Anakonda|ఈ అవినీతి అనకొండ ఆస్తులెన్నో తెలుసా ?
x

Anakonda|ఈ అవినీతి అనకొండ ఆస్తులెన్నో తెలుసా ?

అవినీతి అనకొండ(Anakonda) అని ఎందుకు అనాల్సొచ్చిందంటే ఇప్పటివరకు లెక్కించిన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రు. 600 కోట్లుంటుందని అంచనా.


అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద అవినీతి అనకొండను పట్టుకున్నారు. అవినీతి అనకొండ(Anakonda) అని ఎందుకు అనాల్సొచ్చిందంటే ఇప్పటివరకు లెక్కించిన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రు. 600 కోట్లుంటుందని అంచనా. పట్టుబడిన ఆస్తులు, బంధువులు, సన్నిహితుల ఇళ్ళల్లో దొరుకుతున్న ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. ఈమధ్యకాలంలో ఇంతభారీ ఎత్తున ఆస్తులు సంపాదించిన అవినీతి అనకొండను పట్టుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే ఏసీబీ(ACB) అధికారులు సదరు అధికారి అవినీతిని బయటపెట్టేందుకు దాడిచేయలేదు. వేరే అధికారిపైన దాడిచేసినపుడు ఈ అవినీతి అనకొండ యాధృచ్చికంగా వచ్చి తగులుకున్నాడు. తగులుకున్న అనకొండ ఇంట్లో సోదాలు చేసినపుడు ఆశ్చర్యపోయేరీతిలో ఆస్తులు బయటపడుతున్నాయి.

ఇపుడు విషయం ఏమిటంటే ఏసీబీకి పట్టుబడిన నిఖేష్ కుమార్(Nikesh Kumar) గండిపేట(Gandipet) సర్కిల్ ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నాడు. ఏఈఈ అంటే ఇరిగేషన్ శాఖలో మధ్య స్ధాయి అధికారనే చెప్పాలి. ఇలాంటి అధికారి అవినీతే సుమారు రు. 600 కోట్లంటే ఇక అంతకుమించిన స్ధాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారుల సంపాదన ఇంకెంత ఉంటుందో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఇపుడు టాక్ ఆప్ ది సిటీ, టాక్ ఆఫ్ తెలంగాణా అంతా హైడ్రా(Hydra) గురించే. చెరువులు, కాల్వల బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ లో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది. దీంతో హైడ్రా యాక్షన్ మొత్తం పెద్ద వివాదాస్పదమైపోయింది. బడాబాబులు, పెద్ద పెద్ద నిర్మాణసంస్ధలు జలవనరుల బఫర్ జోన్(Buffer Zone), ఫుల్ ట్యాంక్ లెవల్(Full Tank Level) లో కూడా నిర్మాణాలు చేశాయి. ఇపుడు ఆ నిర్మాణాల వివరాలన్నింటినీ హైడ్రా బయటకు తీస్తోంది. బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఎలాంటి నిర్మాణాలకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇవ్వకూడదు. అయితే చాలామంది ఉన్నతాధికారులు లంచాలు మరిగి, అవినీతికి పాల్పడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అలాంటి అనుమతులు ఇచ్చిన అధికారుల్లో హెరూర్ నిఖేష్ కుమార్ కూడా ఉన్నాడు.

జలవనరులు ఏమైపోయినా పర్వాలేదు తాను అడిగినంత డబ్బు ఇస్తే చాలు ఎలాంటి చెరువు, కాలువ దగ్గరయినా సరే నిఖేష్ కుమార్ నిరభ్యంతరంగా నిరభ్యంతర పత్రం అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీచేసేస్తాడట. నాటకీయంగా ఏసీబీకి బట్టుబడిన నిఖేష్ ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ళమీద కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. నిఖేష్ కు సంబంధించిన ఏ ఇంట్లో సోదాలు చేసినా కళ్ళుచెదిరే ఆస్తులు, బంగారం(Gold Jewellery) బయటపడుతున్నాయని అధికారులు అంటున్నారు. హైదరాబాదు(Hyderabad)లోని బండ్లగూడ జాగీర్ లోని పెబెల్ సిటి గేటెడ్ కమ్యూనిటిలోని విల్లాతో పాటు 19 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు సోదాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాదులో 3 ఫాం హౌసులు, 3 విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన ప్రాంతాల్లో 5 ఇంటి స్ధలాలు, 6 ప్లాట్లు, 6 ఖరీదైన అపార్టమెంట్లు, 2 కమర్షియల్ బిల్డింగులు, కిలోల కొద్ది బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి.

ఇపుడు బయటపడిన ఆస్తులు, బంగారం, వెండి విలువే సుమారు రు. 600 కోట్లుంటుందని అంచనా. ఇంకా పదులసంఖ్యలో బ్యాంకు లాకర్లు(Bank Lockers) ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు ఆదివారం కాబట్టి బ్యాంకుల దగ్గరకు ఏసీబీ అధికారులు వెళ్ళలేదు. బహుశా లాకర్లు ఉన్న బ్యాంకుల వివరాలన్నీ సేకరించి సోమవారం నాడు బ్యాంకులకు వెళ్ళి లాకర్లను ఓపెన్ చేయవచ్చని సమాచారం. ఇరిగేషన్ శాఖలోని అధికారులపై ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు దాడుచేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ నిఖేష్ ఎలా పట్టుబడ్డాడు ?

మణికొండ, నెక్నాంపూర్ లో నిర్మాణానికి అనుమతి ఇవ్వటం కోసం రు. 4 లక్షల లంచానికి డీల్ ఫైనల్ చేసుకున్నారు. ముందుగా బిల్డర్ 1.5 లక్షల రూపాయలు ఈఈ కే. బన్సీలాల్ కు ఇచ్చేశాడు. లంచం అందిన తర్వాతే ఈఈ తన సర్వేయర్ ను సర్వే చేయమని పంపాడు. సర్వేకి వచ్చిన సర్వేయర్ కూడా 40 వేలు లంచం తీసుకున్నాడు. సర్వేచేసిన తర్వాత పూర్తి రిపోర్టును ఈఈకి అందించాడు. రిపోర్టు వచ్చేసింది కాబట్టి దాని ఆధారంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీచేయటమే మిగిలుంది. ఆ సర్టిఫికేట్ తీసుకునేందుకు రెడ్ హిల్స్ లోని ఆపీసుకు రమ్మని బిల్డర్ కు కబురుపంపారు. వచ్చేటప్పుడే ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బు రు. 2.5 లక్షలు తీసుకురమ్మని చెప్పారు. బిల్డర్ రు. 2.5 లక్షలు తీసుకుని రెడ్ హిల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. చేతిలోని డబ్బును బన్సీలాల్ కు ఇచ్చేటపుడు సడెన్ గా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అయితే దాడి జరిగిన విషయం తెలీని నిఖేష్ కుమార్ అక్కడకు చేరుకున్నాడు. నిఖేష్ ను ఎవరని ఏసీబీ అధికారులు అడిగినపుడు లంచం తీసుకోవటంలో తనతో పాటు నిఖేష్ కూడా భాగస్వామే అని బన్సీలాల్ చెప్పాడు. దాంతో ఏసీబీ అధికారులు బన్సీలాల్ తో పాటు నిఖేష్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించి మే 30వ తేదీన అరెస్టుచేశారు. నిఖేష్ ఎక్కడపనిచేసినా డబ్బు డబ్బు తప్ప ఇంకేమీ చూసేవాడుకాదని అంటున్నారు. లంచంగా తీసుకున్న డబ్బులో సగం డబ్బును దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితమిత్రులకు ఇచ్చేవాడు. దాంతో అక్రమాస్తులను తమ పేరుమీద రిజిస్టర్ చేయటానికి బంధువులు, సన్నిహితులు అంగీకరించారు. ఈ కారణంగానే సుమారు 20 మంది పేరుమీద నిఖేష్ అక్రమాస్తులు రిజిస్టర్ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సోమవారం బ్యాంకులు తెరిచినపుడు లాకర్లు ఓపెన్ చేస్తే వాటిల్లో ఏమున్నాయో బయటపడుతుంది.అప్పుడు ఆస్తుల విలువ రు. 600 కోట్లనుండి మరింత పెరిగే అవకాశముంది.

Read More
Next Story