Revanth|రేవంత్ తీసుకున్న రెండు తెలివైన నిర్ణయాలు ఏమిటో తెలుసా ?
మొత్తానికి జనాల సంక్షేమంతో ముడిపడిన పై రెండు అంశాల్లో రేవంత్ రెడ్డి తెలివైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.
గడచిన వారంరోజుల్లో రేవంత్ రెడ్డి రెండు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది ఏమో దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుండి తరలించటమో లేకపోతే అన్నీ అనుమతులు రద్దు చేయటమో. ఇక రెండో నిర్ణయం ఏమిటంటే లగచర్ల భూసేకరణను నోటిఫికేషన్ను రద్దు చేయటం. నిజానికి దిలావర్ పూర్(Dilawarpur) ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) అయినా లగచర్ల ఫార్మా కంపెనీ(Lagacharla Pharma Company)ల కోసం భూసేకరణ వ్యవహరం మొత్తం తెలంగాణాను షేక్ చేసేశాయనే చెప్పాలి. రెండు అంశాల్లో లగచర్లలో భూసేకరణ అన్నది ప్రభుత్వ పరంగానే కాకుండా రేవంత్(Revanth) కు వ్యక్తిగతంగా కూడా బాగా చెడ్డపేరు తెచ్చిందనే చెప్పాలి. స్మూత్ గా డీల్ చేయాల్సిన విషయాన్ని బాగా రచ్చచేసి చెడ్డపేరుతెచ్చుకున్నది ప్రభుత్వం. ఇన్నిరోజుల తర్వాత రేవంత్ ఏమాలోచించారో ఏమో తెలీదు కాని మొత్తానికి లగచర్ల భూసేకరణను రద్దుచేయాలని డిసైడ్ చేశారు. ప్రభుత్వం నుండి ఈమేరకు ప్రకటన కూడా జారీఅయ్యింది.
ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటుకోసం కొడంగల్(Kodangal) నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో చేయాలని అనుకున్న భూసేకరణ ప్రక్రియను నిలిపేపేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. తాజా ప్రకటనతో దుద్యాల మండలం జనాలతో పాటు చాలామంది సంతోషం వ్యక్తంచేస్తున్నారు. లగచర్ల గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన జరిగిన దాడితో వ్యవహారం రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలెక్టర్ మీద రైతులు, గ్రామస్తులు దాడిచేయటంతో పోలీసులకు మండిపోయింది. దాడిచేసిన వారిలో చాలామంది తప్పించుకుంటే వాళ్ళ కుటుంబాల్లోని ముసలీ, ముతకా, ఆడా, మగా పిల్లా, పీచు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఎత్తుకొచ్చి స్టేషన్లో పెట్టి పోలీసులు చావబాదారు. తర్వాత అన్నీవైపుల నుండి మొదలైన ఒత్తిళ్ళ కారణంగా చాలామందిని వదిలిపెట్టారు.
అలా బయటకు వచ్చిన ఆడవాళ్ళను బీఆర్ఎస్(BRS) పార్టీ దొరికిచ్చుకుని ఢిల్లీకీ తీసుకెళ్ళి మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ దగ్గర ఫిర్యాదు ఇప్పించింది. కొద్దిరోజుల పాటు వివాదం బాగా హైలైట్ అయ్యేట్లు చూడటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. ఈ రకంగా రేవంత్ పైన బాగా నెగిటివ్ పెరిగిపోయింది. విషయం ఏమిటంటే కొడంగల్ రేవంత్ సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గంలో భూసేకరణనే స్మూత్ గా డీల్ చేయలేకపోయారనే చెడ్డపేరు వచ్చేసింది. దాంతో ఇదేవిషయమై ఓపికగా ఆలోచించిన రేవంత్ చివరకు ఫార్మాసిటి కోసం చేయాలని అనుకున్న భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తాజాప్రకటనతో జనాలందరు హ్యాపీగా ఉన్నారు. రేవంత్ కూడా భేషజాలకు పోకుండా గ్రౌండ్ రియాలిటీని గమనించి ప్రజాగ్రహానికి మరింతగా గురికాకుండా మంచినిర్ణయమే తీసుకున్నారు.
ఇక మొదటి నిర్ణయం ఏమిటంటే దిలావర్ పూర్లో తొందరలో ప్రారభం అవ్వాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరి విషయంపైన కూడా జనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చాలాకాలంగా దిలావర్ పూర్, గుండపల్లి తదితర గ్రామాల జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫ్యాక్టరి ఏర్పాటుకు అనుమతిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిర్మాణం పూర్తిచేసుకుని ఉత్పత్తికి రెడీ అవుతున్న నేపధ్యంలో నాలుగు గ్రామాల జనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. తీవ్రస్ధాయిలో నిరసనలు చేశారు. ఏకధాటిగా 48 గంటల పాటు వందలాదిమంది మహిళలు జాతీయరహదారిని స్తంబింపచేయటంతో ప్రభుత్వానికి సెగ తగిలింది. ఇదే సమయంలో ఆర్డీవో రత్న కల్యాణిపైన స్ధానికుల దాడి, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం, ఎస్ఐపైన దాడిచేసి కొట్టడం లాంటి ఘటనలు జరగటంతో తెలంగాణలో సంచలనమైపోయింది. వివాదం ముదిరిపోతుండటాన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే ఇథనాల్ ఫ్యాక్టరీని దిలావర్ పూర్ నుండి తరలించటమో లేకపోతే అనుమతులు రద్దుచేయటమో చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రజలకు కలెక్టర్ ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.
అయితే తాజాపరిణామాలను చూస్తుంటే ఫ్యాక్టరీ అనుమతులను రద్దుచేసేట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం తరపున కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇవ్వగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే గ్రామస్తుల దెబ్బకు రేవంత్ ప్రభుత్వం దిగొచ్చిందని. నిజానికి రేవంత్ ప్రభుత్వం దిగొచ్చింది ఏమీలేదు. ఎందుకంటే ఫ్యాక్టరీకి అన్నీ అనుమతులిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ హయంలోనే ఫ్యాక్టరీకి అనుమతులు రావటం, నిర్మాణం కూడా మొదలైంది. అప్పట్లోనే జనాలు ఎంత వ్యతిరేకించినా కేసీఆర్ ప్రభుత్వం లెక్కచేయలేదు. కేటీఆర్ తెలివైన వారయ్యుంటే ఇపుడు దిలావర్ పూర్ విషయంలో నోరుమెదపకూడదు. కాని అందుకు విరుద్ధంగా కేటీఆర్ వ్యవహరిస్తుండటంతో రవంత్ ప్రభుత్వానికి మండింది. అన్నీ అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చి ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుడ్డకాల్చి మొహాన వేస్తోందని మంత్రి సీతక్క(Minister Seethakka) మండిపోయారు.
అందుకనే తమకు సంబంధంలేని ఫ్యాక్టరీ విషయంలో తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలని, జనాగ్రహానికి గురికావాలా ? అని ఆలోచించిన రేవంత్ ప్రభుత్వం బహుశా ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయబోతోందనే సంకేతాలు కనబడుతున్నాయి. మొత్తానికి జనాల సంక్షేమంతో ముడిపడిన పై రెండు అంశాల్లో రేవంత్ రెడ్డి తెలివైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.