
ఆంధ్ర అప్పుల బడ్జెట్ ఎంతో తెలుసా?
ఏపీలో బడ్జెట్ కల సాకారం కావాలంటే లక్ష కోట్ల పైన అప్పులు తీసుకురానున్నారు. అంటే అప్పులు లేకుంటే ప్రభుత్వం ముందుకు సాగదు.
బడ్జెట్ రూపొందించేటప్పుడు మిగులు బడ్జెట్ ఉండాలని కోరుకుంటారు. లేదంటే రాబడులు, ఖర్చులు సమానంగా ఉంటే ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహల పల్లకిలో ఉందనే విమర్శలు వచ్చాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047కు ఈ బడ్జెట్ వారధిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. పేద వర్గాలను వడ్డున పడేసేందుకు, సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ బడ్జెట్ తో సంక్షేమ ఫలాలు అందేలా కనిపించడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ పక్కన బెడితే 2025-26 బడ్జెట్ ఆశల పరంపరగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఎప్పుడూ లేనంత బడ్జెట్
రానున్న ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. రూ. 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టడం ఇదే మొదటి సారి. రాబడులు మాత్రం రూ. 2,17,976.53 కోట్లు చూపించారు. రెవెన్యూ వ్యయం కింద రూ. 2,51,162.5 లు చూపించారు. ఇంత భారీ బడ్జెట్ తో అప్పులు చేయక తప్పటం లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకని పలువురు ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
లక్ష కోట్లకు పైనే అప్పు కావాలట
ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలంటే రూ. 1,04,382కోట్ల రుణం తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు బడ్జెట్ లోనే అప్పుల చిట్టా కూడా పొందు పరిచారు. బహిరంగ మార్కెట్ నుంచి రూ. 80,456.50 కోట్లు, కేంద్రం నుంచి రూ. 21,700 కోట్లు ఇతర సంస్థల నుంచి రూ. 1,500 కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించినట్లు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం పేర్కొనడం విశేషం. మొత్తం రుణాల్లో 77 శాతం బహిరంగ మార్కెట్ నుంచి, 21 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన రుణం కార్పొరేషన్ల ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అప్పులు మూల ధన పెట్టుబడులుగా ఉండాలి
అప్పులు మూలధన పెట్టుబడులుగా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. మాటలకు పరిమితం కాకుండా అమలు చేస్తే మంచి జరుగుతుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవని రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులు, వడ్డీలు చెల్లించడానికే రూ. 60వేల కోట్లు ఖర్చవుతున్నాయని ఇలాంటి పరిస్థితులు మారాలంటే సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సి ఉందన్నారు.
అప్పుల బడ్జెట్
ఇంతన్నడంతన్నడే గంగరాజు ముంత మామిడి పప్పన్నడే అని ఓ సినిమాలో ఉన్న డైలాగ్ గుర్తుకు వచ్చేలా ప్రభుత్వ బడ్జెట్ ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అభిప్రాయ పడ్డారు. ఇది అప్పుల బడ్జెట్ అని ఈ బడ్జెట్ వల్ల ప్రజల నెత్తిన భారం పడటం తప్ప సంపద సృష్టి ఎక్కడా కనిపించడం లేదన్నారు.