’కుక్కుట శాస్త్రం‘ అంటే ఏంటో తెలుసా?
x

’కుక్కుట శాస్త్రం‘ అంటే ఏంటో తెలుసా?

కోడి పందాలలో ఈ కుక్కట శాస్త్రమే కీలకం. పందెం రాయుళ్ల దీనిని ఒక డిజిటల్ రోడ్ మ్యాప్ గా భావిస్తారు.


సంక్రాంతి బరిలో కోడి పుంజు దూకబోయే ముందు, దాని కాళ్లకు కత్తి కట్టే ముందే.. పందెం రాయుళ్లు తిరగేసే పుస్తకం ఒకటి ఉంటుంది. అదే 'కుక్కుట శాస్త్రం'. ఏ కోడికి ఏ నక్షత్రంలో బలం ఉంటుంది? ఏ తిథి నాడు ఏ రంగు కోడి ప్రత్యర్థిని చిత్తు చేస్తుంది? అనే రహస్యాలన్నీ ఈ శాస్త్రంలోనే నిక్షిప్తమై ఉంటాయి. పందెం రాయుళ్ల దృష్టిలో ఇది కేవలం పుస్తకం కాదు, గెలుపు గుర్రాన్ని (కోడిని) పసిగట్టే ఒక ‘డిజిటల్ రోడ్ మ్యాప్’.

పందెం కోడి బరిలోకి దిగిందంటే అది కేవలం కండబలంతో చేసే పోరాటం కాదు.. దాని వెనుక నక్షత్రాల బలం, గ్రహాల గమనం కూడా ఉంటాయని పందెం లోకం నమ్ముతుంది. 'కాకి మీద డేగ గెలుస్తుందా? లేక నెమలి కాకిని చిత్తు చేస్తుందా?' అనే సందిగ్ధంలో ఉన్న పందెం రాయుళ్లకు దిక్సూచిలా నిలుస్తోంది కుక్కుట శాస్త్రం. సంక్రాంతి మూడు రోజులూ పంచాంగం కంటే ఎక్కువగా ఈ శాస్త్రాన్నే నమ్ముతారు. ఏ దిశ నుంచి కోడిని వదలాలి? ఏ రంగు కోడికి ఎప్పుడు మరణ గండం ఉంటుంది? వంటి అంశాలను లెక్కగట్టి కోట్లు పందెం కాసే 'కుక్కుట రాజకీయం' ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.

కుక్కుట శాస్త్రం అంటే పందెం కోళ్ల లక్షణాలు, వాటి రకాలు, పందేల సమయంలో అవి గెలిచే అవకాశాలను వివరించే ఒక సంప్రదాయ గ్రంథం లేదా విజ్ఞానం. ఇది ప్రధానంగా జ్యోతిష్యశాస్త్రం, పక్షుల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సంక్రాంతి సమయంలో కోడి పందేలు నిర్వహించే వారికి ఇది ఒక 'గైడ్' లాంటిది. కుక్కుట శాస్త్రం ఆధారంగా రంగులను బట్టి కోళ్లను వర్గీకరిస్తారు.

రంగులను బట్టి వర్గీకరణ:

కోళ్ల ఈకల రంగు, కాళ్ల రంగు, కళ్ల రంగును బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు:

డేగ: ఎరుపు రంగు ఈకలు కలిగినవి.

కాకి: నలుపు రంగు ఈకలు కలిగినవి.

నెమలి: పచ్చని రంగు ఛాయ కలిగినవి.

పర్ల: తెలుపు రంగు ఈకల మీద నల్లటి మచ్చలు ఉన్నవి.

అబ్రాస్: ఎరుపు, తెలుపు, నలుపు కలిసిన మిశ్రమ రంగు.

సేతు: పూర్తిగా తెల్లగా ఉండే కోడి.

పందెం లెక్కలివే:

పక్షం.. బలం: కుక్కుట శాస్త్రం ప్రకారం నెలలో రెండు పక్షాలు (శుక్ల పక్షం, కృష్ణ పక్షం) కోళ్ల గెలుపు ఓటములను శాసిస్తాయని నమ్ముతారు.

శుక్ల పక్షం (పౌర్ణమి ముందు): ఈ సమయంలో తెల్లని ఛాయ ఉన్న కోళ్లు (నెమలి, సేతు, పూల) బలంగా ఉంటాయట.

కృష్ణ పక్షం (అమావాస్య ముందు): నల్లని ఛాయ ఉన్న కోళ్లు (కాకి, నల్లబోర) ప్రత్యర్థులను వేటాడతాయని శాస్త్రం చెబుతోందని నమ్ముతారు.

రంగుల మాయాజాలం: కోళ్ల రంగులను బట్టి వాటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

డేగ: యుద్ధ వీరుడు (ఎరుపు రంగు).

కాకి: వ్యూహకర్త (నలుపు రంగు).

నెమలి: అదృష్టవంతుడు (పచ్చని ఛాయ).

అబ్రాస్: రంగుల మిశ్రమం (తెలుపు, నలుపు, ఎరుపు).

వారాలు - గెలుపు గుర్రాలు:

వారాన్ని బట్టి కూడా కొన్ని రంగులకు ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు..

ఆది, మంగళవారాల్లో డేగలు.. సోమ, శనివారాల్లో నెమళ్లు.. బుధ, గురువారాల్లో కాకులు విజయం సాధిస్తాయని పందెం రాయుళ్ల గట్టి నమ్మకం.

బరిలో దిశానిర్దేశం:

కేవలం రంగులే కాదు, కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దింపాలనేది కూడా ముఖ్యమే.

భోగి నాడు: ఉత్తర దిశ నుంచి..

సంక్రాంతి నాడు: తూర్పు దిశ నుంచి..

కనుమ నాడు: దక్షిణ దిశ నుంచి.. కోడిని వదిలితే విజయం వరిస్తుందని కుక్కుట శాస్త్ర నిపుణులు వివరిస్తుంటారు.

ఒకప్పుడు పక్షుల స్వభావాన్ని తెలుసుకోవడానికి పుట్టిన ఈ శాస్త్రం, కాలక్రమేణా భారీ జూదానికి పెట్టుబడిగా మారింది. వేల రూపాయలు ఖర్చు చేసి మరీ సిద్ధాంతకర్తలను పిలిపించుకుని, ముహూర్తాలు పెట్టించుకుని మరీ పందెం కోళ్లను బరిలోకి దింపుతున్నారు. శాస్త్రం ఏదైనా, నమ్మకం ఏదైనా.. చివరకు కత్తి వేటుకు ఒక ప్రాణం బలికావడం, కొందరి పందెం రాయుళ్ల జేబులు ఖాళీ కావడం, మరి కొందరు పందెం రాయుళ్ల జేబులు నింపుకోవడం సంక్రాంతి బరుల్లో నిత్యకృత్యంగా మారింది. వినోదం హద్దు దాటితే అది వ్యసనంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం. కోడి పందేలు చట్టరీత్యా నిషేధించబడినప్పటికీ, సంప్రదాయం, కుక్కుట శాస్త్రంపై ఉన్న నమ్మకంతో ఏటా ఈ పందేలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జంతు హింస నిరోధక చట్టం ప్రకారం పక్షులకు కత్తులు కట్టి పందేలు వేయడం నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Read More
Next Story