ఏపీలో పూటగడవని వారు ఎంత మంది ఉన్నారో తెలుసా?
ఎపిలో పూట గడవని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. వారు అర్ధాకలితో బతుకుతున్నారు. వీరికి ఏదైనా చేసి పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో పేదల సంఖ్య కోట్లల్లో ఉంది. సుమారు కోటిన్నర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఐదు కోట్ల మంది జనం ఏపీలో ఉన్నారనుకుంటే వారిలో కోటిన్నర మంది పేదలు అనుకుంటే భారీ స్థాయిలో పేదరికం ఉందని అర్థం. అయితే తెల్లరేషన్ కార్డులు చాలా మంది డబ్బున్న వారి వద్ద కూడా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇవి ఇలా ఉంటే ఒక్క పూట కూడా అన్నం తినేందుకు నోచుకోని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని కలెక్టర్‌ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. వీరి కోసం ఏదైనా చేయాలని, అందుకు ఏమి చేయాలో ఆలోచించాలని కలెక్టర్‌లను కోరారు.
ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే గ్రామాల్లో బతకడమే కష్టంగా ఉన్న రోజుల్లో పేదరికాన్ని జయిస్తూ ఈ స్థాయికి వచ్చాము. మేమందరం గ్రామాల్లో.. మామూలు వ్యక్తుల కుటుంబంలోనే పుట్టాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. దాన్ని మనందరం ఉపయోగించుకున్నాం. సమాజంలో ఒక ప్రత్యేకతను సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆఊర్లోనే ఫర్ డే కనీసం వంద నుంచి రెండు వందలు సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఇది పెద్ద కష్టం కాదు. అందుకే జీరో పావర్టీ తీసుకు రావాలని నేను కోరుతున్నా. 14 లక్షల వరకు పూట గడవని వారు ఉన్నారు. వారిమీద ఫోకస్ చేద్దాం. మీరు ఎక్కడున్నా మీ మైండ్‌లో అనునిత్యం పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌లను కోరారు.
ముఖ్యమంత్రి చెప్పిన దాని కంటే ఎక్కువ మందే పూట గడవని వారు ఉన్నారని పలు సర్వేల్లో వెల్లడైంది. ఇంకా రాష్ట్రంలో సంచార జాతుల వారు ఉన్నారు. వీరు ఇక్కడ బతికేందుకు సరైన అవకాశాలు లేక రోజుకో ఊరు తిరుగుతూ వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఏడాదిలో ఒకసారి వారు నివాసం ఉంటున్న గ్రామానికి వచ్చి వెళుతున్నారు. సంచార జీవనం నుంచి విముక్తులను చేసేందుకు ఏర్పాటు చేసిన మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ (ఎంబీసీ) అలంకార ప్రాయంగా ఉంది. ఈ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి సంచార జీవనంలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించి వారిని సంచార జీవనం నుంచి విముక్తులను చేయాలని సంచార జాతుల అభివృద్ధి మండలి రాష్ట్ర చైర్మన్ గోరంట్ల శ్రీనివాసరావు కోరారు.
Next Story