కాపులను వీరు ప్రభావితం చేస్తారా?
x

కాపులను వీరు ప్రభావితం చేస్తారా?

కాపు నాయకులమని చెప్పుకుంటున్న వారు కాపులను 2024 ఎన్నికల్లో ప్రభావితం చేస్తారా? చేస్తే ఏమేరకు వీరి ప్రభావం కాపులపై ఉంటుంది? కాపు ఉద్యమం రాయలసీమలో ఎందుకు లేదు?


ఆంధ్రప్రదేశ్ లో కాపుల సమస్యలు తమ వల్లే పరిష్కారం అవుతాయని కొందరు భావిస్తున్నారు. తామే నాయకుల మని, రాష్ట్రంలోని కాపులంతా తమతోనే ఉన్నారని భావిస్తున్న వారు కాస్త ఎక్కువగానే ఊహించుకుంటున్నారు. కుల ఉద్యమాల ద్వారా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారమైన దాఖలాలు లేవు. కులం అనేది ఒక సామాజిక అంశంగానే భావించాలి తప్ప కులం ద్వారానే అన్నీ పరిష్కారం అవుతాయని భావించడం తప్పని ఇప్పటి కుల సంఘాల నేతలకు తెలియనిది కాదు. అయినా వారి ధోరణిలో మార్పు రావడం లేదు. కులం పునాదులపైనే ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఉన్నారు.

రాయలసీమలో రాజకీయ నాయకుడిగానే రామచంద్రయ్యకు గుర్తింపు

రాయలసీమలో ఉన్న బలిజలను కాపులుగా భావించడం లేదు. రాయలసీయ ప్రాంతంలోని బలిజలను తెలగలు అని కూడా అంటారు. కోస్తాలో జరిగే కాపు కుల సంఘాల సమావేశాలకు కానీ, ఆందోళనా కార్యక్రమాలకు కానీ ఇంతవరకు రాలేదు. అంటే రాయలసీమలో కాపు, బలిజ, తెలగ ఉద్యమం అనేదే లేదు. కానీ అక్కడి నుంచి పలు పార్టీల్లో పనిచేసిన సి రామచంద్రయ్య కులం కార్డుతోనే రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. కానీ అక్కడి బలిజలు ఆయనను కులం నాయకునిగా ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు.

వంగవీటి రాధను కులం నాయకుడిగా చూస్తున్న పార్టీలు

విజయవాడలో వంగవీటి రంగా కాపు నాయకుడిగా ఎదిగారు. అయితే ఆయన కూడా ఎప్పుడూ కులం రంగు పులుముకోవాలని అనుకోలేదు. స్థానికంగా ఉండే కాపులు ఎవరికి వారు మా నాయకుడని చెప్పుకున్నారు. నిజానికి రంగా విజయవాడలో బతికేందుకు వలసలు వచ్చిన కార్మిక వర్గానికి నాయకత్వం వహించారు. వారి సమస్యలపై పోరాడి ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా నాయకుడిగా ఎదిగారు. ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ కూడా కులం కార్దును పెద్దగా ఉపయోగించుకున్న సందర్భాలు లేవు. అయితే రాజకీయ పార్టీల వారు రాధాకు కూడా కులం ముద్ర వేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాధాకృష్ణ కాపు కులం వారికి బాగా కావాల్సిన వాడిగా ఉంటున్నందున ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వారికి కాపులు అండగా ఉంటారని రాజకీయ పార్టీలు భావిస్తూ వచ్చాయి. మొదట కాంగ్రెస్ పార్టీలో, తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాధ ఆ తరువాత టిడిపిలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నందున తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం విజయవాడలో ప్రచారం చేస్తున్నారు.

కాపుల్లో గుర్తింపు సన్నగిల్లేలా చేసుకున్న ముద్రగడ

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడిగా కాస్త గుర్తింపు తెచ్చుకున్నా ఇటీవల అది కూడా పోయిందని చెప్పొచ్చు. కాపుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తే ఆయను కాపులు ఆదరించే వారేమో కాని, కాపు ఉద్యమం చేస్తూనే ఒకసారి ఒక పార్టీ గురించి, మరోసారి మరో పార్టీ గురించి కత్తికి రెండు వైపుల పదును అన్నట్లు మాట్లాడటాన్ని ఎవ్వరూ స్వాగతించడం లేదు. 2014లో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వం ఆయనపై, కాపు ముఖ్య కార్యకర్తలపై కేసులు నమోదు చేసింది. ఒక దశలో ఇంట్లో నుంచి ముద్రగడను బయటకు రాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు గ్రుహ నిర్బంధంలో ఉంచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా కాపుల ద్వారా చేయించారు. అయితే అలుగుడు మనస్తత్వం వున్న ముద్రగడ కాపు ఉద్యమాన్ని నడిపించడంలో సఫలం కాలేక పోయారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మధ్య ఉన్న సంబంధాల కారణంగా పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యవహారాలు, చంద్రబాబునాయుడు చేసిన రాజకీయాలపై పద్మనాభం గళం విప్పారు. పవన్ కళ్యాణ్ ను ఈ ఎన్నికల్లో ఓడించి తీరుతానని, లేదంటే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.

ఏ పార్టీలోనూ పనిచేసే అవకాశం లేని వీరి కులం కార్డు

ఇటు వంగవీటి రాధాకృష్ణ కానీ, అటు ముద్రగడ పద్మనాభం కానీ కాపు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలరనేది చర్చగా మారింది. రాజకీయ వర్గాలకు వీరు ఆయుధాలే తప్ప వీరి వల్ల కాపు ఓటు బ్యాంకు ఉంటుందని అనుకుంటే పొరపాటేననేది పలువురి వాదన. కాపులు ఏ పార్టీకి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించారని, నాయకులుగా చెప్పుకుంటున్న వారు తలో పార్టీలో వుంటూ చెబితే వింటారనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేర్చుకోలేదనే అక్కసుతోనే ముద్రగడ పవన్ పై విరుచుకు పడ్డారు. అదే జనసేనలో ముద్రగడను చేర్చుకుని వుంటే పవన్, ముద్రగడ మధ్య విభేదాలు వచ్చేవి కావనే వాదన కూడా ఉంది. విధిలేని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ కాపులను వైఎస్సార్సీపీ వైపు మళ్లించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడోననే చర్చ సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కాపుల సమస్యల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. కాపు నాయకుడిగా అప్పుడప్పుడు గొంతు విప్పే హరిరామ జోగయ్య కూడా పేరుకు మాత్రమే కాపు నాయకుడు. పవన్ కళ్యాణ్ కు ఒకసారి ముందు నుంచి మరోసారి వెనుకనుంచి మాట్లాడే వాడే తప్ప కాపులకు నాయకుడు కాలేక పోయాడు.

కాపులు పూర్తిగా ఆదరిస్తారని పవన్ భావిస్తున్నారా?

కాపులు తనను పూర్తి స్థాయిలో పిఠాపురం నుంచి ఆదరిస్తారనే ఆలోచనలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు గానే స్థానికంగా కాపులు భావిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో కాపులకు నేను నాయకత్వం వహిస్తున్నానని ఆమె చెప్పలేదు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పోస్టుల్లో పనిచేసి రాజకీయ అనుభవం సాధించారు. పార్టీల వారీగా కాపులు విడిపోయి వున్నారే తప్ప కులం పరంగా ఒకే వేదికపై లేరని ఎవరైనా నమ్మాల్సిందే.

అంటే ప్రస్తుతం కాపు నాయకులుగా చెప్పుకుంటున్న వారెవరూ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే సత్తా లేదని, ఏ పార్టీకి ఆపార్టీ కాపు సామాజిక వర్గ ఓట్లు చీల్చుకుని ముందుకు అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.

Read More
Next Story