ చేశారు. వీళ్ల మాటలు వినే తనను జగన్ దూరం చేశారనే స్వరం వినిపిస్తున్నారు. నిజంగా కూడా వీళ్లు తలుచుకుంటే జగన్ ని కలవడం చాలా సులువు. వీళ్లు కాదంటే కొన్ని గంటలో కొన్ని రోజులో వెయిట్ చేయాల్సిందే.
Next Story