అయోధ్య రామాలయానికి-రామప్ప దేవాలయానికి ఉన్న కనెక్షన్ తెలుసా ?
x

అయోధ్య రామాలయానికి-రామప్ప దేవాలయానికి ఉన్న కనెక్షన్ తెలుసా ?

రామప్పదేవాలయం(Ramappa Temple) పునాదులకు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీని పోలిన పునాదుల సాంకేతికతనే అయోధ్య ఆలయం(Ayodhya Rama Temple) నిర్మాణంలో కూడా అనుసరించటం.


అవును, అయోధ్యలో ఈమధ్యనే నిర్మితమైన రామాలయానికి, సుమారు 830 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో వరంగల్ జిల్లాలో నిర్మించిన రామప్ప దేవాలయానికి ఒక కనెక్షన్ ఉంది. అదేమిటంటే రామప్పదేవాలయం(Ramappa Temple) పునాదులకు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీని పోలిన పునాదుల సాంకేతికతనే అయోధ్య ఆలయం(Ayodhya Rama Temple) నిర్మాణంలో కూడా అనుసరించటం. 2019లో అయోధ్య(Ayodhya) పట్టణంలో రామాలయం నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ 2020, ఆగస్టు 5వ తేదీన నరేంద్రమోడి చేశారు. వెంటనే పునాదులు తీయటం కూడా మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ (Ramajanma Bhoomi Teerda Trust) పర్యవేక్షణలో దేవాలయం నిర్మాణం మొదలైంది. 2.77 ఎకరాల స్ధలంలో మొదటి అంతస్తు నుండి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో నిర్మించబోతున్నారు. పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులతో ఆలయాన్ని నిర్మించారు. నాలుగంతస్తులుగా నిర్మించబోతున్న దేవాలయంలో ఒక్కో అంతస్తు మధ్య 20 అడుగుల గ్యాప్ ఉంటుంది. మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 74 స్తంభాలతో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మందిరం మొత్తం మీద 392 స్తంభాలు, 44 తలుపులును ట్రస్ట్ ఏర్పాటు చేస్తోంది.

వందల అడుగుల పొడవు, వెడల్పుతో నిర్మితమవుతున్న దేవాలయంలో టన్నుల బరువున్న స్తంభాలను ఏర్పాటుచేస్తున్నారు. వందల టన్నుల భరువున్న స్తంభాలు, తలుపులు, శిల్పాలు తదితరాలను భరించటం అంటే మామూలు విషయంకాదు. ఇన్ని వందల టన్నుల బరువున్న నిర్మాణాన్ని మోయటంలో అత్యంత కీలకమైన పాత్ర పునాదులదే. ఇంతటి భరువున్న దేవాలయాన్ని మోయాలంటే పునాదులు ఇంకెంత పటిష్టంగా ఉండాలి ? అందుకనే నిర్మాణ సంస్ధ సిమెంట్ కాంక్రీట్ పైల్స్ టెక్నాలజీతో పునాదులు మొదలుపెట్టింది. పైల్స్ అంటే సిమెంటుతో బీములు(భారీస్తంభాలు) వేయటం మొదలుపెట్టింది. దేవాలయం నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు నిర్మాణసంస్ధ 1200 పైల్స్ వేయాలని నిర్ణయించింది. ఒక్కో పైల్ ను భూమిలోపల 120 అడుగుల లోతులో వేయాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నట్లుగానే నిర్మాణ సంస్ధ 2 పైల్స్ ను కూడా వేసింది. రెండు పైల్స్ వేయగానే పునాదుల పని ఆగిపోయింది. దానికి కారణం ఏమిటంటే పునాదులు వేయటానికి నిర్మాణ సంస్ధ అనుసరిస్తున్న టెక్నాలజీలో లోపాలున్నట్లుగా వరంగల్(Warangal), ఎన్ఐటి(NIT)లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంటు రిటైర్డ్ ప్రొఫెసర్ మండేల పాండురంగారావు(Prof Mandela Pandu Ranga Rao) ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)కి లేఖ రాయటమే. రామాలయం నిర్మాణం, పునాదులు తదితర విషయాలను ప్రొఫెసర్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. దాంతో వెంటనే స్పందించారు.

నిర్మాణసంస్ధ అనుసరిస్తున్న సాంకేతికత కారణంగా దేవాలయం నిర్మాణం పటిష్టంగా ఉండదని ప్రొఫెసర్ కు అర్ధమైంది. అందుకనే అదే విషయాన్ని ప్రధానమంత్రికి రాసిన లేఖలో చెప్పారు. ఇదే సమయంలో నిర్మాణసంస్ధ అనుసరిస్తున్న టెక్నాలజీలో లోపాలను వివరిస్తు ఏ పద్దతిలో పునాదులు వేస్తే దేవాలయం నిర్మాణం పటిష్టంగా ఉంటుందో కూడా వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి ప్రొఫెసర్ కు ఎలాంటి సమాధానం రాలేదు. అయితే కొంతకాలానికి రామజన్మభూమి ట్రస్ట్ నుండి అయోధ్యకు రావాలని ప్రొఫెసర్ కు ఆహ్వానం అందింది. అంటే ప్రధానమంత్రికి ప్రొఫెసర్ రాసిన లేఖ ప్రధాని కార్యాలయం నుండి ట్రస్ట్ కు వెళ్ళిందని అర్ధమవుతోంది. ట్రస్ట్ ముఖ్యులను ప్రొఫెసర్ తో మాట్లాడమని చెప్పటం వల్లే ట్రస్టు నుండి ప్రొఫెసర్ కు ఆహ్వానం అందింది.

ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్ళిన ప్రొఫెసర్ నిర్మాణసంస్ధ తీసిన రెండు పైల్స్ ను పరిశీలించారు. నిర్మాణసంస్ధలోని ఇంజనీర్లతో మాట్లాడి పునాదులు తీయటానికి నిర్మాణసంస్ధ ఉపయోగించిన టెక్నాలజీలోని లోపాలను వివరించారు. పైల్స్ టెక్నాలజీ(Piles Technology)కి బదులుగా ఏ పద్దతిలో వేస్తే పునాదులతో పాటు దేవాలయం నిర్మాణం కూడా పటిష్టంగా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రొఫెసర్ చెప్పింది ఏమిటంటే పునాదులు పటిష్టంగా ఉండాలంటే రామప్పదేవాలయం నిర్మాణంలో కాకతీయులు(Kakatiya rulers) పునాదులకు ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ(Sand Box Technology)ని ఉపయోగించాలని. శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు తీయటం వల్ల రామప్పదేవాలయం 830 సంవత్సరాలుగా ఎంత పటిష్టంగా ఉందో ప్రొఫెసర్ వివరించారు. ప్రొఫెసర్ చెప్పిందాంతో ట్రస్ట్ సంతృప్తి చెంది వెంటనే పైల్స్ వేయటం ఆపేయాలని నిర్మాణ సంస్ధకు చెప్పింది. అందుకనే రెండు పైల్స్ వేసిన నిర్మాణ సంస్ధ తర్వాత పనులను నిలిపేసింది.



శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు ఏ విధంగా వేయచ్చో కూడా ప్రొఫెసర్ చెప్పిన విషయాలను ఒక రిపోర్టు రూపంలో ట్రస్ట్ ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో)(PMO) అందించింది. రిపోర్టును పరిశీలించిన తర్వాత ఢిల్లీ, ముంబయ, చెన్నై ఐఐటి కాలేజీల్లోని సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. నిపుణుల కమిటి అనేకసార్లు ప్రొఫెసర్ తో ఆన్ లైన్లో చర్చలు జరిపింది. చివరకు ప్రొఫెసర్ చెప్పిందే కరెక్టని ఫైనల్ చేసి అదే విషయాన్ని కమిటి పీఎంవోకు రిపోర్టు పంపింది. అయితే కాకతీయులు రామప్పదేవాలయం నిర్మాణంలో పునాదులు తీయటానికి ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీని యథాతధంగా ఇపుడు ఉపయోగించటం కష్టమని కూడా చెప్పింది. అందుకనే శాండ్ బాక్స్ టెక్నాలజీని పోలిన ‘ఓపెన్ ఎక్స్ కవేషన్’ టెక్నాలజీతో పునాదులు తీయవచ్చని కూడా కమిటి సభ్యులు ఏకగ్రీవంగా పీఎంవో ద్వారా ట్రస్ట్ కు సూచించారు. ఈ టెక్నాలజీ విషయాన్ని కమిటి ప్రొఫెసర్ తో కూడా చర్చించిన తర్వాత రిపోర్టును పీఎంవోకు పంపింది.

అప్పుడు ట్రస్ట్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రొఫెసర్ ను మళ్ళీ అయోధ్యకు పిలిపించుకుని కమిటి సూచించిన ప్రత్యామ్నాయ టెక్నాలజీపై చర్చించారు. ప్రొఫెసర్ సలహా ప్రకారం పైల్స్ స్ధానంలో ‘ఓపెన్ ఎక్స్ కవేషన్’ పద్దతిలో పునాదులు వేయాలని ట్రస్ట్ డిసైడ్ అయ్యింది. ఓపెన్ ఎక్స్ కవేషన్ పద్దతిలోనే 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్సు, 50 అడుగుల లోతులో మట్టి తవ్వి శాండ్ స్పెషల్ మిక్సర్ తో పునాదులు వేశారు. దేవాలయం నిర్మాణమంతా ఓపెన్ ఎక్స్ కవేషన్ పద్దతిలో వేసిన పునాదుల మీదే జరిగింది. ఓపెన్ ఎక్స్ కవేషన్ టెక్నాలజీ అంటే బాగా లోతులో గొయ్యితీసి శాండ్ ను లేయర్లుగా వేసి లేయర్ల మధ్య సిమెంట్ లేయర్లు వేసి క్యూరింగ్ చేయటం అని ప్రొఫెసర్ పాండురంగారావు చెప్పారు. రామప్పదేవాలయం పరిరక్షణకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా ప్రొఫెసర్ దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. స్వతహాగా ఇంజనీరు కూడా కావటంతో రామప్పదేవాలయం నిర్మాణం, పునాదులకు ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీపై ప్రొఫెసర్ కు నూరుశాతం సాధికారత ఉంది.

ఇదే విషయాన్ని ‘తెలంగాణా ఫెడరల్’ తో ప్రొఫెసర్ మాట్లాడుతు ‘తాను జోక్యం చేసుకుని ఉండకపోతే దేవాలయం నిర్మాణ పునాదులు సిమెంట్ పైల్స్ పద్దతిలోనే వేసుండేవార’ని చెప్పారు. ‘పైల్స్ పద్దతిలో పునాదులు తీసుంటే పునాదుల జీవితకాలం 100 ఏళ్ళకు మించి ఉండేదికాద’న్నారు. ‘పునాదుల జీవితకాలం 100 ఏళ్ళయినపుడు దేవాలయం వెయ్యేళ్ళు ఎలా నిలబడగల’దు అని ప్రశ్నించారు. ఏ నిర్మాణమైనా పటిష్టంగా ఉండాలంటే పునాదులు కూడా అంతే పటిష్టంగా ఉండాలన్నారు. అందుకనే రామప్పదేవాలయం పునాదులకు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీనే ఉపయోగించాలని తాను సూచించినట్లు ప్రొఫెసర్ చెప్పారు.

అయితే ఇప్పటి పరిస్ధితుల్లో ‘శాండ్ బాక్స్ టెక్నాలజీని నూరుశాతం ఉపయోగించటం సాధ్యంకాదని నిర్ణయించిన నిపుణుల కమిటి శాండ్ బాక్స్ టెక్నాలజీని పోలిన ఓపెన్ ఎక్స్ కవేషన్ పద్దతిలో పునాదులు తీస్తే పటిష్టంగా ఉంటుంద’ని అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఓపెన్ ఎక్స్ కవేషన్ పద్దతి ఉపయోగించటం వల్ల పునాదులు కూడా ఇపుడు పటిష్టంగా ఉందన్నారు. ‘పునాదులు అత్యంత పటిష్టంగా వేసిన కారణంగా లాంగ్విటీ అడ్ డ్యూరబులిటీ పద్దతిలో పునాదులతో పాటు దేవాలయం కూడా వెయ్యేళ్ళు ఉంటుంద’ని ప్రొఫెసర్ ఘంటాపథంగా చెప్పారు. దేవాలయం నిర్మాణానికి సంబంధించి శంకుస్ధాపన, పునాదులు తదితర వివరాలను తెలుసుకుని తనంతట తానుగానే పీఎంవోకు లేఖ రాసినట్లు చెప్పారు. ట్రస్ట్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇదే విషయమై తనతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ‘దేవాలయం నిర్మాణంలో ఏదో రూపంలో సేవచేసే భాగ్యాన్ని శ్రీరాముడే తనకు కల్పించినట్లుగా తాను భావిస్తున్న’ట్లు ప్రొఫెసర్ పాండురంగారావు చెప్పారు.

Read More
Next Story