ఏపీలో రేషన్‌ మాఫియా ముఠా ఎవరో తెలుసా?
x

ఏపీలో రేషన్‌ మాఫియా ముఠా ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ మాఫియా కొనసాగుతోంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రేషన్‌ మాఫియా మాత్రం పోవడం లేదు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఏమి చేస్తున్నారో తెలుసా?


ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లైస్‌ విభాగం కొన్ని ముఠాలకు వరంగా మారింది. ఈ రాష్ట్రంలో దోశ పిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం కోటాను కోట్లు ఖర్చుచేసి సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం నుంచి వచ్చిందే దోశ పిండి. నూటికి 99 శాతం దోశ పిండి రేషన్‌ బియ్యం నుంచి వచ్చిందేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

రేషన్‌ వాహన దారులే మాఫియా...
రేషన్‌ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల నిర్వాహకులేనట. స్వయంగా సివిల్‌ సప్లైస్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి. ఆయన ఎన్నో సమీక్షలు, పర్యటనలు చేసిన తరువాత ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గడప వద్దకే రేషన్‌ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసింది. ఈ వాహనాలను డ్రైవింగ్‌ వచ్చిన వారికి ఆర్థిక సాయం కింద అందించింది. అయితే ఈ వాహనాల కొనుగోలు వల్ల పౌరసరఫరాల సంస్థకు రూ. 1,500 కోట్ల నష్టం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.
ఎండీయూల రద్దు
పేదలకు రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ వాహనాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బియ్యం, ఇతర సరుకులు ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తున్నప్పటికీ వినియోగదారులకు చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఒక వీధిలోకి వాహనం వెల్లి ఆపితే అక్కడికి రేషన్‌ కోసం కార్డు దారులు లైన్లలో నిలబడి తీసుకుంటున్నారు. బియ్యం, సరుకులు వద్దనుకునే వారు మాకు డబ్బులు ఇవ్వాలని మొబైల్‌ యూనిట్‌లో సరుకులు ఇచ్చే వారిని కోరుతున్నారు. కేజీ బియ్యానికి రూ. 6ల వంతున లెక్కకట్టి ఎన్ని కేజీల బియ్యం ఉంటాయో అన్ని కేజీలకు డబ్బులు ఇస్తున్నారు. సాయంత్రం మిగిలిన మొత్తం బియ్యాన్ని కేజీ రూ. 10 నుంచి రూ. 12ల వరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేసే మాఫియాకు వీరు విక్రయిస్తున్నారు. అందువల్ల వాహనాలు ఇంటి వద్దకు తీసుకుపోయి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నా ఉపయోగం ఏమిటనేది ప్రశ్న.
గత ప్రభుత్వంలో పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ. 36,300 కోట్లకు చేరాయి. ఇందులో రూ. 10,000 కోట్లను వచ్చే ఏడాది మార్చిలోగా తీర్చాలని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు రూ. 2,000 కోట్లు ఇప్పటి వరకు చెల్లిచింది.
రేషన్‌ మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి: నాదెండ్ల
రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ అవినీతి భారీగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ. 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని వివరించారు.
Read More
Next Story