అమరావతి నిర్మాణ ప్రతిపాదన ఎన్ని కోట్లో తెలుసా...
అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి నిర్మాణానికి నేనున్నాననే భరోసా ఇస్తాడా? చంద్రబాబు పర్యటన నిధులు సమకూరుస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా ఎలా మార్చాలి. పెట్టుబడి దారులను ఎలా ఆకర్షించాలి. ఎక్కడా లేని వనరులు ఇక్కడ ఉన్నాయని ఎలా చూపించాలి. ఇవీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పాలకులను అతలాకుతలం చేస్తున్న ప్రశ్నలు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతోందనే విషయాన్ని గ్రాఫ్స్ ద్వారా ఆకట్టుకుంది. ఆ విధంగానే పనులు మొదలు పెట్టింది. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమరావతిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వదిలేసింది.
ఇప్పుడు ఎవరు అమరావతి గట్టెక్కిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతిని ముందుకు తీసుకు పోతారా? ఎందుకంటే ఆయన పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి అమరావతి శంకుస్థాపన సమయంలో పునాదుల్లో కలిపారు. ఆ పునాదుల్లో కలిపిన పవిత్రమైన మట్టి, నీరు మాత్రమే అమరావతిని కాపాడిందని ఇటీవల స్వేతప్రతం విడదుల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడం విశేషం. స్వేతపత్రం విడుదల చేసేటప్పుడు పలు కోణాలు ఆలోచిస్తారు. చంద్రబాబు కూడా పలు కోణాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు.
పెట్టుబడుదారులను రాబట్టడమే ప్రధమ కర్తవ్యం
ఇప్పటికే విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలు అమరావతిలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థలతో పాటు కాలుష్యం లేని పలు పరిశ్రమలు మంగళగిరిలో కొన్ని ఉన్నాయి. ఇంకా ఐటీ సంస్థలు, ఇతర సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది ముందడుగు వేస్తున్నారు. వీరందరినీ ఆహ్వానించి ముందుకు అడుగులు వేయడం ద్వారా అనుకున్న అభివృద్ధిని సాధించడమే ప్రథమ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రాజధాని నిర్మాణం ఎన్ని కోట్లో తెలుసా?
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 9,617 కోట్లతో 2019లో టెండర్లు పిలిచారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత అమరాతి నిర్మాణాన్ని అంగరంగ వైభవంగ చేపట్టాలని నాటి పాలకులు భావించారు. అయితే అనుకున్న స్థాయిలో డబ్బులు లేనందున అడుగులు పూర్తిస్థాయిలో ముందుకు పడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ. 1,958 కోట్లతో పనులు అప్పటి వరకు పూర్తి చేయగలిగారు. మిగిలిన పనులు పూర్తి చేయాలంటే 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొదలు పెట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని వదిలేసింది. నాకు అమరావతి పనికి రాదని, విశాఖపట్నం, కర్నూలు, అమరావతి మూడు రాజధానులుగా ఉంటాయని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
పూర్తయిన పనులు రూ. 1,958 కోట్లు మాత్రమే...
2019 నుంచి ఇప్పటి వరకు అమరావతిలో పూర్తయిన పనులు కేవలం రూ. 1,958 కోట్ల విలువైన పనులు మాత్రమే. ఈ పనులకు సంబంధించి ఇంకా రూ. 1,268 కోట్ల బిల్లులు సంబంధిత కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి స్వేతపత్రంలో పేర్కొన్న అంశాలు మాత్రమే.
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, రూ. 700 కోట్లతో చేపట్టగా రూ. 444 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. అంటే 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఎన్‌జీవోల నివాస భవనాలు రూ. 1,355 కోట్లతో చేపట్టగా రూ. 522 కోట్ల విలువైన పనులు పూర్తి చేయగలిగారు. అంటే సుమారు 62 శాతం పనులు పూర్తయినట్లు చెప్పొచ్చు. అదే విధంగా ప్రభుత్వ అధికారుల కోసం గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–డి పనులకు సంబందించి రూ. 975 కోట్లు కేటాయించగా అందులో రూ. 408 కోట్ల విలువైన సుమారు 66 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 17 ప్రాజెక్టులకు సంబంధించి ప్రిన్స్‌పల్ కార్యదర్శుల బంగళాలు, రూ. 275 కోట్లతో చేపట్టి రూ. 61 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర మంత్రులు, హైకోర్టు జడ్జిల బంగళాలకు సంబంధించి రూ. 235 కోట్లతో పనులు చేపట్టి రూ. 54 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. జుడిషియల్ కాంప్లెక్స్ కోసం రూ. ఫేజ్–1లో రూ. 115 కోట్లకు కాను రూ. 110 కోట్లు, ఫేజ్–2లో 64 కోట్లకు కాను రూ. 55 కోట్ల పనులు పూర్తయినట్లు స్వేత పత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. అలాగే అడ్వకేట్ల బ్లాక్‌ల కోసం రూ. 26 కోట్లు వెచ్చించారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌ను రూ. 1,556 కోట్లతో చేపట్టి రూ. కేవలం 26 కోట్ల విలువైన ర్యాంపులు మాత్రమే పూర్తి చేయగలిగారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఎక్కడి పనునులు అక్కడ నిలిచిపోయాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ భవన నిర్మాణాల కోసం రూ. 662 కోట్లతో పనులు మొదలు పెట్టి రూ. 53 కోట్లు ఖర్చు చేశారు. అలాగే మరో నాలుగు టవర్ల నిర్మాణాలకు రూ. 2041 కోట్లతో పనులు మొదలు పెట్టి రూ. 117 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. అసెంబ్లీ నిర్మాణానికి రూ. 555 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు జరుగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 25 శాతంలోపు జరిగిన పనులన్నిటినీ ఆపివేయాలని అధికారులను ఆదేశించింది. అమరావతిలో అప్పటికే 30 నుంచి 80 శాతం వరకు కీలకమైన ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. అయినా ఒక్క నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకుపోలేదు. 80 శాతం పూర్తయిన పనులను పరిశీలించి మిగిలిన 20 శాతం పూర్తి చేసి ఉంటే పాలనలో చాలా వరకు ఉపయోగపడేవి. కానీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాంపు కార్యాలయాలు, హైకోర్టు జడ్జిల క్యాంపు కార్యాలయాల కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేసిఉంటే పాలన చాలా సులువుగా, అనుకూలంగా ఉండేది. ఎక్కడి పనులను అక్కడ వదిలేయడంతో చాలా భవనాల్లో ఐరన్ తుప్పుపట్టింది. తిరిగి వాటిని పూర్తి చేయాలంటే ఐరన్ రాడ్స్ చివర్లు కట్ చేసి కాంక్రీట్ వేసిన పై భాగాలను కూడా కొంత కత్తిరించి తిరిగి అక్కడి నుంచి నిర్మాణాలు సాగించాల్సి ఉంటుంది. చేసిన పనిని రెండో సారి కొంత చేయాల్సి వస్తుంది. ఇది అదనపు ఖర్చుతో కూడిన వ్యవహారం అని ముఖ్యమంత్రి స్వేతపత్రంలో వివరించారు.
ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్
అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు.
Next Story